‘వెబ్‌’ టెన్షన్‌

ABN , First Publish Date - 2020-11-20T06:37:16+05:30 IST

దరఖాస్తు చేసినా పట్టాదారు పాసు పుస్తకం అందటం లేదు..

‘వెబ్‌’ టెన్షన్‌

రెవెన్యూ సేవల వెబ్‌ ల్యాండ్‌ వెబ్‌సైట్‌లో సమస్యలు

నెల నుంచి ప్రజలకు, అధికారులకు చుక్కలు 

పాసు పుస్తకం అందటం లేదు.. పట్టా సబ్‌ డివిజన్‌ జరగటం లేదు 

మ్యుటేషన్‌.. డిజిటల్‌ సిగ్నేచర్‌లకు ఆటంకాలు

రెవెన్యూ అర్జీలన్నీ నెల నుంచి అపరిష్కృతం 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దరఖాస్తు చేసినా పట్టాదారు పాసు పుస్తకం అందటం లేదు. సబ్‌ డివిజన్‌ జరగటం లేదు. మ్యుటేషన్స్‌ పెట్టుకున్నా పేర్లు మారటం లేదు. భూ వివాదాలు అంతకన్నా పరిష్కారం కావటం లేదు. రికార్డుల సవరణ అసలే జరగటం లేదు. నెల నుంచి రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రజలు చేసుకున్న  దరఖాస్తులకు పరిష్కారం లభించడం లేదు. జిల్లావ్యాప్తంగా వెబ్‌ల్యాండ్‌ వెబ్‌సైట్‌ సర్వర్‌ సమస్యే ఇందుకు కారణం. 


జిల్లాలో మాన్యువల్‌గా జరిగిన రెవెన్యూ లావాదేవీలు వెబ్‌ల్యాండ్‌లో అప్‌డేట్‌ కావటం లేదు. రెవెన్యూ కార్యాలయాల దగ్గర సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ప్రజల్లో అసహనం తలెత్తుతోంది. ఇప్పటికే కొందరు చేసే పనుల వల్ల రెవెన్యూ శాఖ మీద ఏ పనీ చేయరన్న అపవాదు ఉంది. దానికి తోడు అవినీతి మరక ఉంది. పదే పదే రెవెన్యూ శాఖ మీద పడుతున్న మచ్చను చెరిపేసుకునే ప్రయత్నం ఆ శాఖలో కొంత జరుగుతున్నా.. వెబ్‌ల్యాండ్‌ వెబ్‌సైట్‌ నిర్వహణ సరిగా లేకపోవటం, సాంకేతిక సమస్యలు, నెట్‌వర్క్‌ సమస్యలు వెన్నాడుతుండటంతో.. ఈ నెలలో ఐదు శాతం దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఏదైనా ప్రైవేటు సంస్థ ఒక వెబ్‌సైట్‌ను కానీ, అప్లికేషన్‌ను కానీ రూపొందించినపుడు దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కొంత కాలం పరీక్షిస్తారు. లోటుపాట్లుంటే సవరిస్తారు. అది విజయవంతంగా పనిచేస్తుందనుకున్న తర్వాతే మార్కెట్‌లోకి తీసుకువస్తారు. 


ప్రభుత్వ శాఖలకు సంబంధించి వెబ్‌సైట్‌, అప్లికేషన్స్‌ రూపకల్పన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. వెబ్‌సైట్‌ను, అప్లికేషన్‌ను రూపొందించిన వెంటనే అమల్లోకి తెచ్చేస్తారు. ఆ ఇబ్బందులు ప్రజలకే వదిలేస్తున్నారు. ఆ తరువాత ఎప్పటికో సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లను మార్చుతుంటారు. పోనీ ఇలా అయినా అప్‌గ్రేడ్‌ అవుతుందా అంటే సందేహమే. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు సంబంధించిన వెబ్‌ల్యాండ్‌ వెబ్‌సైట్‌ ప్రజలకు, రెవెన్యూ అధికారులకు సైతం చుక్కలు చూపిస్తోంది. వెబ్‌సైట్‌ నిర్వహణ సరిగా లేకపోవటం, సాంకేతిక సమస్యలు, నెట్‌వర్క్‌ సమస్యలు ముకుమ్మడిగా ఎదురు కావటంతో దాదాపు నెల నుంచి దరఖాస్తుల పరిష్కారం ముందుకు సాగడం లేదు.


