సీమలోనూ అఖండ స్వాగతం

ABN , First Publish Date - 2021-12-08T08:41:33+05:30 IST

సీమలోనూ అఖండ స్వాగతం

సీమలోనూ అఖండ స్వాగతం

చిత్తూరు జిల్లాలోకి మహా పాదయాత్ర

అమరావతి రైతులపై అడుగడుగునా పూలవర్షం

స్వాగతించేందుకు సరిహద్దుకు తరలివచ్చిన జనం

వైసీపీ మినహా అన్ని పార్టీల శ్రేణుల నీరాజనం


తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం టు దేవస్థానం’ మహా పాదయాత్రకు రాయలసీమలోనూ అఖండ స్వాగతం లభించింది. 37వ రోజైన మంగళవారం ఉదయం 10.20 గంటలకు పాదయాత్ర నెల్లూరు జిల్లాను వీడి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. రైతులకు ఘనస్వాగతం పలికేందుకు జిల్లా సరిహద్దులోని శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లెకు జనం పోటెత్తారు. వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీల నాయకులు వేర్వేరుగా ఎదురేగి పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించారు.  జిల్లాలో తొలిరోజు పాదయాత్ర బృందంపై అడుగడుగునా పూలవర్షం కురిసింది. ప్రతి గ్రామం వద్ద జనం  నిరీక్షించి స్వాగతం పలికారు.  


సీమ సరిహద్దుకు పోటెత్తిన నేతలు

రైతుల మహాపాదయాత్రకు స్వాగతం పలికినవారిలో మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నేతలు నరసింహ యాదవ్‌, పులివర్తి నాని, చక్రాల ఉష, చిత్తూరు మాజీ మేయర్‌ కటారి హేమలత తదితరులున్నారు. జగ్గరాజుపల్లె నుంచి కాస్త ముందుకు కదలగానే బీజేపీ ముఖ్యనేత కోలా ఆనంద్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు పాదయాత్రకు అట్టహాసంగా స్వాగతం పలికారు. మరికొంచెం ముందుకు సాగగానే సీపీఎం, జనసేన పార్టీ శ్రేణులు వేర్వేరుగా ఎదురేగి స్వాగతం పలికాయి. జగ్గరాజుపల్లె నుంచి వరుసగా ప్రతి గ్రామంలోనూ పాదయాత్రకు డప్పులు, డ్రమ్స్‌ తదితర వాయిద్యాలు, బాణసంచా పేలుళ్ల నడుమ అట్టహాసంగా స్వాగతాలు లభించాయి. పాదయాత్రలో శ్రీవారి రథానికి అమర్చిన ట్రాక్టర్‌ను అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ కన్వీనర్‌ శైలజ నడపడం అందరినీ ఉత్సాహపరిచింది. మాజీమంత్రి అమరనాథ్‌రెడ్డి కూడా కొంత దూరం ఆ ట్రాక్టర్‌ నడిపి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.


బస శిబిరాన్ని దున్నేశారు..

పాదయాత్ర బృందం మధ్యాహ్న భోజనం చేయడానికి శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామం వద్ద ప్రధాన రహదారి పక్కనే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం గ్రామస్థుడు తన భూమిని డోజర్‌తో చదును కూడా చేయించారు. అంతలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆ భూమిని దున్నేయడంతో అక్కడ మకాం వేయడానికి వీలు కాలేదు. దీంతో మరో గ్రామస్థుడు అరకిలోమీటరు దూరంలోని తన భూమిలో బస చేసేందుకు అనుమతించడంతో అక్కడ మకాం వేసి మధ్యాహ్న భోజనం ముగించారు. అయితే, ఓ పోలీసు అధికారి పలుమార్లు అక్కడికి వచ్చి ఆ భూమి యజమానిని ప్రశ్నలతో వేధించినట్టు తెలిసింది. దీంతో అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు ఆ భూమి యజమానితో మాట్లాడి ఊరడించారు. సాయంత్రానికి పాదయాత్ర ఏర్పేడు మండలం చింతలపాలెం చేరుకుంది. పాదయాత్ర బృందం రాత్రికి అక్కడే బస చేసింది. ఇనగలూరులో డప్పులు, డ్రమ్స్‌కు ఉత్సాహంగా స్టెప్పులేసిన శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డికి బీపీ డౌన్‌ అవ్వడంతో వెంటనే అనుచరులు తిరుపతికి తరలించారు. రైతుల మహాపాదయాత్ర వెంట ఎటుచూసినా పోలీసు వాహనాలు, బలగాలే కనిపించాయి. పోలీసులతోపాటు ప్రైవేటు ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లతో పాదయాత్ర అడుగడుగునా కదలికలను రికార్డు చేయడం కనిపించింది. ‘నిబంధనలు పాటించాలి’, ‘ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించరాదు’ తదితర ప్లకార్డులతో మహిళా పోలీసులు పాదయాత్ర ముందుభాగాన నిలవడంతో పాదయాత్ర నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.    


