దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-01-16T05:59:31+05:30 IST

దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, దివ్యాంగులను అన్ని విఽధాలుగా అదుకునేలా భరోసా ఇస్తోందని రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ కె.వాసుదేవరెడ్డి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో శారీరక దివ్యాంగులకు సహాయ ఉపకరణలు అందజేయడానికి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంపిక శిబిరాన్ని నిర్వహించారు.

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట
మాట్లాడుతున్న రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి

- రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి 

సిరిసిల్ల టౌన్‌, జనవరి 15: దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, దివ్యాంగులను అన్ని విఽధాలుగా అదుకునేలా భరోసా ఇస్తోందని రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ కె.వాసుదేవరెడ్డి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో శారీరక దివ్యాంగులకు సహాయ ఉపకరణలు అందజేయడానికి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంపిక శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో శారీరక దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్‌, కాలీపర్స్‌ , కృతిమ కాళ్లు అందజేయడానికి ఎంపిక శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. శనివారంతో శిబిరం ముగుస్తుందని జిల్లాలో అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.. 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికలాంగుల హక్కుల చట్టాలకు సంబంధించిన అంశాలన్నింటినీ తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అమలు చేస్తోందని,  మిగతా రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు.  జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం   కృషి చేస్తోందన్నారు.   కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఏఎల్‌ఐఎంసీవో సంస్థ నిపుణుల సహకారంతో జిల్లాలో దివ్యాంగుల శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒకప్పుడు  ట్రైసైకిల్‌, కృతిమ కాళ్ల కోసం దివ్యాంగులు హైదరాబాద్‌ చుట్టూ తిరిగేవారని, ప్రస్తుతం వారికి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలోనే శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. దివ్యాంగుల సంఘం ప్రతినిధుల కోరిక మేరకు జిల్లాలో దివ్యాంగుల భవనం నిర్మించడానికి అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అనంతరం దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో  అదనపు కలెక్టర్‌ ఆర్‌.అంజయ్య, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, స్థానిక కౌన్సిలర్లు దివ్యాంగుల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు చందర్‌రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:59:31+05:30 IST