కొండలపై ఉన్న గ్రామాల సమస్యలు పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2021-05-11T05:10:34+05:30 IST

మారుమూల కొండలపై గల గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని జిల్లా అదనపు ఎస్‌పీ (ఆపరేషన్స్‌) ఎస్‌.సతీశ్‌కుమార్‌, నర్సీపట్నం ఏఎస్‌పీ తుహిన్‌ సిన్హా అన్నారు.

కొండలపై ఉన్న గ్రామాల సమస్యలు పరిష్కరిస్తాం
నీటి పథకాన్ని ప్రారంభిస్తున్న ఓఎస్‌డీ, ఏఎస్పీ

ఓఎస్‌డీ సతీశ్‌కుమార్‌, నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌ సిన్హా

కొయ్యూరు, మే 10: మారుమూల కొండలపై గల గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని జిల్లా అదనపు ఎస్‌పీ (ఆపరేషన్స్‌) ఎస్‌.సతీశ్‌కుమార్‌, నర్సీపట్నం ఏఎస్‌పీ తుహిన్‌ సిన్హా అన్నారు. ఆయా గ్రామాల్లో మౌలిక సౌకర్యాలకు కల్పిస్తామన్నారు. సోమవారం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ముద్రపడిన బూదరాళ్ల శివారు బాలరేవులలో రూ.నాలుగు లక్షలతో నిర్మించిన తాగునీటి పథకాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కొండలపై గల గ్రామాలలో ఉన్న సమస్యలపై తనకు అవగాహన ఉందని, సీఐ, ఎస్‌ఐలు చెప్పగానే దీని పరిష్కారంపై దృష్టి సారించానన్నారు. ఈ విషయాన్ని పాడేరు ఐటిడీఏ పీవో వెంకటేశ్వర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి సహకరించారన్నారు. అలాగే కునుకూరు, కన్నవరం, సాకులపాలెం గ్రామాలను కలుపుతూ గ్రావెల్‌ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, అందుకు ఆయా గ్రామాల ప్రజల సహకారం అవసరమన్నారు. బాలరేవులకు త్వరలో బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఇక్కడ మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయిస్తానన్నారు. ఏ అభివృద్ధి జరగాలన్నా ప్రజా సహకారం అవసరమన్నారు. పోలీసులు ప్రజలకు శత్రువులు కాదని మిత్రులని, ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉన్నందున వైద్యపరమైన సమస్యలున్నా తమ దృష్టికి తేవాలన్నారు. వలంటీర్లు ఏదేని సమస్య ఎదుర్కొంటున్నా తన దృష్టికి తేవాలని సూచించారు. ఈ తాగునీటి పథకాన్ని వారం రోజుల వ్యవధిలో నిర్మాణాల పూర్తి చేసేందుకు సహకరించిన గ్రామస్థులు, ప్లంబరు రేవళ్ళు సత్తిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కొయ్యూరు సీఐ వెంకటరమణ, మంప ఎస్‌ఐ సన్నిబాబు చొరవతో ఈ పథకాన్ని నిర్మించారు. అనంతరం తహసీల్దార్‌ తిరుమలరావు, ఎంపీడీవో పీవీఎన్‌ మూర్తి గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామానికి ఓఎస్‌డీ, ఏఎస్పీలు కొయ్యూరు నుంచి 12 కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్‌ఐ నాగేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-05-11T05:10:34+05:30 IST