కరోనాపై టీకాస్త్రం...

ABN , First Publish Date - 2021-01-17T05:50:36+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, వైద్య సిబ్బందికి టీకాలు వేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి 28,350 మంది ప్రభుత్వం నిర్ధేశించిన వ్యాక్సిన్‌ వెబ్‌సైట్లో పేర్లు నమోదు చేసుకున్నారు.

కరోనాపై టీకాస్త్రం...

భయాందోళనలకు తెరపడింది. వేలాది మంది వైద్య నిపుణుల అన్వేషణ ఫలించింది. కరోనాపై పైచేయి సాధించేందుకు టీకాస్త్రం పురుడు పోసుకుంది. ఈ వ్యాక్సిన్‌ను ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యనారాయణులకు తొలి ప్రాధాన్యంగా ఇవ్వాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి శనివారం తొలివిడత టీకా పడింది. జిల్లాలో తొలి టీకాను డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ మోహన్‌ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వేయించుకున్నారు. వాక్సిన్‌పై ఎలాంటి భయాందోళనలు, అపోహలు పెట్టుకోవద్దని.. తాను ఎంతో ఆరోగ్యంగా వున్నానని భరోసా కల్పించారు. ఈ రోజు ఆదివారం కావడంతో.. రేపటి నుంచి మరో నాలుగు రోజులపాటు మిగిలిన వైద్య సిబ్బందికి టీకా వేస్తారు. 


జిల్లావ్యాప్తంగా 23 కేంద్రాల ఏర్పాటు

రేపటి నుంచి 150 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌

28,350 మంది వైద్య సిబ్బంది గుర్తింపు

వ్యాక్సిన్‌ రాకతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు

అయినా కరోనా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్న వైద్యులు

వివాదాస్పదం.. టీకాలు వేసిన ఎమ్మెల్యే కారుమూరి, డీసీసీబీ చైర్మన్‌ కౌరుల తీరు

(ఏలూరు/ఏలూరు క్రైం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, వైద్య సిబ్బందికి టీకాలు వేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి 28,350 మంది ప్రభుత్వం నిర్ధేశించిన వ్యాక్సిన్‌ వెబ్‌సైట్లో పేర్లు నమోదు చేసుకున్నారు. తొలిరోజు 23 కేంద్రాల్లో 23 వందల మందికి వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు వ్యాక్సిన్‌ సిద్ధం చేయడమే కాకుండా ఆయా కేంద్రాల్లో తగిన సిబ్బందిని అప్రమత్తం చేశారు. కాని తొలిరోజు శనివారం జిల్లావ్యాప్తంగా 1150(40 శాతం) మంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. రకరకాల కారణాలతో 60శాతం మంది వెనుకంజ వేశారు. అత్యధికంగా కొవ్వూరు 101 మంది, ఆ తరువాత స్థానంలో పాలకొల్లులో 100, నిడదవోలు 100 మంది వ్యాక్సిన్‌కు సిద్ధపడ్డారు. మిగతా అన్నిచోట్ల అత్య ల్పంగానే వ్యాక్సిన్‌కు ముందుకు వచ్చారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్సీ ఆర్‌ఎస్‌ఆర్‌ మాస్టారు వ్యాక్సిన్‌ను ప్రారంభిం చారు. చింతలపూడిలో ఎమ్మెల్యే ఎలీజా, తణుకు, వేల్పూరులలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, నర్సాపురంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, సబ్‌ కలెక్టర్‌ విశ్వనాధ్‌, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసు వ్యాక్సిన్‌, ఆకివీడులో ఎమ్మెల్యే రామరాజు, గోపాల పురంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, భీమడోలులో ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు, ఆచంటలో మంత్రి శ్రీరంగ నాఽథరాజు, కొవ్వూరులో మంత్రి తానేటి వనిత, తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, దెందులూరు అబ్బయ్యచౌదరి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అధికారికంగా ఆరంభించారు. ఆయా కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు అన్నింటిని చేశారు. 


