ltrScrptTheme3

‘కుల గణన’ కాదు, ‘వర్గ గణన’ కావాలి!

Oct 20 2021 @ 02:46AM

జనాభా లెక్కల్లో, ప్రతీ కులానికీ సంబంధించిన వివరాలు వుండేలాగా ‘జనాభా లెక్కల సేకరణ’ జరగాలని, ఒక డిమాండు వుంది. ప్రతీ పది సంవత్సరాలకూ ఒకసారి జరిపే జనాభా లెక్కల సేకరణలో ఇప్పటి దాకా, షెడ్యూల్డ్ కులాల గురించీ, షెడ్యూల్డ్ జాతుల గురించీ మాత్రమే వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఇతర వెనకబడిన కులాల గురించి కూడా వివరాలు సేకరించాలని డిమాండు పెరుగుతోంది. రాజ్యాంగానికి సంబంధించిన భాష ప్రకారం, ‘వెనకబడిన తరగతులు (బ్యాక్‌వర్‌్డ క్లాసెస్‌)’ అంటే, సాంఘికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన కులాల వారందరూ వస్తారు. వీరిలో, ఎస్సీలూ, ఎస్టీలూ కాకుండా వున్న కులాల వారిని ‘ఇతర వెనకబడిన తరగతులు’ (అదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ = ఓబీసీ) అంటారు. 


ఇప్పుడు ఓబీసీకి చెందిన కులాల లెక్కలు కూడా తియ్యండి – అనే డిమాండు నడుస్తోంది. దీని వల్ల జనాభాలో, ఓబీసీలు ఎంత పెద్ద సంఖ్యలో వున్నారో, వారికి జనాభాలో తమ సంఖ్యకి తగిన అవకాశాలు – చదువుల్లో, ఉద్యోగాల్లో, ప్రభుత్వ పదవుల్లో, శాసనసభల్లో, ఇతరత్రా- దొరుకుతున్నాయా లేదా అనేది తేలి, అప్పుడు, ‘సామాజిక న్యాయం’ అనే దాన్ని సాధించవచ్చును అని ఓబీసీల వాదన. కేవలం, ఓబీసీల లెక్కే కాదు, ‘అగ్ర’కులాలు అనే వాటి లెక్కలు కూడా తియ్యాలి అని మరికొందరి వాదన. అలా చేస్తే, జనాభాలో ఏ కులాల వారు, ఏ స్తితిలో వున్నారో తెలుస్తుందనీ, దాన్ని బట్టి రిజర్వేషన్లు ఎవరికి ఎంత అందుతున్నాయీ, ఎంత అందాలీ, అనే సంగతులు బైట పడతాయని ఈ డిమాండు చేసే వారి ఉద్దేశం. 


తీరా చూస్తే, ఈ లెక్కలన్నీ బైట పడ్డాక జరిగే తంతు అంతా ఏమిటి? ఇప్పుడున్న దోపిడీ రాజ్యాంగం చట్రం లోనే, పదవుల పంపకం జరిగితే, జరగడం మాత్రమే! 


అసలు, ఈ రాజ్యాంగాన్ని దోపిడీ రాజ్యాంగం అని ఎందుకు అనవలసి వస్తుంది? ఎందుకంటే, ‘వ్యక్తి స్వేచ్ఛ’ పేరుతో ఈ రాజ్యాంగం శ్రమ దోపిడీని అనుమతిస్తుంది కాబట్టి. అంటే, ప్రకృతి సహజంగా వున్న భూముల్నీ, గనుల్నీ, నదుల్నీ, సముద్రాల్నీ; మానవ శ్రమలతో తయారయ్యే ఇతర ఉత్పత్తి సాధనాల్నీ ఒక వ్యక్తో, కంపెనీయో, ‘స్వంతంగా’ కలిగి వుండే హక్కుని ఇస్తుంది కాబట్టి. అంటే, ఉత్పత్తి సాధనాల యజమానులు కొందరు, ఏ శ్రమలూ చెయ్యకుండానే, లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ వంటి అన్యాయమైన ఆదాయాల్ని పొందడానికి ఈ రాజ్యాంగం, అనుమతిస్తుంది. 


అంతే కాదు, ఈ రాజ్యాంగం, ‘అసమాన శ్రమ విభజన’ ను నిలిపి వుంచే రాజ్యాంగం. అంటే, శ్రమలు చేసే వారిలో, కొందరు, జీవితాంతం కేవలం శారీరక శ్రమలు చేసే వారే. ఆ శారీరక శ్రమలు చేసే వారిలోనే కొందరు, పూర్తిగా అట్టడుగు శ్రమల్నీ; మలమూత్రాల వంటి మురికిని శుభ్రం చేసే శ్రమల్నీ చేయవలిసిన గతిలో వుంటారు. కొందరు జీవితాంతం కేవలం మేధా శ్రమలు మాత్రమే చేసే వారిగా వుంటారు. జనాభాను ఇలా తక్కువ ఎక్కువ స్తాయిల్లో నిలిపి వుంచే శ్రమ విభజన అది. 


