వీకెండ్‌ విందు

ABN , First Publish Date - 2021-03-13T05:30:00+05:30 IST

వీకెండ్‌లో మంచి రెస్టారెంట్‌కు వెళ్లాలి... నార్త్‌ ఇండియన్‌ వంటకాలను టేస్ట్‌ చేయాలి... ఈ వారం ఇది మీ ప్లాన్‌ అయితే ఆ రెసిపీలను ఇంట్లోనే ట్రై చేయండి. బేబీ కార్న్‌ బటర్‌ మసాలా, హరియాలి పనీర్‌ టిక్కా మసాలా, క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తా, డుబ్కీ వాలే ఆలూ, షాహీ

వీకెండ్‌ విందు

వీకెండ్‌లో మంచి రెస్టారెంట్‌కు వెళ్లాలి... నార్త్‌ ఇండియన్‌ వంటకాలను టేస్ట్‌ చేయాలి... ఈ వారం ఇది మీ ప్లాన్‌ అయితే ఆ రెసిపీలను ఇంట్లోనే ట్రై చేయండి. బేబీ కార్న్‌ బటర్‌ మసాలా, హరియాలి పనీర్‌ టిక్కా మసాలా, క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తా, డుబ్కీ వాలే ఆలూ, షాహీ బిండీ... వంటలు కచ్చితంగా మీ జిహ్వ చాపల్యాన్ని తీరుస్తాయి.


డుబ్కీ వాలే ఆలూ


కావలసినవి

బంగాళదుంపలు - ఆరు, టొమాటో - ఒకటి, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, కారం - రెండు టీస్పూన్లు, పసుపు - అర టీస్పూన్‌, ఎండుమామిడి పొడి - ఒక  టీస్పూన్‌, అల్లం - చిన్నముక్క, మెంతులు - అర టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - నాలుగు, మెంతి ఆకులు - కొద్దిగా, ఇంగువ - చిటికెడు.


తయారీ విధానం

  • ముందుగా బంగాళదుంపలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగించాలి. తరువాత మెంతులు, ఇంగువ, అల్లం వేసి మరికాసేపు వేగనివ్వాలి.
  • ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి. టొమాటోలు మెత్తగా ఉడికిన తరువాత ధనియాలపొడి, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేయాలి.
  • గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. చిన్న మంటపై 5నిమిషాలు ఉడికించుకున్న తరువాత మెంతి ఆకులు వేసి దింపుకోవాలి. 
  • కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. పూరీ లేదా పరోటాతో కలిపి సర్వ్‌ చేసుకోవాలి. 

షాహీ బిండీ 


కావలసినవి

బెండకాయలు - పావుకేజీ, కారం - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, గరంమసాల - అర టీస్పూన్‌, క్రీమ్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, మెంతి ఆకులు - కొద్దిగా, నూనె - సరిపడా, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, జీడిపప్పు - పావు కప్పు, టొమాటో - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, అల్లం - చిన్నముక్క, యాలకులు - రెండు, లవంగాలు - రెండు, దాల్చిన చెక్క - కొద్దిగా, పచ్చిమిర్చి - ఒకటి, జీలకర్ర - అర టీస్పూన్‌.


తయారీ విధానం

  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేయాలి. కాస్త వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మరికాసేపు వేగించాలి. తరువాత ఉల్లిపాయలు, వెల్ల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి 
  • వేగనివ్వాలి.
  • ఇప్పుడు జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించుకోవాలి. 
  • తరువాత టొమాటో ముక్కలు వేసి ఉడికించాలి. టొమాటోలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
  • చల్లారిన తరువాత మిక్సర్‌లో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి.
  • స్టవ్‌పై మళ్లీ పాన్‌ పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక బెండకాయ ముక్కలు వేసి వేగించాలి. కొద్దిగా ఉప్పు చల్లి మరి కాసేపు వేగించి పాత్రలోకి మార్చుకోవాలి.
  • అదే పాన్‌లో కాస్త నూనె వేసి వేడి అయ్యాక సిద్ధం చేసి పెట్టుకున్న షాహీ మసాలా పేస్టు వేయాలి. తరువాత కారం, పసుపు, గరంమసాల వేసి ఉడికించాలి. 
  • ఇప్పుడు వేగించి పెట్టుకున్న బెండకాయలు వేసి కలపాలి. గ్రేవీ కోసం కొద్దిగా నీళ్లు పోయాలి. 
  • చివరగా క్రీమ్‌, మెంతి ఆకులు వేసి దింపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

క్యాలీఫ్లవర్‌ పనీర్‌ కోఫ్తా


కావలసినవి

కోఫ్తా కోసం : క్యాలీఫ్లవర్‌ - ఒకటి, పనీర్‌ ముక్కలు - అరకప్పు, బంగాళదుంపలు - నాలుగు, కార్న్‌ఫ్లోర్‌ - మూడు టేబుల్‌స్పూన్లు, కారం - ఒకటేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత. 


కర్రీ కోసం : ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - నాలుగు, వాము - ఒక టీస్పూన్‌, కారం - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, క్రీమ్‌ - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట. 


