పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2021-07-28T05:52:24+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
మాట్లాడుతున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి అల్లోల
ఆదిలాబాద్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కార ణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించడానికే జిల్లాల వారీగా సమీక్షలు జరుపడం జరుగుతుందన్నారు. అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయ డం జరిగిందన్నారు. రవాణా సౌకర్యాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అధికారులు గ్రామాలను సందర్శించి దెబ్బతిన్న రోడ్లు, పంటలు, గృహాలు, తదితర వాటిని పరిశీలించి వెంటనే నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు దెబ్బతిన్న పంటలను విస్తీర్ణం వారీగా సర్వే చేసి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. వర్షాలకు కోతకు గురైన రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలని పేర్కొన్నారు. అందుబాటులో నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. వర్షాల కారణంగా 95విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయని, 28 గ్రామాలలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిన పునరుద్ధరించడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్నమాట్లాడుతూ చిన్నచిన్న మరమ్మ త్తు పనులను గుర్తించి పనులు చేపట్టాలని, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోడ్ల పనులు చేపట్టాలన్నారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావ్‌ మాట్లాడుతూ బోథ్‌ నియోజక వర్గంలో అధిక వర్షపాతం నమోదు కావడం వల్లన ఎక్కువగా పంట నష్టం జరిగిందన్నారు. ఇందులో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ రాజేశ్‌చంద్ర, డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లె నాందేవ్‌, అదనపు కలెక్టర్లు డేవిడ్‌, నటరాజ్‌, ఆర్డీవో జాడి రాజేశ్వర్‌, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏబీవీపీ నాయకులు
ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లాకేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల, వసతి గృహం ప్రహరీకి ఆనుకొని చేపడుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపి వేయాలనే విషయంలో మంగళవారం మంత్రి కాన్వాయిని ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు.   స్థానిక తిరుమల పెట్రోల్‌పంపు వద్ద జాతీయ రహదారిపై 20నిమిషాల పాటు అడ్డుకున్నారు. దీంతో వెంటనే పోలీసులు ఏబీవీపీ నాయకులను అరెస్టు చేశారు. వారిలో నాయకులు నరేందర్‌, కార్తీక్‌, అనిల్‌, నవీన్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-07-28T05:52:24+05:30 IST