మునిసిపల్‌ ఎన్నికలు కొనసాగిస్తాం

ABN , First Publish Date - 2021-04-23T07:32:23+05:30 IST

నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారమే మునిసిపల్‌ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథి స్పష్టం చేశారు.

మునిసిపల్‌ ఎన్నికలు కొనసాగిస్తాం

  • ప్రక్రియను ఆపొద్దని ప్రభుత్వం కోరింది
  • కరోనా కట్టడికి చర్యలు: ఎస్‌ఈసీ పార్థసారథి 
  • 72 గంటల ముందే ప్రచారం ముగింపు
  • గురువారం సాయంత్రం నుంచే అమల్లోకి...
  • ఎన్నికల ప్రచారంపై మరిన్ని ఆంక్షలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారమే మునిసిపల్‌ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథి స్పష్టం చేశారు. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు మునిసిపాలిటీలతోపాటు వేర్వేరు మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 9 వార్డులకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, హైకోర్టు సూచనల మేరకు ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్‌ఈసీ కోరింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని ప్రభుత్వం కోరిందని పార్థసారథి తెలిపారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించిందని పేర్కొన్నారు. ఈవిషయమై సంబంధిత అధికారులతో చర్చించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.


ప్రచార వేళల్లో మార్పులు

కరోనా తీవ్రత నేపథ్యంలో మినీ మునిసిపల్‌ ఎన్నికల ప్రచార వేళల్లో మార్పులు చేస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌కు 48  గంటల ముందు ప్రచారాన్ని ముగించాల్సి ఉండగా, దాన్ని 72 గంటలకు పెంచింది. అంటే.. ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకే ప్రచార గడువు ముగియనుంది. రాత్రి కర్ఫ్యూ అమలులో ఉన్నందున రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ర్యాలీలు, సభలు, రోడ్‌ షోలు, స్థానిక సమావేశాలు జరపకుండా నిసేదాజ్ఞలు విధించింది. గురువారం సాయంత్రం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చినట్లు ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌  తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎస్‌ఈసీకి ఉన్న అఽధికారాల మేరకు ఈ మార్పులు చేసినట్లు వివరించారు. కాగా, ఎన్నికల ప్రక్రియలో అన్ని సందర్భాల్లోనూ మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఎస్‌ఈసీ పేర్కొంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటిస్తూనే... క్యూ లైన్‌లో వెళ్లేలా నేలపై మార్కింగ్‌ చేయడం వంటి చర్యలు చేపట్టాలని  ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరికీ ఆరోగ్య సేతు యాప్‌ తప్పని సరి అని నిర్దేశించింది. దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, కరోనా పాజిటివ్‌లకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపింది.

Updated Date - 2021-04-23T07:32:23+05:30 IST