టెస్ట్‌ల జాప్యాన్ని నివారిస్తాం

ABN , First Publish Date - 2021-04-22T05:44:12+05:30 IST

రాష్ట్రంలో మిగతా జిల్లాలకంటే మన వద్దే తక్కువ ఉండటానికి ప్రధాన కారణం ఏమిటంటే..

టెస్ట్‌ల జాప్యాన్ని నివారిస్తాం
సమీక్షిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్సీ నారాయణ నాయక్‌

నాలుగుచోట్ల ట్రూనాట్‌ మిషన్ల ఏర్పాటు 

11 ఆసుపత్రుల్లో 1,630 పడకలు ఏర్పాటు 

అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటుపై చర్యలు తప్పవు

టెన్త్‌ మినహా అన్ని పాఠశాలలు మూసేయాలి

అందరూ ఎస్‌ఎంఎస్‌ పాటించాల్సిందే

మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడే కేసులు తక్కువ

కొవిడ్‌పై కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ నాయక్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 21 : రాష్ట్రంలో మిగతా జిల్లాలకంటే మన వద్దే తక్కువ ఉండటానికి ప్రధాన కారణం ఏమిటంటే.. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధా రణ అయిన వ్యక్తికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను అదే రోజు గుర్తిస్తున్నాం. వారి నుంచి స్వాబ్‌లను సేకరించి సాయంత్రం ఆరు గంటలకల్లా ల్యాబ్‌ టెస్ట్‌ లు చేయిస్తున్నాం. ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటున్నాం. అందుకే మన వద్ద కేసులు తక్కువగా ఉంటున్నాయి’ అని జిల్లా కలెక్టర్‌ కార్తి కేయ మిశ్రా అన్నారు. జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలపై బుధవా రం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘శాంపిల్స్‌ను ఏలూరు ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌కు తరలించడంలో వున్న జాప్యాన్ని నివారించేందుకు కనీసం నాలుగు ప్రాంతాల్లో స్థానికంగానే ట్రూనాట్‌ మిషన్లను ఏర్పాటు చేయనున్నాం. టెస్టుల సమయాన్ని తగ్గిస్తాం. జిల్లాలో గత ఏడాది రోజుకు గరిష్టంగా 7,749 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశాం. ఈ ఏడాది ఇప్పటి వరకు రోజుకు మూడు వేల 500 టెస్టులు చేస్తున్నాం. జిల్లాలోని ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌కు టెస్ట్‌లు చేసే సామర్థ్యం రోజుకు ఆరు వేల వరకు ఉంది. దీనిని ఎనిమిది వేలకు పెంచడంతోపాటు మరో ఆర్టీపీసీఆర్‌ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నాం. జిల్లాలో పాజిటివిటి రేటు పెరిగితే టెస్టుల సంఖ్య పెంచుతాం’ అని వివరించారు. 


660 యాక్టివ్‌ కేసులు

జిల్లాలో ప్రస్తుతం 660 యాక్టివ్‌ కేసులు ఉండగా, వీటిలో 435 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. మరో 225 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 104 మంది ఐసీయూ లోను, 10 మంది ఆక్సిజన్‌ సపోర్టుతో వైద్యం పొందుతున్నారు. కొవిడ్‌ చికిత్స కోసం జిల్లాలో ఆరు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు ఆసుపత్రులను ప్రత్యేకంగా ఏర్పా టుచేశాం. వీటిలో 1,630 పడకలను సిద్ధం చేశాం. గత ఏడాది మాదిరి పడ కల సంఖ్యను 2 వేల 500లకు  పెంచుతున్నాం. 248 వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాం. వీటిని పెంచనున్నాం. ఇప్పటికే భీమవరం, తాడేపల్లిగూడెంలలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్లతోపాటు మరో రెండు ప్రారంభిస్తున్నాం. వీటిల్లో సేవలందించేందుకు 756 మంది వైద్య సిబ్బందిని నియమిస్తున్నాం. 


నేడు రెండో డోసు

జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు లక్షల మందికి తొలి, రెండో డోసు వ్యాక్సిన్‌ ఇచ్చాం. ఆ ప్రకారం ఈ ఏడాది మార్చి 8వ తేదీ వరకు వ్యాక్సిన్‌ తొలి డోసు వేయించుకున్న 36 వేల మందికి పైగా వున్న వారికి రెండో డోసు గురువారం ఇస్తారు. రెండో డోసు కోసం మండల, మునిసిపల్‌ ప్రాంతాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి వ్యాక్సిన్‌ వేయించుకునే వారికి ఫోన్‌లు చేస్తున్నాం. వ్యాక్సినేషన్‌లో గ్రామ/వార్డు వాలంటీర్లు సహకరిస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ప్యాకేజీ కింద నిర్దేశించిన ఫీజులకంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను ఆసరాగా తీసుకుని వ్యాపారులు ఎవరైనా నిత్యావసర సరుకుల బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడినా, ధరలు పెంచినా చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఈ నెల 20వ తేదీ చివరి పనిదినంగా రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఆ మేరకు గురువారం నుంచి అన్ని యాజమాన్యాల పాఠ శాలలు మూసివేయాలి. పదో తరగతికి మాత్రం పరీక్షలయ్యే వరకు మినహా యింపు ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఏ పాఠశాలనైనా తెరిస్తే చర్యలు తీసుకునే అధికారాలు డీఈవో, జిల్లా ఎస్పీలకు ఉంటుంది. 


ఎస్‌ఎంఎస్‌ పాటించాల్సిందే  : ఎస్పీ నాయక్‌

ప్రతీ ఒక్కరూ సోషల్‌ డిస్టెన్స్‌, మాస్క్‌, శానిటైజేషన్‌(ఎస్‌ఎంఎస్‌) నిబంధ నను పాటించాల్సిందేనని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ స్పష్టం చేశారు. మాస్క్‌ ధరించకపోతే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా రూ.100 అప రాధ రుసుం విధిస్తారని హెచ్చరించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం (ఎన్‌డీఎంఏ) ప్రకారం కేసులు నమోదు చేస్తారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు సహా అన్నిచోట్ల అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.


Updated Date - 2021-04-22T05:44:12+05:30 IST