ప్రముఖ కవి సచ్చిదానందన్ ఫేస్‌బుక్ ఖాతా నిలిపివేత... మోదీని విమర్శించినందుకేనా...?

ABN , First Publish Date - 2021-05-09T16:42:16+05:30 IST

కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి, ప్రముఖ కవి కే సచ్చిదానందన్

ప్రముఖ కవి సచ్చిదానందన్ ఫేస్‌బుక్ ఖాతా నిలిపివేత... మోదీని విమర్శించినందుకేనా...?

తిరువనంతపురం : కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి, ప్రముఖ కవి కే సచ్చిదానందన్ ఫేస్‌బుక్ ఖాతా తాత్కాలిక నిలిపివేతకు గురైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై విమర్శలతో కూడిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేసినందుకు ఫేస్‌బుక్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. సచ్చిదానందన్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా, దురుసుగా ఉన్నాయని పేర్కొంది. 


కే సచ్చిదానందన్ మాట్లాడుతూ, అభిప్రాయాలను వెల్లడించేవారిని నిశితంగా పరీక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితులైన స్వార్థపర శక్తులు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తన ఖాతాను 24 గంటలపాటు ఫేస్‌బుక్ నిలిపేసిందని చెప్పారు. శుక్రవారం రాత్రి నుంచి ఈ ఆంక్షలు విధించిందన్నారు. కమ్యూనిటీ స్టాండర్డ్స్‌ను తాను ఉల్లంఘించినట్లు తెలిపిందన్నారు. 


ఫేస్‌బుక్ వెల్లడించిన సమాచారం ప్రకారం, కే సచ్చిదానందన్ ఖాతాను శుక్రవారం రాత్రి నుంచి 24 గంటలపాటు బ్లాక్ చేశారు. మరొక 30 రోజులపాటు ఆయన ఫేస్‌బుక్‌ లైవ్ నిర్వహించరాదు. 


సచ్చిదానందన్ మాట్లాడుతూ, తనకు వాట్సాప్ ద్వారా వచ్చిన ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశానని చెప్పారు. ఆ తర్వాత మే 7న రాత్రి తన ఖాతాను 24 గంటలపాటు నిషేధిస్తున్నట్లు తనకు సమాచారం ఇచ్చారన్నారు. 24 గంటలపాటు దేనినీ పోస్ట్, షేర్, కామెంట్ చేయరాదని ఈ సమాచారంలో పేర్కొన్నారని తెలిపారు. ఈ వీడియోలో అమిత్ షా గురించి, ఇటీవల బీజేపీ పరాజయం గురించి ఉందన్నారు. మరొక మెసేజ్‌లో నరేంద్ర మోదీపై హాస్యభరితమైన ‘మిస్సింగ్’ అడ్వర్టయిజ్‌మెంట్ ఉందన్నారు. 


సచ్చిదానందన్‌పై గతంలో కూడా ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకుంది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన పెట్టిన పోస్ట్‌ను తొలగించింది. ఏప్రిల్ 21న ఇచ్చిన సమాచారంలో తదుపరి చర్యలు నియంత్రించే స్వభావంగలవిగా ఉంటాయని హెచ్చరించింది.


Updated Date - 2021-05-09T16:42:16+05:30 IST