రైతుల మహాసభకు మద్దతు: బీజేపీ

మంగళగిరి: రాజధాని రైతులు ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించే మహాసభకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ విజయవాడ వస్తున్నారని తెలిపింది. రాష్ట్రప్రభుత్వ విధానాలపై 28న విజయవాడలో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.



నెల్లూరు వాసులందరికీ కృతజ్ఞతలు

 నెల్లూరు జిల్లాలో పాదయాత్రకు మద్దతు తెలిపిన ప్రజలందరికీ పాదయాత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే ముందు అమరావతి జేఏసీ నాయకులు మోకాళ్లపై నిలబడి చేతులు జోడించి నెల్లూరు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 

రూ.11 లక్షల విరాళాలు

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో మంగళవారం రూ.11 లక్షలకు పైగా విరాళాలు అమరావతి రైతులకు అందజేసినట్లు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. తాను రూ.5లక్షలు, గంగోటి నాగేశ్వరావు 2 లక్షలు, నియోజకవర్గంలో 3 లక్షలు, పెమ్మసాని సుగుణ రూ.లక్ష ఇచ్చినట్లు తెలిపారు.


అమరావతి రైతుల వ్యథ జాతీయ సమస్య

ఢిల్లీ రైతు ప్రతినిధుల వెల్లడి

17న తిరుపతికి ఉత్తర భారత రైతు సంఘాలు

అమరావతి రైతుల వ్యథను జాతీయ సమస్యగా గుర్తిస్తున్నామని ఢిల్లీ రైతు ప్రతినిధులు వెల్లడించారు. మహా పాదయాత్ర రైతులకు సంఘీభావం ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేసినప్పుడు కూడా ప్రభుత్వాల నుంచి అడ్డంకులు, వేధింపులు ఎదురయ్యాయని సంజీవ్‌ చౌదురి వివరించారు. తాము వెనక్కి తగ్గకుండా పట్టుదలగా పోరాడినందునే చివరికి కేంద్ర ప్రభుత్వం తల వంచిందని వివరించారు. ఈనెల 17న తిరుపతిలో నిర్వహించనున్న పాదయాత్ర ముగింపు సభకు ఉత్తర భారతదేశ రైతు సంఘాల నేతలు హాజరయ్యేలా చూస్తామని తెలిపారు. 


చేయి విరిగినా మడమ తిప్పని మహిళ

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రత్నకుమారి చేయి విరిగినా పాదయాత్రలో కొనసాగుతున్నారు.  నాలుగు రోజుల కిందట నెల్లూరు జిల్లా సైదాపురం వద్ద ప్రమాదవశాత్తూ కిందపడడంతో ఆమెకుడిచేయి విరిగింది. స్థానిక ఆస్పత్రిలో   కట్టు కట్టించుకున్నారు. తాను ఆగిపోతే పాదయాత్రబృందం నైతిక స్థైర్యం దెబ్బతింటుందన్న ఉద్దేశంతోనే  ముందుకు సాగుతున్నట్టు ఆమె వివరించారు.

Updated Date - 2021-12-08T08:41:33+05:30 IST