1. ఏలూరు   19

2. టైటస్‌నగర్‌ పీహెచ్‌సీ 44

3. గోపన్నపాలెం 55

4. దెందులూరు 27

5. భీమడోలు         50

6. చింతలపూడి 40

7. ఆకివీడు     30

8. భీమవరం      7

9. పాలకొల్లు     100

10. వేమవరం 89

11. ఆచంట      60

12. నర్సాపురం 60

13. కొవ్వూరు         101

14. దేవరపల్లి         49

15. గోపాలపురం 59

16. నందపురం 19

17. బుట్టాయిగూడెం 20

18. తాడేపల్లిగూడెం 47

19. తణుకు         54

20. వేల్పూరు     45

21. సమిశ్రగూడెం 35

22. నిడదవోలు 100

23. కలవలపల్లి 40


సంతోషంగా ఉంది :సీహెచ్‌ షర్మిల,ఫిజియోథెరపిస్టు, జిల్లా ఆసుపత్రి ఏలూరు 

కరోనా వ్యాక్సిన్‌ సురక్షిత మైనది. ఎలాంటి భయాం దోళనలు వద్దు. ఇది బీసీజీ వ్యాక్సిన్‌ లాంటిదే. దీనివల్ల దుష్ఫలితాలు వస్తాయ న్నది నిజం కాదు. వ్యాక్సిన్‌ ద్వారా కరోనా మరోసారి విజృంభించినా ఏ ఒక్కరూ దీని బారినపడరు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఈ వ్యాక్సిన్‌ను ముందుగానే చేయించుకోవడం సంతోషంగా ఉంది.


డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌కు తొలి వ్యాక్సిన్‌

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం : జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను దశల వారీగా అందరికీ అందిస్తామని దీని కోసం జిల్లాలో 150 సెంటర్లను కేటాయించామని తొలిసారిగా 23 సెంటర్లను ప్రారంభించామని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు అన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ఏలూరు ప్రభుత్వాసు పత్రిలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌  ప్రారం భించారు. ముందుగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగాలను తిలకించారు. అనంతరం ఉదయం 11.30 గంట లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. మొదట జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ముత్యాల రాజు మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను మొదటిగా వైద్య ఆరోగ్య సిబ్బందికి వేస్తున్నాం. 138 ప్రభు త్వాసుపత్రులు, 12 పీహెచ్‌సీ సెంటర్లలో 28,253 మంది హెల్త్‌ వర్కర్లకు ఇస్తున్నాం. ప్రస్తుతం 23 సెంటర్లను ఏర్పాటుచేశాం. వీటిని 150కు పెంచుతాం. రెండో దశలో 41,263 మంది పోలీ సు, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ అధికారులు, సిబ్బందికి వ్సాక్సినేషన్‌ ఉంటుంది. మూడో దశలో 50 ఏళ్లు దాటిన వృద్ధు లకు అందిస్తాం. 18 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులు, అస్వస్థతగా ఉన్న వారికి వ్యాక్సి నేషన్‌ ఉండదు. వ్యాక్సినేషన్‌ వేసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తాం. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే చికిత్స ఉంటుం ది. కొత్తరకం వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పుడు శరీరంలో కొన్ని మార్పులు సహజం. భయపడాల్సిన పనిలేదు. వ్యాక్సినేషన్‌ రియాక్షన్‌లను మూడు కేటగిరీలుగా మైనర్‌, మైల్డ్‌, సీనియర్‌గా విభజించాం. వీరికోసం పెద్దాసుప త్రుల్లో 20 పడకలు, చిన్న ఆసుపత్రుల్లో 10 పడకలు కేటాయించాం. ప్రత్యేక వైద్య బృందంతో కమిటీని ఏర్పాటు చేశామని మెరుగైన వైద్య సేవలందిస్తారన్నారు. ఏలూరు ప్రభుత్వా సుపత్రిలో 108 మందికి 19 మంది, టైటాస్‌ నగర్‌ పీహెచ్‌సీలో వంద మందికి గాను 43 మంది వేయించు కున్నారు. ఐదు రోజులపాటు ఈ వ్యాక్సిన్‌ ప్రక్రి య ఉంటుంది. ఇప్పుడు వేయించుకున్న వారికి రెండో డోసు వచ్చే నెల 14న మరోసారి టీకా వేయనున్నారు. డీఎంహెచ్‌వో సునంద, సీనియర్‌ వైద్యులు పోతుమూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  


 డాక్టర్లయిన అధికార పార్టీ నేతలు

తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, పాలకొల్లు డీసీసీబీ ఛైర్మన్‌ కౌరు శ్రీనివాస్‌ నేరుగా వ్యాక్సిన్‌ వేయడంతో వివాదాలకు తావిచ్చింది. సోషల్‌ మీడియాలో ఈ వ్యవహారం కాస్త క్షణాల్లో పాకిపోయింది. వాస్తవానికి వ్యాక్సిన్‌ వేసేందుకు కేవలం వైద్యులు గుర్తించిన స్టాఫ్‌నర్సు, ఏఎన్‌ ఎంలకు మాత్రమే ఈ పని పూర్తిచేయాలి. దీనికి విరుద్దంగా కారుమూరి, కౌరు వ్యాక్సిన్‌ ఇవ్వడం వివాదం ముదిరి పాకానపడేలా చేసింది. ఆకివీడులో తెలుగుదేశం ఎమ్మెల్యే అధికారులే స్వయంగా ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 






Updated Date - 2021-01-17T05:50:36+05:30 IST