మేం పల్లెకు పోం.. రూ.40 వేల జీతానికి ఎవరొస్తారు?

ABN , First Publish Date - 2021-10-10T13:06:13+05:30 IST

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న పల్లె దవాఖానల్లో పనిచేసేందుకు వైద్యులు ఆసక్తి చూపడం లేదు. వీటిలో వైద్యుడి పోస్టుల భర్తీకి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే చాలా స్వల్ప స్థాయిలో..

మేం పల్లెకు పోం.. రూ.40 వేల జీతానికి ఎవరొస్తారు?

పల్లె దవాఖానలపై వైద్యుల అనాసక్తి

దరఖాస్తు చేయని డాక్టర్లు 

రంగారెడ్డిలో 93 దవాఖానలకు మరీ ఒక్కటే..

రవాణా ఉండదు.. సొంత వాహనంపై వెళ్లాలి

ఇన్‌సర్వీస్‌ కోటా పీజీ కూడా లేదు

భవిష్యత్తుపై భరోసా లేకనే దూరం!


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న పల్లె దవాఖానల్లో పనిచేసేందుకు వైద్యులు ఆసక్తి చూపడం లేదు. వీటిలో వైద్యుడి పోస్టుల భర్తీకి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే చాలా స్వల్ప స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చినా  పెద్దగా స్పందన రావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో 93కి పైగా పల్లె దవాఖానాలు ఉన్నాయి. వీటిలో పనిచేసేందుకు ఒక్కటే దరఖాస్తు వచ్చిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఖమ్మం జిల్లాల్లో 86 పల్లె దవాఖానలకు 15, నల్లగొండ జిల్లాల్లో 106 పల్లె దవాఖానలకు 4 దరఖాస్తులే వచ్చాయి. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఆ ఆస్పత్రులకు బాగా డిమాండ్‌ ఉంటుందని వైద్య శాఖ అంచనా వేసింది. కానీ, పూర్తిగా అర్బన్‌ ప్రాంతంలోని పల్లె దవాఖానలకే ఇటువంటి పరిస్థితి ఎదురైంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.


పల్లె దవాఖానల్లో పనిచేసే ఎంబీబీఎస్‌ వైద్యులకు ప్రభుత్వం రూ.40 వేల వేతనం ఇస్తామని ప్రకటించింది. ఇందులో మినహాయింపులు పోను చేతికి అందేది రూ.36 వేలు. ఒకవైపు పీహెచ్‌సీల్లో పనిచేసే ఎంబీబీఎస్‌ డాక్టర్లకు సర్కారు రూ.60 వేల వేతనం చెల్లిస్తోంది. అంతకంటే తక్కువగా జీతం ఇస్తామంటే ఎవరొస్తారని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. పైగా పల్లె దవాఖానలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. సరైన రవాణా సౌకర్యం ఉండదు. సొంత వాహనంపై వెళ్లాలి. దీంతో సర్కారు ఇచ్చే సొమ్ము ఏమాత్రం సరిపోవని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారెవరూ గ్రామీణ ప్రాంత సర్కారీ ఆస్పత్రుల్లో పని చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకు ప్రధానం కారణం భవిష్యత్‌పై భరోసా లేకపోవడమే.


రాష్ట్రంలో 2017 వరకు ఇన్‌సర్వీస్‌ కోటా కింద పీజీ చేసే అవకాశం ఉండేది. సుప్రీంకోర్టులో కేసు వల్ల అన్ని రాష్ట్రాల్లో అది రద్దయింది. 2020లో కోర్టు క్లియరెన్స్‌ ఇచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో ఇన్‌సర్వీస్‌ కోటా పీజీని అమలు చేస్తున్నారు. మన దగ్గర అమల్లోకి రాలేదు. 2017 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే వెయిటేజీ ఆధారంగా పీజీ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉండేది. నీట్‌ పీజీ అర్హత పరీక్షతో సంబంధం లేకుండా నేరుగా పీజీ సీటు ఇచ్చేవారు. ప్రస్తుతం ఉన్న భారీ పోటీ వల్ల నీట్‌లో ర్యాంకు సాధించి సీటు పొందడం అసాధ్యం. అందుకే ఇన్‌సర్వీస్‌ కోటా పీజీ సీట్లపై ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఆశ ఉండేది. దాంతోనే గ్రామీణ ప్రాంతాల్లోని దవాఖానల్లో పనిచేసేందుకు ముందుకు వచ్చేవారు. ఇప్పుడది లేకపోవడంతో ఆసక్తి చూపడం లేదు. 


రాష్ట్రవ్యాప్తంగా 4,830 పల్లె దవాఖానాలు 

రాష్ట్రవ్యాప్తంగా 4830 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వీటిన్నింట్లో ఎంబీబీఎస్‌ వైద్యులను నియమించాలని వైద్యశాఖను సీఎం ఆదేశించారు. ఇక రాష్ట్రంలో 865 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 4,830 ఉప కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉప కేంద్రాలలో ఒక ఏఎన్‌ఎం, ఐదుగురు ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఒక ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో సగటున మూడు గ్రామాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజానీకానికి ఎటువంటి వైద్య సేవలు అవసరమైనా స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీనే ఆశ్రయిస్తున్నారు. మండలంలో ఉండే పీహెచ్‌సీ దాకా వెళ్లడం లేదు. దాంతో కొందరు జబ్బులను ముదరపెట్టుకుంటున్నారు.

Updated Date - 2021-10-10T13:06:13+05:30 IST