లోకల్‌ హై‘టెన్షన్‌’

ABN , First Publish Date - 2021-01-24T05:24:44+05:30 IST

పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది.. కాని గండాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయకపోగా జిల్లా యంత్రాంగం కూడా సోమవారం వరకూ ఒకింత ముఖం చాటేసే పద్ధతే అనుసరి స్తోంది.

లోకల్‌ హై‘టెన్షన్‌’

పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ 

 అయినా ముందుకు కదలని యంత్రాంగం

 ఎన్నికలు నిర్వహించే వారే ఇప్పటికీ సైలెంట్‌

 వీడియో కాన్ఫరెన్సుకు కలెక్టర్‌, ఎస్పీలు దూరం 

 మిగతా అధికారులదీ ఇదే తీరు 

 అన్ని పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ

 సోమవారం వరకూ అంతా సస్పెన్సే

 రంగం సిద్ధం చేసుకుంటున్న ప్రధాన పక్షాలు 

 తొలి విడతలో ఏలూరు రెవెన్యూ డివిజన్‌

 337 పంచాయతీలు, 3,580 వార్డులకు ఎన్నికలు 


పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది.. కాని గండాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయకపోగా జిల్లా యంత్రాంగం కూడా సోమవారం వరకూ ఒకింత ముఖం చాటేసే పద్ధతే అనుసరి స్తోంది. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్‌ జారీ అయింది. దీనికి అనుగుణంగానే ఈనెల 25 నుంచి నామినేషన్‌ ప్రక్రియ ఆరంభించాల్సి ఉంది. కానీ ప్రత్యేకించి ఈ ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఏవీ నేరుగా వెల్లడించకపోగా శనివారం జరిగిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్సుకు కూడా జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు దూరంగా ఉండిపోయారు. దీంతో సోమవారం సుప్రీం కోర్టు నిర్ణయాన్ని బట్టి ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. 

(ఏలూరు– ఆంధ్రజ్యోతి )

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్‌ వెలువడే నాటికి అన్ని పార్టీలు పోరుకు సిద్ధపడతాయి. నువ్వానేనా అన్నట్లుగా తలపడతాయి. అంతకంటే మించి ఓటర్లును ఆకట్టుకునేందుకు సరైన అభ్యర్థి కోసం అన్వేషించి చివరి క్షణంలోనూ అభ్యర్థుల ముఖాలను తారుమారు చేసి మరీ బరిలోకి దించుతారు. కానీ ఇప్పుడు సీన్‌ అంతా రివర్స్‌.  రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని దానికి సంసిద్ధంగా ఉండాల్సిందిగా కోరడమే కాకుండా నోటిఫికేషన్‌ విడుదల, షెడ్యూల్‌ ఖరారుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వచ్చింది. అయితే ఈ ప్రక్రియకు కరోనా వ్యాక్సిన్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం మోకా లొడ్డు తున్నది. దీనికి సమాంతరంగా ఉద్యోగ వర్గాలు కూడా ఎన్నికలకు ససేమిరా అంటున్నాయి. పోరు జరగా ల్సింది గ్రామ స్థాయిలో అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అసలు సిసలు పోరు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల  సంఘం మధ్యనే జరుగుతున్నది. దీంతో అందరిలోనూ తీవ్ర అలజడి, గందరగోళం నెలకొంది. వాస్తవానికి తొలి విడత ఎన్నికలు జరిగేందుకు శనివారం నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని ప్రకారం ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో 337 గ్రామ పంచాయతీల్లో, మరో 3580 పంచాయతీ వార్డుల్లోనూ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనికి గాను తొలి  విడతలో 15,141 ఎస్టీ ఓటర్లు, 2,28,512 ఎస్సీ ఓటర్లు, బీసీ ఓటర్లు మరో 3,45,934 ఇంకా 2,46,582 మంది ఇతర ఓటర్లు అంతా కలిపి 8,36,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోవాల్సి ఉంది. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కాని ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వచ్చే సోమవారం రాష్ట్ర ప్రభుత్వ వాదనలపై సుప్రీం విచారించనుంది. దీనికి సంబంధించి ముందుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియమావళిని పాటించాలా వద్దా అనే దానిపై ఇప్పుడు అధికార వర్గాల్లో సరికొత్త సస్పెన్స్‌ మిగిల్చింది. అందుకనే ఎవరంతటికి వారుగా పట్టుదలను వీడకుండా పోరును సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించగా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిన కలెక్టర్‌ ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్‌ దీనికి దూరంగా మిగిలారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనే పాటించేందుకు జిల్లా యంత్రాంగం సానుకూల దృక్ఫథంతో ఉండడం దీనికి కారణం. మరోవైపు న్యాయపరమైన అంశాలు  తేలాల్సి ఉండడం మరో కారణం. వీటన్నింటికి తోడు తొలి విడతగా నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ఆరంభం కావాల్సి ఉంది. వీటికి ఎక్కడెక్కడ స్వీకరించాలి, బాధ్యత కల్గిన అధికారులెవరు, వారికి సహకరించే సిబ్బంది ఎవరు అనే అంశాలు ఏవీ వెల్లడిం చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధపడలేదు.  ప్రత్యేకించి పంచాయతీ వ్యవహారాలను చూసే అధికారులు శనివారం మౌనం పాటించారు. ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఏవీ బహిర్గతం చేసేందుకు వీరెవరు సిద్ధపడలేదు. 


