Karnatake: 100 శాతం ఆయనే అసెంబ్లీ ఎన్నికల సారథి: బీజీపీ

ABN , First Publish Date - 2022-08-13T00:36:59+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నాయకత్వంలోనే 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు..

Karnatake: 100 శాతం ఆయనే అసెంబ్లీ ఎన్నికల సారథి: బీజీపీ

న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) నాయకత్వంలోనే 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని బీజేపీ (Bjp) ఒక ప్రకటనలో తెలిపింది. బొమ్మై ''కీలుబొమ్మ ముఖ్యమంత్రి'' (Puppet Cm) అంటూ  కాంగ్రెస్ పార్టీ నిరంతర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో బీజేపీ తాజా ప్రకటన చేసింది. బొమ్మైని తప్పించనున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వదంతుల్లో ఎంతమాత్రం నిజం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక పార్టీ ఇన్‌చార్జి అరుణ్ సింగ్ (Arun singh) శుక్రవారంనాడు తెలిపారు.


''కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జిగా ఈ మాట చెబుతున్నాను. నా ప్రకటన నమ్మాలి. బొమ్మై నాయకత్వంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందనేది నూటికి నూరు పాళ్లు నిజం. బొమ్మై ఒక సాధారణమైన వ్యక్తి. రైతులు, యువకులు, ఎస్సీలు, ఎస్టీల కోసం ఎంతో చేస్తున్నారు. మేము (బీజేపీ) తిరిగి పూర్తి మెజారిటీతో గెలుస్తాం. 150 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యాన్ని సాధిస్తాము కూడా'' అని అరుణ్ సింగ్ తెలిపారు. చేతిలో ఏ అంశాలు లేనందున కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఏవేవో ప్రచారాలు చేస్తుంటారని, బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ వద్ద ఎలాంటి ఎజెండా లేదని, దాంతో సీఎంను మార్చేస్తారంటూ ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. ఆ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన వివరణ ఇచ్చారు.


 దక్షిణ కన్నడ జిల్లాలో ఇటీవల యువనేత ప్రవీణ్ నెట్టార్ దారుణ హత్య నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం బొమ్మైపై విరుచుకుపడినట్టు వార్తలు వచ్చాయి. సీఎం మార్పు అంటూ జరిగితే తాను రేసులో ఉంటాని బీజేపీ మంత్రి ఉమేష్ కట్టి ప్రకటించారు. బొమ్మైను మార్చేది లేదని అరుణ్ సింగ్ చెబుతున్నప్పటికీ సీఎం మార్పు అనివార్యంగా కనిపిస్తోందని బీజేపీకి చెందిన ఒక వర్గం నేతలు చెబుతున్నారు

Updated Date - 2022-08-13T00:36:59+05:30 IST