కొత్త ఏడాది 2022కి స్వాగతం..

ABN , First Publish Date - 2022-01-01T06:34:32+05:30 IST

ఒక కాలం వస్తుంది హూ హూ చలికాలంలా చిట చిట ఎండాకాలంలా గిజ గిజ వానాకాలంలా....

కొత్త ఏడాది 2022కి స్వాగతం..

ఒక కాలం వస్తుంది

ఒక కాలం వస్తుంది

హూ హూ చలికాలంలా

చిట చిట ఎండాకాలంలా

గిజ గిజ వానాకాలంలా

ఓ కాలం తప్పకుండా వస్తుంది


అయ్యో అయ్యో

అంగలార్చినా కాలం కరవాలమై

మనిషిపై కత్తి కడుతుంది


అనుభవించిన లేక అనుభవిస్తున్న 

సౌఖ్య సౌకర్యాలను దునుమాడుతుంది

రివ్వున ఆకాశంలోకి

ఎగిరే మనసు రెక్కలు

హఠాత్తుగా కత్తిరించబడి

చూస్తూ చూస్తుండగానే

తెగిన గాలిపటంలా బేలగా

వలవలా నేల రాలుతుంది


ఓ కాలం వద్దన్నా కూడా వస్తుంది

కళ్ళలోంచి మెలుకువలోకి

తెగిపడ్డ స్వప్నంలా

రక్తం కారుతూ అశక్తతతో

తోకతెగిన కుక్కలా మొరుగుతుంది


అభివృద్ధి అనుకునే నాగరికత

మనిషి ఉసురు తీస్తుంది

చెట్లు లేక ప్రాణవాయువు అందక

నదులు లేక గొంతెండి పోయి

నవ మానవుడు తల్లడిల్లే

ఒక కాలం కాలనాళికలో పరీక్షిస్తుంది


–జూకంటి జగన్నాథం 


గత పేజీల వెనుక


గత క్యాలెండర్

పేజీల రెపరెపలలో

కొన్ని స్మృతులను

ఇక్కడే పోగేసి వెళ్ళింది

కొన్ని అనుభూతుల పత్రాలపై

చిత్రాలను కనువిందుగా చేసి

ఆదమరచి వెళ్ళిపోయింది

గత ఏడాది పొడుగునా

కొన్ని దృశ్యాల పరంపరలు

మెదళ్లకు అంటిన బూజులా

అక్కడక్కడా వేలాడుతున్నాయి


మరకలంటిన చొక్కా

కొత్తదనాన్ని అతికించుకున్నట్టు

కొన్ని జ్ఞాపకాల మడతలు

స్పష్టంగా కనిపిస్తున్నాయి

ఆర్భాటాలన్నీ ఓ మూలకు

ఒగ్గేసి కూర్చున్నా తప్పులేదు

అడుగడుగున ఒక గుర్తు

పాదాల్ని అనుసరిస్తూనే ఉంది

గుండె రాతికి చెక్కిన

బతుకు బొమ్మల వ్యథలు

మనతోనే వస్తున్నాయి

కొత్త సంవత్సరం

సంఖ్యను మార్చుకొని


అసంఖ్యాక ప్రజల ముంగిట్లో

ఉత్సవంలా కదిలొచ్చినా

పాత లెక్కల రంగుల వలయం

ఒక నిర్మాణమై కూర్చుంది

గత పేజీల ముద్రలన్నీ

నూతనత్వపు వెలుగులో

అక్కడక్కడ నక్షత్రాలై మెరుస్తున్నాయి

కొత్త సంవత్సర కొత్తదనం

గతాన్ని ఇంకా నెట్టనేలేదు


– నరెద్దుల రాజారెడ్డి


నచ్చే రీతిని నడచుకో!


హ్యాప్పీ హ్యాప్పీ న్యూ ఇయర్‌!...

అభినందనలూ మైడియర్‌!.. //హ్యా//


నదిలో అలలే దొర్లినట్లుగా

కదలి వెళ్లులే కాలమే!....

శిశిరం ఆకులు రాలినట్లుగా

పతనమవును ప్రతి ఏడుయే!...

గడియారంలో ముల్లులా

గడచిపోవు సంవత్సరమే!... //హ్యా//


గడిచిన ఏడు తిరిగిరాదులే

పోయినదానికి కుమలకా

వచ్చేదానిని వదలకా

నచ్చే రీతిని నడచుకో!...

మనసిచ్చే మాదిరి మసలుకో!... //హ్యా//


– వడ్డేపల్లి కృష్ణ


రేపటి ఆనంద దృశ్యాలు


కదిలిపోయే కాలం వెంట

అక్కడక్కడ 

సేదతీరే మజిలీలా..!