తయారీ విధానం

  • క్యాలీఫ్లవర్‌ను ముక్కలుగా కట్‌ చేసి ఉప్పు వేసి మరిగించిన నీళ్లలో వేయాలి. మూడు నాలుగు నిమిషాల పాటు వేడి నీళ్లలో ఉంచి తరువాత పొడి టవల్‌ వేసి పెట్టుకున్న మరో పాత్రలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాలీఫ్లవర్‌లు డ్రై అవుతాయి.
  • ఇప్పుడు స్టవ్‌పై పాన్‌ పెట్టి క్యాలీఫ్లవర్‌ ముక్కలు డ్రై రోస్ట్‌ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కాసేపు వేగించుకుంటే సరిపోతుంది.
  • అలా వేగించుకున్న క్యాలీఫ్లవర్‌ ముక్కలను ఒక పాత్రలోకి తీసుకుని అందులో పనీర్‌ ముక్కలు వేయాలి. బంగాళదుంపల గుజ్జు, కార్న్‌ఫ్లోర్‌తో పాటు ఉల్లిపాయలు, టొమాటోలు, వాము, గరంమసాలా, ధనియాల పొడి, తగినంత కారం, ఉప్పు, క్రీమ్‌ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కోఫ్తాలుగా చేసుకోవాలి. 
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక కోఫ్తాలను వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి.
  • కర్రీ తయారీ కోసం పాన్‌లో కాస్త నూనె వేసి వేడి అయ్యాక వాము, ఉల్లిపాయలు వేసి వేగించాలి. టొమాటో ప్యూరీ వేసుకోవాలి. కారం, గరంమసాలా, ధనియాల పొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా క్రీమ్‌ వేసి కలుపుకోవాలి. వేగించి పెట్టుకున్న కోఫ్తాలతో కలుపుకోవాలి. చిన్నమంటపై కాసేపు ఉంచి దింపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి. 

హరియాలి పనీర్‌ టిక్కా మసాలా 


కావలసినవి

పనీర్‌ - పావుకేజీ, సోంపు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, పుదీనా - ఒకకట్ట, టొమాటోలు - రెండు, అల్లం - చిన్నముక్క, దాల్చినచెక్క - చిన్నముక్క, యాలకులు - రెండు, బిర్యానీ ఆకు - ఒకటి, గరంమసాలా - అర టీస్పూన్‌, చాట్‌మసాల - అర టీస్పూన్‌, క్రీమ్‌ - పావుకప్పు, ఉప్పు - తగినంత, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం

  • ముందుగా పనీర్‌ను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 
  • సోంపు, కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా పట్టుకోవాలి.
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా వెన్న వేసి వేడి అయ్యాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేగించాలి. తరువాత టొమాటో ప్యూరీ వేసి ఉడికించాలి.
  • ఇప్పుడు పేస్టులా పట్టుకున్న మసాల వేయాలి. తరువాత గరంమసాలా, చాట్‌ మసాల వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
  • తరువాత అందులో క్రీమ్‌, పనీర్‌ ముక్కలు వేసి కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని రెండు, మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. పనీర్‌ ముక్కలకు మసాల బాగా పట్టిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని సర్వ్‌ చేసుకోవాలి. 
  • నాన్‌ లేదా పుల్కాలోకి ఈ గ్రేవీ రుచిగా ఉంటుంది.

బేబీకార్న్‌ బటర్‌ మసాలా


కావలసినవి

బేబీకార్న్‌ - అరకేజీ, టొమాటోలు - మూడు, కారం - ఒక టీస్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, క్రీమ్‌ - పావుకప్పు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, మెంతి ఆకులు - కొద్దిగా, నూనె - సరిపడా, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెలుల్లి రెబ్బలు - నాలుగైదు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు.


తయారీ విధానం

  • ముందుగా ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు పలుకులను మిక్సీలో వేసి మెత్తటి పేస్టుగా తయారుచేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. 
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి వెన్న వేయాలి. కాస్త వేడి అయ్యాక బేబీ కార్న్‌ వేసి పది నిమిషాల పాటు వేగించాలి. కార్న్‌ బాగా వేగిన తరువాత ఒక పాత్రలోకి తీసుకోవాలి.
  • తరువాత అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి మిక్సీలో వేసి పట్టుకున్న ఉల్లిపాయ పేస్టు వేసి వేగించాలి. జీలకర్ర పొడి, గరంమసాల వేసి ఒక కప్పు నీళ్లు పోసి  చిన్నమంటపై ఉడికించాలి.
  • బటర్‌ మసాలా చిక్కబడిన తరువాత క్రీమ్‌ వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత వేగించి పెట్టుకున్న బేబీ కార్న్‌ వేసి మరో పదినిమిషాలను వేగనివ్వాలి. 
  • చివరగా మెంతి ఆకులు చల్లుకుని దింపుకోవాలి. బ్రెడ్‌తో లేదా పులావ్‌తో తింటే రుచిగా ఉంటుంది.

Read more