మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే: నడ్డా

ABN , First Publish Date - 2021-07-25T21:56:04+05:30 IST

వచ్చే ఏడాది గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ..

మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే: నడ్డా

పనజి: వచ్చే ఏడాది గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనప్రాయంగా తెలిపారు. గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ఆయనతోనే (ముఖ్యమంత్రి అభ్యర్థిగా) ఎన్నికలకు బీజేపీ వెళ్తుందని చెప్పారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో నడ్డా మాట్లాడుతూ,  సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీలో పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటన చేస్తుందని, అయితే, వేరే పేర్ల గురించి ఆలోచించాల్సిన పని లేదని, ప్రమోద్ సావంత్ గోవాను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని, చక్కటి పనితీరు ప్రదర్శిస్తున్నారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో తాను జరిపిన సమావేశంలో ఎమ్మెల్యేలు ఎంతో ఆశావవహంగా, ధీమాతో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు బీజేపీలో చేరుతున్నారని, వారితో తాను సమగ్ర చర్చలు జరిపానని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పనితీరు పట్ల అందరూ సంతృప్తికరంగా ఉన్నారని చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో గోవా గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. 'స్పూప్‌గేట్' వివాదంపై అడిగినప్పడు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని, పసలేని ఆరోపణలని అన్నారు. ప్రజా సంబంధిత అంశాలేవీ లేనందునే ఇలాంటి ఆరోపణలకు వాళ్లు దిగుతున్నారని నడ్డా వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-07-25T21:56:04+05:30 IST