కరోనాతో ఆర్థిక ఇబ్బందులు.. ధోబీ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-07T18:19:05+05:30 IST

వైరస్‌ బారిన పడే కాదు.. కరోనా కారణంగా పనులు లేక ఆర్థిక

కరోనాతో ఆర్థిక ఇబ్బందులు.. ధోబీ ఆత్మహత్య

హైదరాబాద్/రాంగోపాల్‌పేట్‌ : వైరస్‌ బారిన పడే కాదు.. కరోనా కారణంగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏడాదిగా పనులు లేక ఓ ధోబీ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సరోజినీదేవి రోడ్డులోని జవహర్‌ జనతా బస్తీకి చెందిన శ్రీనివాస్‌(42) ధోబీ. భార్య లక్ష్మి, కుమారుడు ప్రతాప్‌, కూతురు వసంత ఉన్నారు. గతేడాది వరకు వీరి కుటుంబంలో పెద్దగా గొడవలు లేవు. కరోనా వల్ల ఏడాది కాలంగా దుస్తులు ఉతికించుకునేవారు తగ్గిపోయారు. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. గతంలో అప్పుడప్పుడూ మద్యం సేవించే శ్రీనివాస్‌ పని లేకపోవడంతో పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి.


రెండు రోజుల క్రితం మద్యం విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటి నుంచి భార్యాపిల్లలతో మాట్లాడటం మానేశాడు. బుధవారం ఉదయం తాడ్‌బంద్‌లోని ధోబీఘాట్‌కు వెళ్లి వచ్చాడు. సాయంత్రం ఆరు గంటలకు అన్నం వండుకున్నాడు. కానీ తినకుండానే వెళ్లి గదిలో పడుకున్నాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో బాత్రూంకు వెళ్లి వచ్చి, గడియ పెట్టుకున్నాడు. రాత్రి రెండు గంటల సమయంలో గదిలో లైటు వెలుగుతుండటంతో, మరో గదిలో పడుకున్న భార్య అనుమానం వచ్చి పిల్లలను నిద్ర లేపి వెళ్లి చూసింది. గదిలో శ్రీనివాస్‌ చీరతో ప్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికుల సహాయంతో మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-07T18:19:05+05:30 IST