లోలోన జగడాలు

ABN , First Publish Date - 2020-11-28T05:30:00+05:30 IST

నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో అధికారపక్ష..

లోలోన జగడాలు

ఫ్యాన్‌ కింద ఉక్కబోత

నరసాపురం లోక్‌సభ వైౖసీపీలో గందరగోళం

పార్టీకి, ఎమ్మెల్యేల మధ్య కొంచెం దూరం

జిల్లా కేంద్రం విషయంలోనూ ఇదే తంతు

ఎవరి దారి వారిదే.. ఉండిలో చక్కబెట్టే ప్రయత్నం

కనిపించని అధ్యక్షుడు రంగరాజు  


(ఏలూరు–ఆంధ్రజ్యోతి): నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో అధికారపక్ష ఎమ్మెల్యేల మధ్య కొన్ని అంశాలపై పొసగడం లేదా ? వాటిపై ఏకగ్రీవ నిర్ణయాలకు రాలేకపోతున్నారా? ఎవరంతట వారుగా వ్యవహరిస్తున్నారా..? చక్కదిద్దాల్సిన పార్టీ నాయకత్వం సైలెంట్‌ అయిపోయిందా? ఈ ప్రశ్నలకు వైసీపీలో కొందరు అవుననే అంటున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో నేతల మధ్య అప్పుడప్పుడు లోలోన జగడాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు అయితే జిల్లా కేంద్రం ఎక్కడుండాలనే దానిపై పార్టీ నేతలు, ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కనిపించడం లేదు. దీనికి తగ్గట్టుగానే పార్టీ వ్యవహారాలు పదేపదే జిల్లా ఇన్‌చార్జ్‌ దృష్టికి వెళ్లడం, కొంతలో కొంత సర్దుబాటు చేసే ప్రయత్నాలు కొనసాగడం ఇప్పుడు వైసీపీలో నెలకొన్న వైచిత్రి.


అధికార పగ్గాలు చేపట్టిన ఏడాదిన్నర తర్వాత వివిధ అంశాల్లో ఎమ్మెల్యేల మధ్య పోటీ తగ్గలేదు. సయోధ్య కుదరడం లేదు. అందరినీ ఏకం చేసి ముందుకు నడిపించాల్సిన పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ నాయకత్వం కొన్నిసార్లు సైలెంట్‌ అవుతోంది. కీలక అంశాలు తెర ముందుకు వచ్చిన తరుణంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక కేడర్‌ మధ్య పూర్తి ఏకాభిప్రాయం కుదర్చడం, సర్ధుబాటు చేయడంలోనూ నాయకత్వం వెనుకంజలో ఉంది. ఇదే తరుణంలో జిల్లా కేంద్రం ఒకచోట ఉండాలని, కాదు కాదు మరో చోట ఉండాలని పదే పదే వాదనలు సాగడం పార్టీలో కొందరిని తికమక పెడుతున్నాయి. వాస్తవానికి నరసాపురం లోక్‌సభ సభ్యుడు కనుమూరి రఘు రామకృష్ణంరాజు దాదాపు పార్టీతో చాన్నాళ్ల క్రితమే విభేదించారు. తగ్గట్టుగానే ఆయన వ్యవహార శైలి కొనసాగుతోంది. ఇదే తరుణంలో ఆయనకు దీటుగా అదే సామాజికవర్గానికి చెందిన వారిని ప్రోత్సహించే దిశగా వైసీపీ అడుగులు వేసింది. నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా గోకరాజు రంగరాజును నియమించింది. ఎంపీ రఘురామకు చెక్‌ పెట్టేందుకే పార్టీ ఈ విధమైన నిర్ణయం తీసుకుందని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష హోదాలో రంగరాజు కనీస వేగంతో దూసుకెళ్లలేకపోయారని పార్టీ వర్గాల్లో ఒకింత అసంతృప్తి లేకపోలేదు. పొరుగున ఉన్న ఏలూరు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుబాబు పార్టీ కార్యక్రమాలు, అధికార కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. కేడర్‌కు దాదాపు దగ్గరయ్యే ప్రయత్నం కొనసాగిస్తున్నారు.


