పశ్చిమ బెంగాల్ : సామూహిక అత్యాచారం కేసుపై బీజేపీ నిజనిర్థరణ కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-04-13T17:45:06+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లోని హన్స్‌ఖలిలో పద్నాలుగేళ్ళ మైనర్

పశ్చిమ బెంగాల్ : సామూహిక అత్యాచారం కేసుపై బీజేపీ నిజనిర్థరణ కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లోని హన్స్‌ఖలిలో పద్నాలుగేళ్ళ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం, హత్యకు గురైనట్లు వచ్చిన ఆరోపణలపై వాస్తవాలను తెలుసుకునేందు ఐదుగురు సభ్యులతో నిజ నిర్థరణ కమిటీని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు టీఎంసీ నేత కుమారుడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  


బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 4న బాధితురాలు సామూహిక అత్యాచారానికి, హత్యకు గురయ్యారు. హడావుడిగా ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపించి, పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు టీఎంసీ నేత కుమారుడిని కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది. 


ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేసిన ప్రకటనలో, పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా, హన్స్‌ఖలీలో 14 ఏళ్ళ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై నిజాలను తెలుసుకునేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నియమించారు. ఈ నిజ నిర్థరణ కమిటీలో ఎంపీ రేఖ వర్మ, ఉత్తర ప్రదేశ్ మంత్రి బేబీ రాణి మౌర్య, తమిళనాడు ఎమ్మెల్యే, బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సంఘం ప్రత్యేక ఆహ్వానితురాలు ఖుష్బూ సుందర్, పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే శ్రీరూప మిత్ర చౌదరి ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ కమిటీ  తన నివేదికను సమర్పిస్తుంది. 


బాధితురాలు నిజంగా అత్యాచారానికి గురైందా? ప్రేమ వ్యవహారం వల్ల గర్భిణి అయిందా? అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ వ్యాఖ్యానించడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మమత బెనర్జీ సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘‘ఆమె అత్యాచారానికి గురైనట్లు మీకెలా తెలుసు? మరణ కారణాన్ని పోలీసులు ఇంకా తెలుసుకోవలసి ఉంది. వాళ్ళని నేను అడిగాను. ఆమె గర్భిణియా? ప్రేమ వ్యవహారం ఉందా? అనారోగ్యంతో ఉందా? అది ప్రేమ వ్యవహారమని కుటుంబానికి కూడా తెలుసు. ఓ జంట బాంధవ్యంలో ఉంటే, వాళ్ళని నేనెలా ఆపగలను?’’ అన్నారు. 


Updated Date - 2022-04-13T17:45:06+05:30 IST