ప్రధాన పక్షాల్లో ఉత్కంఠ  

ఇప్పటికే అధికార వైసీపీ దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌ అభ్యర్థులు ఎంపిక పూర్తి చేసి సిద్ధంగా ఉన్నా ఎన్నికలు విషయంలో మాత్రం ఇప్పుడు సాధ్యంకాదు మరికొద్ది నెలల తరువాత మాత్రమే జరపా లని పట్టుబడుతున్నారు. తెలుగుదేశం, వామపక్షాలు, బీజేపీ, జనసేన వంటి  పార్టీలు మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాల మధ్య పరస్పర ప్రతిష్టాత్మక సవాల్‌ నడుస్తుండడంతో ఇప్పుడు పార్టీలన్నీ గందరగోళంలో పడ్డాయి. ‘ఎట్టి పరిస్థితు ల్లోనూ సర్పంచ్‌, వార్డు పదవులకు పార్టీల పరంగా అభ్యర్థులను ఎంపిక చేసి వారిని బరిలో దించాలి. ఎక్కడా రాజీ పడొద్దు. అంతకంటే అధికార పక్షాన్ని చూసి భయపడవద్దు. పోటీకి దిగితే అసలు రంగు ఏమిటో బయటపడుతుంది. జాగ్రత్తగా ఎక్కడికక్కడ పరస్పర సహకారం, చొరవతో పంచాయతీ ఎన్నికల సమరంలో కీలకంగా వ్యవహరించండి’ అంటూ టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నేరుగా ఆదేశాలు జారీ చేశారు. బీజేపీలో మాత్రం ఇప్పటికీ సందిగ్దత పోలేదు. ఒకవైపు మిత్ర పక్షమైన జనసేనను కలుపుకు పోయేందుకు ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు. దీంతో ఆ పార్టీ నేతలు స్థానికంగా ఉన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పొత్తుకు సిద్ధపడుతున్నారు. 


కోడ్‌ కూసింది..

నల్లజర్ల, జనవరి 23 : ఎన్నికల కోడ్‌ రావడంతో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను స్వచ్ఛందంగా తొలగింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం 10 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో కొంత మంది అభిమానులు తమ నేతల కోసం కట్టిన ఫ్లెక్సీలను తామే తీసి భధ్రపర్చుకుంటున్నారు.




Updated Date - 2021-01-24T05:24:44+05:30 IST