అదే నరసాపురం పరిధిలో పార్టీ ఈ స్థాయిలో దూసుకెళ్లలేకపోయిందనేదే కొందరి వాదన. ఆచంట నియో జకవర్గంలో మంత్రి రంగనాథరాజుకు వ్యతిరేకంగా ఇంటి స్థలాల విషయంలో కొందరు బజారుకు ఎక్కుతున్నా, ఇంకొందరు పార్టీ  పరువును తీసే విధంగా ప్రకటనలు చేస్తున్నా దీటుగా జవాబు ఇవ్వాల్సిన పార్లమెంటరీ నాయకత్వం అప్పట్లోను పట్టనట్టు వ్యవహరించిందన్న ఆగ్రహంతోనూ ఇంకొందరు ఉన్నట్టు చెబుతున్నారు. నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎంపీగా వ్యవ హరించి తనకుంటూ ఒక ప్రత్యేకత దక్కించుకోవడంలో గోకరాజు గంగరాజు ముందుకు వెళ్లారు. ఆయన తనయుడు రంగరాజుని ప్రత్యేకించి రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలక పాత్ర లేకపోయినా అప్పట్లో రాజకీయ కోణంలోనే ఆలోచించి పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. దీని వెనుక సీఎం జగన్‌ ఆశీస్సులు ఉన్నట్టు ప్రచారం సాగింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా నాయకులతో తరచూ ఫోన్‌ ద్వారా సంప్రదిస్తూనే ఉన్నా రంగరాజు క్షేత్రస్థాయికి వెళ్లలేక వెనుకబడ్డారనేది కొందరి వాదన. 


ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెరముందుకు వచ్చింది. నరసాపురం దాదాపు కొత్త జిల్లాగా ప్రభుత్వం ప్రతిపాదించి ఆ మేరకే అధికారిక ప్రక్రియ ఆరంభానికి ముందే సదుపాయాల కల్పన, ఇతరత్రా అంశాలను నివేదిక రూపంలో అందించాల్సిందిగా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ అంశం అలా నలుగుతుండగానే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ భీమవరాన్నే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పట్టు పడుతున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అంతటితో సరిపెట్టకుండా తన వాదనకు అనుకూలంగా స్థానిక నాయకత్వంతోపాటు మిగతా అన్ని వర్గాలను కూడకట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఒకేపార్టీలో ఉండి పొరుగు ఎమ్మెల్యే ఆశిస్తున్న దానికి భిన్నంగా ఇంకొకరు ఎలా కొత్త వాదనకు లేవదీస్తున్నారనే ప్రశ్న వైసీపీలో వినిపిస్తోంది. మొదటి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు కేడర్‌ మధ్య ఇలాంటి వివాదాలు చెలరేగినప్పుడు సయోధ్యకు ప్రయత్నించాల్సిన పార్టీ ఆ మేరకు చొరవ తీసుకోకపోగా సైలెంట్‌ కావడం ఇప్పుడు జిల్లా వ్యవహారం కాస్తా ముదురుపాకాన పడినట్టయింది. 


ఉండిలో పార్టీకి మరమ్మతులు

ఉండి నియోజకవర్గ పార్టీకి పీవీఎల్‌ నరసింహరాజు కన్వీనర్‌గా వ్యవహరిస్తు న్నారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన ఆయన పార్టీ పగ్గాలను అందుకుని నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. కొంత కాలం ఇలా కొనసాగు తూనే వచ్చింది. కరోనా సమయంలో మాజీ ఎమ్మెల్యే సర్రాజు, పీవీఎల్‌ అను చరుల మధ్య కొంత అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. తమను కలుపుకు పోవడం లేదని కొందరు ఆక్రోశపడగా అలాంటిదేమీ లేదని నియోజకవర్గం యావత్తు ఉమ్మడిగా పార్టీ కోసం పనిచేయాల్సిందేనని పీవీఎల్‌ చెబుతూ వచ్చారు. కొన్నాళ్ల క్రితం జిల్లా ఇన్‌చార్జ్‌ సుబ్బారెడ్డి, పీవీఎల్‌ను కూడబెట్టుకుని సీఎం జగన్‌తో భేటీకాగా ఉండిలో నెలకొన్న తాజా పరిస్థితులు వీరి మధ్య చర్చ జరిగింది.


ఎన్నికల్లో ఓటమి పొందినా, ఆర్థికంగా నష్టపోయినా పార్టీనే నమ్ముకుని వ్యవహరిస్తున్న ఆయనకు నియోజకవర్గంలో కొందరు పరోక్షంగా అడ్డు తగలడం ఏమిటని అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఇక ముందు ఆయనకు ఎవరడ్డుపడినా కఠినంగానే ఉండాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. జగన్‌ పాదయాత్ర పూర్తయి మూడేళ్లు అయిన సందర్భంగా జిల్లావ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు పెద్దఎత్తున నియోజక వర్గాల్లో పాదయాత్రలు చేశారు. ఒకరిద్దరు పీవీఎల్‌ను కాదని ఉండిలో పాద యాత్రకు దిగడం కొంత వివాదం రేగింది. ఇప్పుడు వైసీపీ అధిష్టానం పీవీఎల్‌ వైపు పూర్తిగా మొగ్గు చూపడం కొత్త పరిణామంగా భావిస్తున్నారు.  


Updated Date - 2020-11-28T05:30:00+05:30 IST