ఇటువంటి పరిస్తితుల్లో, కులాలవారీ లెక్కలు సేకరిస్తే, జరిగేది ఏమిటి? ఒక్కో కులంలో వున్న జనాభాని బట్టి, చదువుల్లో, ఉద్యోగాల్లో, ప్రభుత్వ పదవుల్లో, రాజకీయాల్లో వాటాల కోసం, ‘కులాల మధ్య పోరాటాలు’ జరుగుతాయి. లాభాలూ, కౌళ్ళూ, వడ్డీలూ వంటి ఆదాయాల కోసమూ, వాటిని సమర్ధించే ప్రభుత్వాధికారంలో చోటు కోసమూ, పోరాటాలు జరుగుతాయి. దీని వల్ల, ఏ కులంలో వున్న శ్రామిక జనానికైనా ఒరిగేది ఏమిటి? వారి వారి కులాల్లో వున్న యజమానులకు, శ్రామికులు తాము జీతాలుగా పొందే దానికన్న ఎక్కువ సంపదని పోగుచేసి ఇవ్వడం తప్ప సాధించేది ఏమీ వుండదు. 


కాబట్టి, శ్రామిక జనాల ప్రయోజనాల దృష్టితో చూస్తే, కావలిసింది, కుల గణన కాదనీ, వర్గ గణన అనీ, తేలుతుంది. వర్గ గణనలో తేలేదేమిటంటే, మొత్తం జనాభాలో, అంటే, ఇప్పుడున్న మొత్తం అన్ని కులాలలోనూ, ఎందరు కేవలం స్వంత శ్రమల మీద గానీ, యజమానుల దగ్గిర జీతాల మీద గానీ శ్రామికులుగా జీవిస్తున్నారో; ఎవరు లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ వంటి ఆదాయల మీద జీవిస్తున్నారో ఈ లెక్కలు కావాలి. అలాగే, శ్రమలు చేసే వారిలో కూడా, అట్టడుగు శారీరక శ్రమలూ, మురికి శ్రమలూ ఎవరు చేస్తున్నారో, మేధా శ్రమలు ఎవరు చేస్తున్నారో -ఆ లెక్కలు కావాలి. దీన్ని బట్టే, శ్రామిక వర్గాల ప్రయోజనాల కోసం పని చేసే వ్యక్తులూ, బృఁదాలూ, పార్టీలూ తమ కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటాయి. అదే, అంతిమంగా ‘శ్రామిక వర్గాల విముక్తి’ కి దారి తీస్తుంది. 


అయితే, కుల గణన బదులు, వర్గ గణనని ఇప్పుడున్న ఏ ప్రభుత్వమూ అంగీకరించదు. చెయ్యదు. దేశంలో, ఎక్కడికక్కడ, గ్రామాల్లోనూ, నగరాల్లోనూ, శ్రామిక వర్గ దృక్పధం వున్న వాళ్ళే, వర్గ గణన దృష్టితో వుండాలి. ఉదాహరణకి, వ్యవసాయకూలీ సంఘాలూ, రైతు సంఘాలూ, ట్రేడు యూనియన్లూ, ఉపాధ్యాయ సంఘాలూ, విద్యార్ధి సంఘాలూ, మహిళా సంఘాలూ అంటూ ఎన్నో కొన్ని, అవి వున్న చోట్ల వర్గ గణన దృష్టితో వుండాలి. 


అప్పుడు శ్రామిక జనాల లోనే, ఎన్ని రకాల తేడాలూ, వైరుధ్యాలూ వున్నాయో, వాటిని అధిగమించి, వారిని ఎలా ఏకం చెయ్యాలో ఆ విషయాలు క్రమంగా అర్థమవుతాయి. 


అలా కాక, కుల గణన అనే డిమాండు వల్ల సాధించేది, కులాల్ని ఎప్పటిలాగే శాశ్వితంగా వుంచడమే. కులాల లెక్కని బట్టి (దీన్నే ‘దామాషా’ అని రాజకీయాల్లో అంటూ వుంటారు.) రాజ్యాధికారం లో వాటా కోరితే, అది ఉత్త తమాషా గా మిగిలిపోతుంది. ఈ కుల విధానాన్ని తిరస్కరించడం అసాధ్యం. 


ఒక వేళ మాట వరసకు, కులాల లెక్కలు తేలినా, ఏ కులంలో వారికైనా లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ వంటి దోపిడీ ఆదాయాల మీద జీవించే హక్కు వుండరాదనీ, అందరూ అన్ని రకాల శ్రమలూ చెయ్యాలనీ, కొత్తగా రాజ్యాంగం రాసుకుంటే, అభ్యంతరం వుండదు. అసలు ఆ రకంగా జరిగితే, కులాలే అదృశ్యం కావా? 

రంగనాయకమ్మ

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.