అల్లూరి విగ్రహానికి ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-06-28T05:50:48+05:30 IST

భీమవరంలో వచ్చే నెల 4న ఆవిష్కరిస్తున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం తమ గ్రామం చేరగానే రాజానగరం సంతోషంతో ఉప్పొంగింది.

అల్లూరి విగ్రహానికి ఘన స్వాగతం
కలిదిండిలో ఊరేగింపుగా తీసుకెళ్తున్న అల్లూరి భారీ విగ్రహం

ముదినేపల్లి/ముదినేపల్లి రూరల్‌/కలిదిండి, జూన్‌ 27: భీమవరంలో వచ్చే నెల 4న ఆవిష్కరిస్తున్న  మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం తమ గ్రామం చేరగానే రాజానగరం సంతోషంతో ఉప్పొంగింది. క్షత్రియ నాయకులు మన్యం వీరుడి విగ్రహానికి హారతులిచ్చి పూలమాలలు వేశారు. మహిళలు కూడా విగ్రహానికి స్వాగతం పలికారు. ముదినేపల్లిలో బీజేపీ నాయకుడు లావేటి వీర శివాజీ, యర్రా నాని ఆధ్వర్యంలో అల్లూరి విగ్రహానికి ఘన స్వాగతం పలికారు.  ముదినేపల్లి రూరల్‌ పెదపాలపర్రు సెంటర్‌లో గ్రామ ప్రజలు పూజలు నిర్వహించారు.  టీడీపీ మండల అధ్యక్షుడు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి ఆధ్వ ర్యంలో ప్రజలు స్వాగతం పలికారు.  కలిదిండి ప్రధాన రహదారిపై బాణాసంచా కాల్చుతూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. భారీ విగ్రహాన్ని చూడటానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. 


భారీ విగ్రహం తరలింపులో వెతలు

అల్లూరి  భారీ విగ్రహం తరలింపు  కష్టమైంది. సోమవారం పెద్ద ట్రాలీపై అల్లూరి భారీ విగ్రహాన్ని బొమ్ములూరు నుంచి ముదినేపల్లి, సింగరాయపాలెం, బొమ్మినంపాడు, కోరుకొల్లు మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించారు. ముదినేపల్లి నుంచి బొమ్మినంపాడు వరకు సుమారు 11 కిలోమీటర్ల దూరం రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన చెట్ల మధ్య నుంచి భారీ విగ్రహాన్ని తరలించటానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది. విగ్రహంలో బాణం పట్టుకున్న చెయ్యి పలుసార్లు చెట్ల కొమ్మలలో ఇరుక్కుపోయింది.  పశ్చిమ గోదావరి జిల్లా క్షత్రియ, యువజన సంఘాల నాయకులు సూర్య నారాయణ రాజు, నరసింహరాజు, నాగరాజు వాహనం ముందు సూచనలిస్తూ తీసుకెళ్లారు.  ముదినేపల్లి ఏఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ అల్లూరి విగ్రహాన్ని సురక్షితంగా పంపటంలో జాగ్రత్తలు తీసుకున్నారు.



Updated Date - 2022-06-28T05:50:48+05:30 IST