‘నాసా’లో సత్తా చాటిన తెలుగమ్మాయ్‌

ABN , First Publish Date - 2021-12-27T14:13:29+05:30 IST

చిన్నప్పుడు గోరుముద్దలు పెడుతూ.. అమ్మమ్మ చెప్పిన కథలతో స్ఫూర్తి పొందిన ఆ యువతి.. అంతరిక్షం, ప్రయోగాలు వంటి వాటిపై ఆసక్తి పెంచుకుంది. ఈ ఆసక్తే తర్వాత కాలంలో ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చింది. నాసా చేపట్టిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌..

‘నాసా’లో సత్తా చాటిన తెలుగమ్మాయ్‌

చరిత్ర సృష్టించిన పాలకొల్లు యువతి

ఐఏఎస్ పీలో కీలక శిక్షణ, ప్రయోగాలు

విజయవంతంగా పూర్తి చేసిన జాహ్నవి

తొలి భారతీయ యువతిగా గుర్తింపు

విశాఖపట్నం/పాలకొల్లు అర్బన్‌, , డిసెంబరు 26: చిన్నప్పుడు గోరుముద్దలు పెడుతూ.. అమ్మమ్మ చెప్పిన కథలతో స్ఫూర్తి పొందిన ఆ యువతి.. అంతరిక్షం, ప్రయోగాలు వంటి వాటిపై ఆసక్తి పెంచుకుంది. ఈ ఆసక్తే తర్వాత కాలంలో ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చింది. నాసా చేపట్టిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాం(ఐఏఎ్‌సపీ)లో శిక్షణకు, ప్రయోగాలకు హాజరయ్యేలా చేసింది. అమెరికాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లో చేపట్టిన కార్యక్రమంలో తనకు అప్పగించిన బాధ్యతలను, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఆమే పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన దాంగేటి జాహ్నవి. మన దేశం నుంచి ఐఏఎ్‌సపీ కోసం పనిచేసిన తొలి భారతీయ యువతిగా రికార్డు సృష్టించింది. ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల జాహ్నవి.. ఐఏఎ్‌సపీ శిక్షణ, ప్రయోగ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా నాసా ఎంపిక చేసిన 20 మంది ఔత్సాహిక వ్యక్తుల్లో మన దేశం నుంచి ఎంపికై రికార్డు సొంతం చేసుకుంది. 



ఇటీవలే తన శిక్షణను, బాధ్యతలను విజయవంతంగా ఆమె పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. అంగారకుడిపై అడుగు పెట్టే తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించడమే తన కలగా పేర్కొంది. ఈ సమయంలో టీమ్‌ కెన్నడీకి మిషన్‌ డైరెక్టర్‌గా జాహ్నవి నియమితురాలైంది. వివిధ దేశాలకు చెందిన 16 మంది జట్టుకు ఈమె నేతృత్వం వహించడం గమనార్హం. ఈ బృందం చిన్నతరహా రాకెట్లను కూడా ప్రయోగించింది. జాహ్నవి ప్రస్తుతం పంజాబ్‌లోని ప్రైవేటు యూనివర్సిటీలో ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. జాహ్నవి గతంలోనూ నాసాతో కలిసి పనిచేసింది. కూపర్‌ బెల్ట్‌లో గ్రహ శకలాల పరిశోధనలో ఆమె పాలుపంచుకుంది. కాగా, జాహ్నవిని పాలకొల్లులో స్థానికులు ఘనంగా సన్మానించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన జాహ్నవి తన ప్రతిభతో ఈ స్థానానికి చేరుకోవడం అభినందనీయమని పలువురు కొనియాడారు. స్థానిక రాహుల్‌ వృద్ధుల ఆశ్రమంలో సత్కార సభ జరిగింది.




Updated Date - 2021-12-27T14:13:29+05:30 IST