ఈ-క్కట్లు

ABN , First Publish Date - 2022-06-28T05:50:46+05:30 IST

ఈ-క్కట్లు

ఈ-క్కట్లు

వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న కొత్త వెబ్‌ పోర్టల్స్‌

ఈ-ప్రగతి పోర్టల్‌ను పక్కనపెట్టిన కేంద్ర ప్రభుత్వం

వాహన్‌ పరివాహన్‌, సారథి పరివాహన్‌ ద్వారా ప్రయోగాత్మక సేవలు 

అడుగడుగునా సాంకేతిక సమస్యలు

ఏం చేయాలో తెలియని గందరగోళం

ఏజెంట్లను ఆశ్రయిస్తున్న వాహనదారులు 


సంస్కరణలు సులభమైనవిగా ఉండాలి కానీ, లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టకూడదు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ శాఖలో జరుగుతున్నది ఇదే. సులభమైన ఈ-ప్రగతి ఆన్‌లైన్‌ సేవలను పక్కనపెట్టిన కేంద్ర ప్రభుత్వం సారథి పరివాహన్‌, వాహన్‌ పరివాహన్‌ పేరుతో రెండు రకాల వెబ్‌ పోర్టల్స్‌ను అందుబాటులోకి తెచ్చి వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతోంది. అర్థంకాని ఆప్షన్లు.. అడుగడుగునా సాంకేతిక సమస్యలతో ఈ కొత్త వెబ్‌ పోర్టల్స్‌ వాహనదారుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రవాణా, రవాణాయేతర వాహనాలకు సంబంధించిన లైసెన్సులు, రిజిస్ర్టేషన్లు, ఇతర సేవలను దేశవ్యాప్తంగా ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకురావాలన్న ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వివిధ రాష్ర్టాల్లో అమలుచేస్తున్న సాంకేతిక వ్యవస్థలను పరిశీలించింది. అనంతరం ఎంతో సులభతరమైన సేవలు అందుబాటులోకి రావాల్సింది పోయి గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టింది. ‘ఆర్టీఏ సిటిజన్‌ ఈ-ప్రగతి’ వెబ్‌సైట్‌ను పక్కనపెట్టి సారథి పరివాహన్‌, వాహన్‌ పరివాహన్‌ పేరుతో రెండు రకాల వెబ్‌ పోర్టల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. లైసెన్స్‌ ఆధారిత సేవలు సారథి పరివాహన్‌లోకి, వాహన రిజిస్ర్టేషన్ల సేవలు వాహన్‌ పరివార్‌లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి ప్రయోగాత్మకంగా నడుస్తున్నాయి. దీనిపై ఇరుజిల్లాల రవాణా శాఖ ఉన్నతాధికారులు శిక్షణకు కూడా వెళ్లొచ్చారు. 

అన్నీ సాంకేతిక సమస్యలే..

ప్రయోగాత్మకంగా నడుస్తున్న ఈ వెబ్‌ పోర్టల్స్‌లో అనేక సాంకేతిక లోపాలు వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. గతంలో ‘ఆర్టీఏ సిటిజన్‌ ఈ-ప్రగతి’లో సేవలు సులభంగా ఉండేవి. రెండు, మూడు ఇంటర్‌ ఫేజుల్లోనే ఎంట్రీ పూర్తయ్యేది. ఓటీపీ, బయోమెట్రిక్‌ ఆధారిత సేవల ద్వారా తేలిగ్గా దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యేది. ప్రస్తుత వాహన్‌ పరివాహన్‌, సారథి పరివాహన్‌లో కూడా ఓటీపీ, బయోమెట్రిక్‌ ఆధారిత సేవలున్నా డాక్యుమెంటేషన్‌ అప్‌డేషన్‌ ఎక్కువైంది. దాదాపు ఎనిమిది, ఆ పైన పాప్‌ అప్స్‌తో కూడిన ఇంటర్‌ ఫేజుల్లో డేటాను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. గతంలో ఈ-ప్రగతి సిటిజన్‌ పోర్టల్‌లో ఫామ్స్‌ వినియోగాన్ని 10 శాతానికి తగ్గించేశారు. వాహన్‌ పరివాహన్‌, సారథి పరివాహన్‌లో మాత్రం నూరుశాతం ఫామ్‌లు అమల్లోకి తెచ్చారు. ఫామ్‌లను పూర్తిచేసి, డిజిటల్‌ కాపీలను సిద్ధం చేసుకుని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో వాహనదారులకు సరిగ్గా అర్థంకాక బ్రోకర్లను, ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. డబ్బు చెల్లించే ఆప్షన్‌ కూడా మాటిమాటికీ ఇబ్బంది పెడుతోంది. అలాగే, ఈ-ప్రగతి మాదిరిగా లైసెన్సులు, రిజిస్ర్టేషన్లకు సంబంధించిన డేటాను పీడీఎఫ్‌ రూపంలో పొందే అవకాశం లేకుండాపోయింది. రిజిస్ర్టేషన్‌ చేసుకున్నవారు ఆర్‌సీ కాపీని పొందటం కూడా కష్టంగా మారింది. ఆన్‌లైన్‌లో లైసెన్సు కాపీలు పొందాలన్నా సమస్య ఏర్పడుతోంది. వెబ్‌ పోర్టల్స్‌లో ఏదైనా సేవకోసం క్లిక్‌చేస్తే మళ్లీ పాత పేజీనే కనిపిస్తోంది. కొత్తగా వాహనాలు కొన్నవారికి షోరూమ్‌ల వద్దే రిజిస్ర్టేషన్లు జరిగిపోతున్నాయి. నెల రోజులైనా రిజిస్ర్టేషన్‌ సర్టిఫికెట్లు (ఆర్‌సీ) మాత్రం అందట్లేదు. 

ఏ సైట్‌లో.. ఏ సేవలో..!

ప్రస్తుతం రవాణా శాఖ అధికారులు ఏ సైట్‌లో సేవలు అందిస్తున్నారో వాహనదారులకు తెలియట్లేదు. ఈ-ప్రగతి అనుకుని అందులో దరఖాస్తు చే స్తే చెల్లింపులు జరగట్లేదు. పోనీ వాహన్‌ పరివాహన్‌, సారథి పరివాహన్‌లోకి వెళ్లినా ఇదే పరిస్థితి. దీంతో గందరగోళం ఏర్పడుతోంది. తప్పని పరిస్థితుల్లో ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. 

పాత వాహనాలకే ఈ-ప్రగతి

కొత్త వాహనాలకు ఈ-ప్రగతి పోర్టల్‌ను నిలిపివేశారు. పాత వాహనాల ట్రాన్స్‌ఫర్స్‌ సేవలే అందిస్తున్నారు. లైసెన్సుల సేవలు సారథి పరివాహన్‌లో, రిజిస్ర్టేషన్‌ సేవలు వాహన్‌ పరివాహన్‌లో కల్పించారు.


Updated Date - 2022-06-28T05:50:46+05:30 IST