Advertisement

బాధిత రైతులను ఆదుకుంటాం

Oct 17 2020 @ 00:47AM

నష్టం అంచనాలు సమగ్రంగా ఉండాలి

తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టాలి

అధికారులతో సమీక్ష సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌


ఖమ్మం కలెక్టరేట్‌, అక్టోబరు 16: వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకుంటుందని, అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు నష్టపోయిన పంటల వివరాలు, పత్తి, ధాన్యం కొనుగోళ్లు, యాసంగి ప్రణాళిక, రైతువేదిక నిర్మాణాలపై శుక్రవారం నగరంలోని డీపీఆర్సీ భవనంలో  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వానాకాలం ముగిసిన తర్వాత అక్టోబరు నెలలో వచ్చిన వానలకు ప్రాథమిక అంచనాల ప్రకారం 38వేల 111 ఎక రాల్లో వరి, 37వేల 227 ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లిందని మొత్తంగా జిల్లాలో 75వేల 364 ఎకరాలల్లో పంటనష్టం జరిగిందని  తెలిపారు.


నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదికలు అందచేస్తే నష్టపోయిన ప్రతీరైతును ప్రభుత్వం పరిహారాన్ని అందించి ఆదుకుంటుందని భరోసానిచ్చారు. వర్షాల వలన దెబ్బతిన్న రోడ్లు, గండిపడిన జలాశయాలు, కాలువల అంచనాలు సిద్ధం చేయడంతో పాటు తాత్కాలిక మరమ్మతులను వెంటనే చేపట్టాలని  రోడ్లు భవనాలు, నీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలో 348 గ్రామాల్లో సుమారు 50 వేల 465 మంది రైతులకు వర్షాల వలన నష్టం సంభవించిందని వారికి ప్రభుత్వ పరంగా పరిహారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే యాసంగిలో జిల్లాలో రైతులు మెక్కజొన్న పంటలను సాగుచేయకుండా వ్యవసాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి బాధ్యులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 


ప్రాథమిక అంచనాలు సిద్ధం

కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ మాట్లాడుతూ జిల్లాలో వర్షాల వలన పంట, ఆస్తి నష్టం ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. జిల్లాలో సాధారణ వర్షపాతం 58.2 మిల్లీమీటర్ల కంటే 194.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని కలెక్టర్‌ తెలిపారు.  వర్షాల వలన ప్రాణనష్టం జరిగిన బాధిత కుటుంబాలకు రూ 5లక్షల పరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వానికి నివేధించినట్లు తెలిపారు. గొర్రెలు, పశువుల సర్వేచేసి వాటికి బీమా వర్తింప చేస్తామని కలెక్టర్‌ చెప్పారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో అధికంగా పంటనష్టం జరిగిందని, తల్లాడ మండలంలో గొర్రెలు మృతిచెందాయని వరద నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనాలు వేసేందుకు వ్యవసాయ, నీటిపారుదల పశుసంవర్ధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేచేసి నివేదికలను సిద్ధం చేయాలని కోరారు.


పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ తమ నియోజకవర్గాల్లో సంబవించిన నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగాఽ ధాన్యం, పత్తి కొనుగోళ్లకోసం కనీస మద్దతు ధర, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలతో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆవిష్కరించారు. ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్‌కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, ఖమ్మం వ్యవసాయమార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌. మధుసూదన్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, ఉద్యానవనశాఖ అధికారి అనసూయ, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్‌, నీటిపారుదలశాఖ ఈఈ స్వర్గం నర్సింహారావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ గజం సీతారాములు, ఈఈ చంద్రమౌళి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రమేష్‌ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement