మోదీతో మమత భేటీ

ABN , First Publish Date - 2021-11-25T00:04:52+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం ప్రధాన

మోదీతో మమత భేటీ

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అధికార పరిధి విస్తరణపై చర్చించారు. 


మోదీతో భేటీ అనంతరం మమత బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యానని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళానన్నారు. బీఎస్ఎఫ్ అధికార పరిధిని విస్తరించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరానని చెప్పారు. 


భారత్-పాకిస్థాన్, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికార పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. అంతర్జాతీయ సరిహద్దుల నుంచి భారత దేశంవైపు 50 కిలోమీటర్ల పరిధిలో సోదాలు నిర్వహించేందుకు, అనుమానితులను అరెస్టు చేసేందుకు, వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు అధికారం కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి లేకుండానే ఈ అధికారాలను వినియోగించవచ్చు. అంతకుముందు నిబంధనల ప్రకారం కేవలం 15 కిలోమీటర్ల పరిధిలోనే బీఎస్ఎఫ్‌కు అధికారం ఉండేది. 


దీనిపై మమత బెనర్జీ గతంలో స్పందిస్తూ, కేవలం సామాన్యులను వేధించడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ శాసన సభ ఈ నెల 16న ఓ తీర్మానాన్ని ఆమోదించింది. 


Updated Date - 2021-11-25T00:04:52+05:30 IST