రాస్తారోకో చేస్తున్న మదనపల్లె జిల్లా జేఏసీ నాయకులు
మదనపల్లె టౌన్, జనవరి 25: మదనపల్లెను కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించాలని మదనపల్లె జిల్లా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సబ్‌కలెక్టరేట్ ఎదుట జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జేఏసీ నాయకుడు బందెల గౌతమ్‌కుమార్ మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు జిల్లాలో రాజంపేట కేంద్రంగా కాకుండా భౌగోళికంగా ఏడు నియోజకవర్గాలకు అందుబాటులో వుండే మదనపల్లెను కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మదనపల్లెలో జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయన్నారు. జేఏసీ నాయకుడు యమలా సుదర్శనం, టీడీపీ నేత ఆర్‌జే వెంకటేశ్ మాట్లాడుతూ మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తే రాయచోటి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల ప్రజలకు అనుకూలంగా వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, మనోహర్, చంద్రయ్య, మల్లెల మోహన్, పునీత్, శివ, హరీష్ పాల్గొన్నారు.
- నేటి నుంచి తిరంగా యాత్ర
మదనపల్లె జిల్లా సాధన కోసం బుధవారం పట్టణంలో తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీఎం శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని శివప్రసాద్ కోరారు.