ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సమస్యలు పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2021-10-27T05:46:40+05:30 IST

పెద్దతిప్పసముద్రం మండలంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పర్యటించి అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామని తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ సమావేశంలో తహసీల్దార్‌ కళావతి చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సమస్యలు పరిష్కరిస్తాం
ఎస్సీ,ఎస్టీ సమస్యలను అధికారులకు వివరిస్తున్న ఎంఆర్పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర

పెద్దతిప్పసముద్రం, అక్టోబరు 26: మండలంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పర్యటించి అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామని తహసీల్దార్‌ కళావతి చెప్పారు. మంగళవారం  తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... మండలంలోని పులికల్లు, కందుకూరు, బెట్టకొండ, టి.సదుం, పోతుపేట, కమ్మచెరువు, రంగసముద్రం, కొండయ్యగారిపల్లెల్లో పర్యటించి రోడ్లు, మురుగునీటి కాలువులు, శ్మశానవాటికల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామన్నారు. పలువురు ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు మాట్లాడుతూ... మానిటరింగ్‌ సమావేశాలు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమావేశానికి పలు శాఖలకు చెందిన అదికారులు  హాజరు కాలేదని, వారికి నోటీసులు ఇవ్వాలన్నారు. మండలంలోని మద్దయ్యగారిపల్లె పంచాయతీ పులగంటివారిపల్లెలో గత మూడు సంవత్సరాలుగా కులవివక్ష జరుగుతున్నా ఇంతవరకు ఏ అధికారి సమస్యను పరిష్కరించలేదని బాస్‌ నాయకుడు రెడ్డెప్ప అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై గ్రామంలో పర్యటించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర, కేవిరమణ, జడ్పీటీసీ సభ్యుడు, శివన్న, ఎంపీపీ మహమ్మద్‌, సర్పంచు శంకర,  ఎంపీడీవో గిరిధర్‌రెడ్డి, ఎంఈవో నారాయణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T05:46:40+05:30 IST