Governorకు మమత బెనర్జీ చురకలు

ABN , First Publish Date - 2021-11-10T01:20:36+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ

Governorకు మమత బెనర్జీ చురకలు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన పేరును ప్రస్తావించకుండా మాట్లాడుతూ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం ఎవరూ చేయకూడదన్నారు. అటువంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని, అన్యాయమని అన్నారు. 


కొత్తగా ఎన్నికైన నలుగురు టీఎంసీ ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించాలని డిప్యూటీ స్పీకర్ అశిష్ బెనర్జీని గవర్నర్ ధన్‌కర్ కోరారు. స్పీకర్ బిమన్ బెనర్జీని కాకుండా డిప్యూటీ స్పీకర్‌ను ఈ విధంగా కోరడంపై వివాదం రేగింది. ఈ నేపథ్యంలో మమత బెనర్జీ మంగళవారం శాసన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


‘‘నేను ఎవరి పేరునూ ప్రస్తావించాలనుకోవడం లేదు. కానీ స్పీకర్ స్థానాన్ని తక్కువ చేయడానికి ఎవరూ ప్రయత్నించకూడదు. శాసన సభలో స్పీకర్ స్థానం అత్యున్నత రాజ్యాంగ పదవి. ఎవరైనా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తే, అది ఆమోదయోగ్యం కాదు, న్యాయం కాదు’’ అని మమత వ్యాఖ్యానించారు. 


కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించేందుకు డిప్యూటీ స్పీకర్‌కు గవర్నర్ అధికారం ఇవ్వడంతో పశ్చిమ బెంగాల్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ పార్థ ఛటర్జీ స్పందించారు. వీరి చేత ప్రమాణం చేయించే అవకాశాన్ని స్పీకర్ బిమన్ బెనర్జీకి కల్పించాలని గవర్నర్‌ను ఓ లేఖ ద్వారా కోరారు. దీనికి గవర్నర్ అంగీకరించారు. దీంతో సుబ్రత మండల్, బ్రజ్ కిశోర్ గోస్వామి, ఉదయన్ గుహ, శోభన్ దేబ్ ఛటోపాధ్యాయల చేత మంగళవారం బిమన్  ప్రమాణం చేయించారు. 


Updated Date - 2021-11-10T01:20:36+05:30 IST