కొత్తదనమూ వుంటుంది

నీటిమీది బుడగలా

క్షణకాల వసంతం

ఈ బతుకులపై

చిరునవ్వుల్ని 

అసంకల్పితంగా మొలిపించి

మాయల ముసుగేసి పోతుంది

ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నా

మనిషి ఆనందాలకు బానిస

మత్తుమోజుల పదనిస


కొత్త వత్సరాన్ని శుభాకాంక్షలతో

ఎంత చిమ్ముకున్నా

దినం గడిస్తే

రొటీన్ జీవితంలోకే అందరం

బతుకుని వీడని

బాధల పద్దులు

కొత్త డైరీలో దినచర్యలై

వాలిపోతాయి

మరో పన్నెండు పేజీల

ఆకాంక్షల్ని అనివార్యంగా

మన గది గోడకు కొడతాం..

తిరిగిపోతున్న క్యాలెండర్ కమ్మలు

ఎన్ని గుణపాఠాలు నేర్పుతాయో..

ఈ ఆనంద సమయాన


నిట్టూర్పు విడువకు నేస్తం

ఇవాళ్టి బాధలకు

రేపటి ఆశల్ని పులుము

నేటి వికృత గొంగళి

పురుగులన్నీ

రంగు రంగుల

సీతకోక చిలుకలై

రేపు ఆనంద దృశ్యాల్ని

ఆవిష్కరించక మానవు..!


– కటుకోఝ్వల రమేష్


తన మాటను గెలిపిస్తూనే ఉంది


సృష్టిని

చిటికిన వ్రేలు పట్టుకుని

నడిపించే కాలం.


సృష్టిలో ఓ అద్భుతాకృతి మనిషికి

కోట్ల సంవత్సరాలు నడిచినా

దొరకని జవాబు కాలం చిరునామా..


ప్రశ్న రుచిమరిగిన మనిషి

తత్వం, శాస్త్రం, యోగం, జ్ఞానం, తపస్సు

పరిశోధన, ప్రయోగం, పరిశీలనలతో

ఎత్తిన రూపాలెన్నో.....


ఎంతో లోతుగా తవ్వుతూ

ఎంతో ఎత్తును గురి చూసాడు.

ఎంతో బరువును మోస్తూ

ఎంతో తేలికగా మారాడు...


ఎన్నో ప్రశ్నలను పుట్టించి

ఎన్నిటికో జవాబులు కనిపెట్టాడు.

ఎన్నిటికో జవాబుగా మారి

ఎన్నో ప్రశ్నలను చంపేశాడు.


తరం తరం నిరంతరం

మానవ మేధస్సు

ప్రశ్నతో హద్దులు చెరిపి

ప్రాణం ఎరగా వేసైనా సరే

రహస్యం వైపు విజయం నేర్చుకుంది...


కాలాన్ని

శత్రువుగా పోరాడుతూ

మిత్రుడుగా అభిమానిస్తూ

బంధువుగా ప్రేమిస్తూ..

దైవంగా ఆరాధిస్తూ

భూతంగా భయపడుతూ

రహస్యంగా పరిశోధిస్తూ

తన అడుగును వినిపిస్తూనే ఉంది.

తన మాటను గెలిపిస్తూనే ఉంది.


– చందలూరి నారాయణరావు


కాలమే నీకు చేదోడు


భవితను మెరుగులు దిద్దగ,

వెలుగులు తెచ్చిన వేకువలా

నూతన వత్సరమొచ్చేను చూడు


శోకం నిండిన చీకటిని,

లోకం నుండి తరిమేందుకు

ఆశకు వాహకం అయ్యేందుకు

తానే దూసుకు వచ్చేను చూడు.


కరోనా భూతం కరాళ నృత్యం సలపగ,

గడిచిన యేడు.. గతుకుల పయనం కాగా,

ఆస్తులు పోయి, ఆప్తులు పోయి

నడిచిన బతుకులు.. పిడుగుల పాలై,

ఇడుములు పడగా,

దిగులు చెందిన జనులందరికీ

తానున్నానని ఓదార్చేందుకు


నావయై ఒడ్డుకు చేర్చేందుకు

నూతన వత్సరమొచ్చేను చూడు

తానే దూసుకు వచ్చేను చూడు.


కలతను వీడు

స్వాగత గీతాలు పాడు

కాలమే నీకు చేదోడు


– డి.వి.జి.శంకర రావు

Updated Date - 2022-01-01T06:34:32+05:30 IST