మార్చి 15లోపు రైస్‌మిల్లర్లతో ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయిస్తాం : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-20T05:14:24+05:30 IST

రైస్‌మిల్లు యజమానులతో మార్చి 15లోపు యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడం పూర్తి చేయిస్తామని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

మార్చి 15లోపు రైస్‌మిల్లర్లతో ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయిస్తాం : కలెక్టర్‌
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

కామారెడ్డి టౌన్‌, జనవరి 19: రైస్‌మిల్లు యజమానులతో మార్చి 15లోపు యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడం పూర్తి చేయిస్తామని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. బుధవారం రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌తో టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతీరోజు లక్ష్యానికి అనుగుణంగా రైస్‌మిల్లు యజమానులు మిల్లింగ్‌ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని రైస్‌మిల్లులను నయాబ్‌ తహసీల్దార్లు పర్యవేక్షణ చేసే విధంగా చూస్తామని తెలిపారు. ప్రతీరోజు మిల్లింగ్‌ చేసిన వివరాలను రికార్డులో నమోదు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, సివిల్‌ సప్లయ్‌ జిల్లా మేనేజర్‌ జితేంద్రప్రసాద్‌, ఇన్‌చార్జ్‌ సివిల్‌ సప్లయ్‌ అధికారి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపకార వేతనాల దరఖాస్తుల్లో జిల్లాకు ప్రథమ స్థానం

ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేయించడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ షెడ్యూల్‌ కులాల సంక్షేమశాఖ అధికారుల కృషి వల్ల విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తులను చేయించడంలో రాష్ట్రంలో ముందంజలో నిలిచామని తెలిపారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతినెల చివరి రోజున జరిగే పౌరహక్కుల దినోత్సవ సమావేశాలకు విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులను ఆహ్వానించాలని కోరారు. ప్రభుత్వ పథకాలపై సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌ కేసులను పోలీస్‌స్టేషన్‌ల వారిగా వర్గీకరించి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. 

Updated Date - 2022-01-20T05:14:24+05:30 IST