సంక్షేమం.. సంక్షోభం

ABN , First Publish Date - 2021-11-29T06:45:26+05:30 IST

జిల్లాలో సంక్షేమ వసతిగృహాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్నాయి. ఐదు నెలల నుంచి బిల్లులు క్లియర్‌ కాకపోవడంతో నిర్వాహకులు ఇక్కట్లు పడుతున్నారు. సుమారు రూ.9 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వసతిగృహాల నిర్వహణకు వార్డెన్లు కిందా మీదా పడుతున్నారు.

సంక్షేమం.. సంక్షోభం

వసతిగృహాలకు ఐదు నెలలుగా అందని డైట్‌ బిల్లులు

రూ.9 కోట్ల మేర పెండింగ్‌

అరువుపై సరకులు తెస్తున్న వార్డెన్లు

కొన్నిచోట్ల ఆ వెసులుబాటు కూడా లేని వైనం

బంగారం తనఖాపెట్టి.... విద్యార్థులకు భోజనాలు

పూర్తిస్థాయిలో మెనూని అమలు చేయలేని దుస్థితి

బిల్లులు క్లియర్‌ చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)

జిల్లాలో సంక్షేమ వసతిగృహాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్నాయి. ఐదు నెలల నుంచి బిల్లులు క్లియర్‌ కాకపోవడంతో నిర్వాహకులు ఇక్కట్లు పడుతున్నారు. సుమారు రూ.9 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వసతిగృహాల నిర్వహణకు వార్డెన్లు కిందా మీదా పడుతున్నారు. 

జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 32 ప్రీమెట్రిక్‌, 23 పోస్టుమెట్రిక్‌ వసతిగృహాలు వున్నాయి. వీటిల్లో 5,600 సీట్లు వుండగా ప్రస్తుతం 3,450 మంది విద్యార్థులు వున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 53 ప్రీమెట్రిక్‌, 30 పోస్టుమెట్రిక్‌ హాస్టల్స్‌ ఉన్నాయి. వీటిలో 6 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి నెలా కొంత మొత్తాన్ని డైట్‌ చార్జీల కింద చెల్లిస్తోంది. మూడు నుంచి 7వ తరగతి వరకు చదివే ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,000 చొప్పున, 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థికి రూ.1,250 చొప్పున, పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు రూ.1400 చొప్పున చెల్లిస్తోంది. విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం భోజనం అందించాలి. వసతిగృహాల్లో ఆహారం వండడానికి అవసరమైన నిత్యావసర సరకులు, కూరగాయలు, గుడ్లు, మాంసం వంటి వాటిని వార్డెన్లు బయట వ్యాపారుల నుంచి అరువుపై కొనుగోలు చేసి తీసుకువస్తుంటారు. డైట్‌ చార్జీల బిల్లులు విడుదలైన వెంటనే బకాయిలను తీరుస్తుంటారు. అయితే గత ఐదు నెలల నుంచి ప్రభుత్వం డైట్‌ బిల్లులు విడుదల చేయకపోవడంతో వసతిగృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం వార్డెన్లకు తలకు మించిన భారంగా మారింది. 


సరకులు ఇచ్చేందుకు ససేమిరా..

సాధారణంగా ఒక్కో హాస్టల్‌లో విద్యార్థుల డైట్‌కు నెలకు 80 వేల నుంచి లక్షా పది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇందుకు అవసరమైన సరకులను వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తుంటారు. అయితే ఐదు నెలలుగా బిల్లులు క్లియర్‌ చేయకపోవడంతో అరువుపై సరకులు ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. దీంతో విద్యార్థులకు భోజనం పెట్టడం సమస్యగా మారుతోందని వార్డెన్లు వాపోతున్నారు. కొంతమంది వార్డెన్లు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి, సరకులను కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది వార్డెన్లు సొంత పూచీకత్తుపై సరకులు తీసుకువచ్చి హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. 


పాత రేట్లతో పాట్లు.. 

వసతిగృహాల్లోని విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ప్రభుత్వం 2018లో ఒక మెనూని నిర్ణయించింది. నాటి ధరల ప్రకారమే ఇప్పటికీ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది. అయితే అప్పటితో పోలిస్తే అన్ని రకాల సరకుల ధరలు భారీగా పెరిగాయి. కానీ మెస్‌ చార్జీలను మాత్రం ప్రభుత్వం పెంచడంలేదు. దీంతో మెనూని పూర్తిస్థాయిలో అమలు చేయడం సాధ్యం కావడంలేదని వార్డెన్లు వాపోతున్నారు. అదే విధంగా వసతిగృహాలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లులు గత ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు.  సొంత డబ్బులు పెట్టి వసతిగృహాలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు బిల్లులు క్లియర్‌ చేయపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని ఓ వార్డెన్‌ వాపోయాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2021-11-29T06:45:26+05:30 IST