ఆస్తిపన్నుపై కౌన్సిల్‌లో నిలదీస్తాం

ABN , First Publish Date - 2021-06-20T05:49:42+05:30 IST

ఆస్తిపన్ను పెంపుపై పోరులో భాగంగా ఈ నెల 23న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశాన్ని స్తంభింపజేయాలని తెలుగుదేశం కార్పొరేటర్లు నిర్ణయించారు

ఆస్తిపన్నుపై కౌన్సిల్‌లో నిలదీస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు, వేదికపై ఎమ్మెల్యే వెలగపూడి

అజెండాలో అనధికార వ్యక్తుల పేర్లపై అభ్యంతరం

సచివాలయాలపై అధికారాలు ఇవ్వాలి

టీడీపీ కార్పొరేటర్లు డిమాండ్‌

విశాఖపట్నం, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ఆస్తిపన్ను పెంపుపై పోరులో భాగంగా  ఈ నెల 23న జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశాన్ని స్తంభింపజేయాలని తెలుగుదేశం కార్పొరేటర్లు నిర్ణయించారు. పన్నుల పెంపుపై అఽధికార పక్షం వైఖరిని తెలుసుకుని ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ విశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పల్లా శ్రీనివాసరావు,  తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశంలో పన్నుల పెంపును వ్యతిరేకించాలని సూచించారు. కౌన్సిల్‌ అజెండాలో పన్నుల పెంపు అంశం చేర్చకపోవడాన్ని  నిలదీయాలని కోరారు. పన్నుల పెంపుపై అధికారపక్షం వైఖరి తెలియజేయాలన్న డిమాండ్‌ మేరకు ముందుకువెళ్లాలని సూచించారు. పన్నుల పెంపుపై జనసేన, వామపక్షాలు, బీజేపీతో కలిసి కౌన్సిల్‌లో నిలదీయాలన్న సూచనకు కార్పొరేటర్లు అంగీకరించారు. ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌తోపాటు పలువురు కార్పొరేటర్లు మాట్లాడారు. కరోనాతో ప్రజలు,   వ్యాపారులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే పన్నులు పెంపు  ఎంతవరకు భావ్యమని ఆందోళన వ్యక్తంచేశారు. అధికారపక్షం కావాలనే పన్నుల పెంపును పక్కదారి పట్టిస్తోందని వారంతా అనుమానం వ్యక్తం చేశారు. పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు మిగిలిన విపక్షాలతో కలసి వెళ్లాలని కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. కాగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వార్డు కార్పొరేటర్లు తప్ప ఇతర అనధికార వ్యక్తులు పేర్కొన్న అంశాలను వారి పేరుతో అజెండాలో చేర్చడంపై కార్పొరేటర్లు మండిపడ్డారు.  ప్రజల నుంచి ఎన్నుకోబడిన కార్పొరేటర్లకు బదులు అధికార పార్టీ నేతల పేర్లతో అజెండాలో అంశాలు చేర్చడం వల్ల సభ్యులకు ఏమి విలువ ఉంటుందని ప్రశ్నించారు.

ఇదిలావుండగా వార్డులో కమిషనర్‌, ఇతర అధికారులు పర్యటించినపుడు కార్పొరేటర్లకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై వారంతా అభ్యంతరం వ్యక్తంచేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లకు విలువ లేదా అని ప్రశ్నించారు.  వార్డు సచివాలయాలపై కార్పొరేటర్లకు అధికారం ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయాల్లో అధికారాలపై సర్పంచ్‌లు కోర్టుకు వెళ్లిన విషయాన్ని పలువురు కార్పొరేటర్లు గుర్తుచేశారు. కాగా సమావేఽశానికి గాజువాకకు చెందిన కాకి గోవిందరెడ్డి, లేళ్ల కోటేశ్వరరావు  తప్ప మిగిలిన కార్పొరేటర్లు హాజరయ్యారు. 


Updated Date - 2021-06-20T05:49:42+05:30 IST