India Vs Westindies : ఈ రోజు మ్యాచ్ గెలిచేదెవరు?.. మ్యాచ్ ప్రివ్యూ ఇదీ..

ABN , First Publish Date - 2022-08-07T00:22:02+05:30 IST

సిరీస్‌ని చేజిక్కించుకోవాలని భారత్ (India).. మ్యాచ్ గెలిచి సిరీస్ రేసులో నిలవాలని వెస్టిండీస్(Westindies).. ఇరుజట్లూ నాలుగో టీ20 మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాయి.

India Vs Westindies : ఈ రోజు మ్యాచ్ గెలిచేదెవరు?.. మ్యాచ్ ప్రివ్యూ ఇదీ..

ఫ్లోరిడా : సిరీస్‌ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో భారత్ (India).. మ్యాచ్ గెలిచి సిరీస్ రేసులో నిలవాలనే కసితో వెస్టిండీస్(Westindies).. ఇరుజట్లూ నాలుగో టీ20 మ్యాచ్‌కు(T20 Match) సన్నద్ధమయ్యాయి. అమెరికా(USA)లోని ఫ్లోరిడా(Florida) ‘సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్’ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. మైదానం చిన్నగా ఉండడంతో అక్కడి ప్రవాస భారతీయ క్రికెట్ అభిమానులను అలరించనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్  ఆరంభమవనుంది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి..


ఆస్ట్రేలియా(Australia)లో జరగబోతున్న టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup)కు ఆటగాళ్ల ప్రకటనకు ముందు ప్రస్తుత సిరీస్‌లో మిగిలిన 2 మ్యాచ్‌లు ఎంతో కీలకమైనవి. ముఖ్యంగా అర్షదీప్ సింగ్, ఆర్ అశ్విన్‌లకు ఈ మ్యాచ్‌లు అగ్నిపరీక్షగానే భావించాలని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. చిన్న మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లలో వీరిద్దరూ రాణించాల్సి ఉంటుందంటున్నారు.


ఇక ఈ మ్యాచ్‌లో దీపక్ హూడాకి చోటు దక్కుతుందో లేదో చెప్పడం కష్టమే. ఎందుకంటే ఆటగాళ్లందరూ అందుబాటులో ఉంటే తుది జట్టులో స్థానం సంక్లిష్టమవ్వొచ్చు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ గత మ్యాచ్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన నేపథ్యంలో అతడి ఫిటి‌నెస్‌ కలవరపరుస్తోంది. పూర్తి ఫిట్‌నెస్ ఉంటేనే ఈ మ్యాచ్ ఆడే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టన నాటి నుంచి ఆడిన మ్యాచ్‌ల కంటే విశ్రాంతి తీసుకున్న మ్యాచ్‌లే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్ కప్‌కు ముందు ఈ పరిణామం సెలక్టర్లను భయపెడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విభాగానికి వస్తే.. సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆవేశ్ ఖాన్ స్థానంలో హర్షల్ పటేల్ తీసుకునే అవకాశం ఉంది. 


ఇండియా జట్టు అంచనా : 1.రోహిత్ శర్మ(కెప్టెన్), 2.సూర్యకుమార్ యాదవ్, 3.శ్రేయస్ అయ్యర్, 4. రిషబ్ పంత్(వికెట్ కీపర్), 5. హార్దిక్ పాండ్యా, 6.దినేష్ కార్తీక్, 7.రవీంద్ర జడేజా, 8.హర్షల్ పటేల్, 9.ఆర్ అశ్విన్, 10.యజువేంద్ర చహాల్, 11.అర్షదీప్ సింగ్.


వెస్టిండీస్ జట్టులో ఒక్క మార్పుకు ఛాన్స్..

వెస్టిండీస్ జట్టు కూర్పు విషయానికి వస్తే.. బ్యాటింగ్ ఆల్ రౌండర్ ఓడియన్ స్మిత్ స్థానంలో డొమినిక్ డ్రేక్స్ ఆడే అవకాశం ఉంది. అయితే కెప్టెన్ పూరన్ కీపింగ్ చేస్తే వికెట్ కీపర్ డెవోన్ థామస్ స్థానంలో స్మిత్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక వెస్టిండీస్ జట్టు కూడా టీ20 వరల్డ్ కప్‌కు ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేయాలనుకుంటోంది. అయితే ప్రస్తుత సిరీస్‌లో ఆడుతున్న ఆటగాళ్లనే కాకుండా ఆండ్రూ రస్సెల్స్, సునీల్ నరైన్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు క్రికెట్ నిపుణులు. టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి వెస్టిండీస్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.


వెస్టిండీస్ జట్టు అంచనా : 1. కైల్ మయర్స్, 2.బ్రండన్ కింగ్, 3. నికోలస్ పూరన్(కెప్టెన్), 4.షిమ్రోన్ హెట్మేయర్, 5. రోవ్‌మ్యాన్ పావెల్, 6.డెవొన్ థామస్(వికెట్ కీపర్), 7. జసన్ హోల్డర్, 8.అకీల్ హోసిన్, 9.డొమినిక్ డ్రేక్స్, 10.అల్జార్రీ జోసెఫ్, 11.ఒబెడ్ మెక్‌కే.


పిచ్ రిపోర్ట్..

ఈ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కువగా జరగకపోవడంతో పిచ్‌ను అంచనా వేయడం సంక్లిష్టం. అయితే బౌండరీలు చిన్నగా ఉన్నాయి. షాట్లు ఆడితే సిక్సర్లు ఎక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-08-07T00:22:02+05:30 IST