ప్రజల పాట్లు.. అధికారుల అసహనం  

వెబ్‌ల్యాండ్‌ దాదాపు 90 శాతం క్రాష్‌ అవుతుండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. అర్ధరాత్రిళ్లు తప్పితే వెబ్‌సైట్‌ ద్వారా కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి తలెత్తుతోంది. పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌, పట్టా సబ్‌ డివిజన్లు, మ్యుటేషన్స్‌ వంటి ప్రధాన సేవలు వెబ్‌ల్యాండ్‌ ఆధారితంగానే నిర్వహించాల్సి ఉంటుంది. వెబ్‌ల్యాండ్‌లో అప్‌డేట్‌ అయితేనే ఆ లావాదేవీలకు అధికారత వస్తుంది. గ్రామాల వారీగా  పట్టాదారుల వివరాలు, ల్యాండ్‌ హోల్డింగ్స్‌, అనుభవదారుల వివరాలకు సంబంధించిన ఎంట్రీలు వెబ్‌ల్యాండ్‌ ద్వారా జరుగుతుంది. సీజనల్‌గా పంట వివరాలను కూడా వెబ్‌ల్యాండ్‌ ద్వారానే అప్‌డేషన్‌ చేస్తారు. సర్వే, ఇతర భూ వివాద సంబంధ విషయాలను పరిష్కరించాలన్నా వెబ్‌ల్యాండ్‌ ఎంతో కీలకం. భూమి స్వభావం గురించి తెలుసుకోవాలన్నా వెబ్‌ల్యాండ్‌ ద్వారానే సాధ్యపడుతుంది. తహసీల్దార్లు డిజిటల్‌ లాగిన్‌ ఇవ్వాలన్నా.. వెబ్‌ల్యాండ్‌ ఆధారంగానే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి రెవెన్యూ సేవలకు సంబంధించిన దరఖాస్తులను దశల వారీగా పరిశీలించటానికి వెబ్‌సైట్‌ పనిచేయకపోవటం ఇబ్బందులకు గురి చేస్తోంది. దరఖాస్తులు వందల సంఖ్య నుంచి వేల సంఖ్యకు చేరుకోవటంతో.. రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక అల్లాడిపోతున్నారు. 


సీసీఎల్‌ఏ సిబ్బంది నిర్లక్ష్యం.. 

వెబ్‌ల్యాండ్‌ ఇలా రోజంతా క్రాష్‌ కావటానికి ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయి. వెబ్‌సైట్‌ను గొల్లపూడి సీసీఎల్‌ఏ కార్యాలయంలో పర్యవేక్షిస్తుంటారు. పర్యవేక్షించే వారంతా కాంట్రాక్ట్‌ ఉద్యోగులే. రెవెన్యూ కార్యాలయాల్లోని కంప్యూటర్‌ ఆపరేటర్లు వెబ్‌ల్యాండ్‌ సమస్యలు ఎదుర్కొంటే.. సీసీఎల్‌ఏ కార్యాలయంలోని టీమ్‌ వాటిని పరిష్కరించాల్సి ఉంది. దీని కోసం ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశారు. కొద్ది నెలలుగా ఈ గ్రూప్‌లో రెవెన్యూ కార్యాలయాల కంప్యూటర్‌ ఆపరేటర్లు తమ సమస్యలను ప్రస్తావిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఒకరిద్దరు స్పందించినా వ్యంగ్యంగా సమాధానాలు చెబుతున్నారే తప్ప సమస్యను మాత్రం పరిష్కరించటం లేదు. 


అదనంగా సాంకేతిక సమస్యలు

నిర్వహణ సమస్యలే కాకుండా.. వెబ్‌సైట్‌లో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయి. తహసీల్దారు డిజిటల్‌ సిగ్నేచర్‌ ఇవ్వాలని ప్రయత్నించినా, థంబ్‌ ఇంప్రెషన్‌ ఇస్తున్నా ఎర్రర్‌ 101 అని చూపిస్తోంది. దీంతో దరఖాస్తులను పరిష్కరించలేకపోతున్నారు. దీనికి తోడు సర్వర్‌ సమస్యలు. సచివాలయాల వ్యవస్థ వచ్చాక ఆన్‌లైన్‌ సేవల విస్తృతి పెరిగింది. డేటా వినియోగం పెరిగింది. ఇవన్నీ వెబ్‌ల్యాండ్‌కు లింక్‌ అవుతుంటాయి. తగిన బ్యాండ్‌విడ్త్‌ లేకపోవటం వల్ల నెట్‌వర్క్‌ సమస్యలు తీవ్రంగా వెన్నాడుతున్నాయి. శక్తివంతమైన నెట్‌వర్క్‌, ఒత్తిడిలేని సర్వర్‌ ఉంటే అంతా సాఫీగా ఉంటుందనేది వాస్తవం. ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2020-11-20T06:37:16+05:30 IST