West Indies vs India: తొలి టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్.. పగ్గాలు చేపట్టిన రోహిత్

ABN , First Publish Date - 2022-07-30T01:21:15+05:30 IST

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి భారత్‌కు

West Indies vs India: తొలి టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్.. పగ్గాలు చేపట్టిన రోహిత్

ట్రినిడాడ్: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. విండీస్‌తో ఇప్పటికే జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ20ల్లోనూ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. వన్డే సిరీస్‌కు అందుబాటులో లేని రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చి పగ్గాలు చేపట్టాడు. యువ ఆటగాళ్లతో కూడిన ద్వితీయ శ్రేణి జట్టునే ఎదుర్కోలేకపోయిన విండీస్.. ఇప్పుడు పూర్తిస్థాయి జట్టును ఎలా ఎదుర్కొంటుందన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు, ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్న భారత జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ ఉంది. దీంతో బెర్త్ ఆశించే ఆటగాళ్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది.


మరోవైపు, వన్డే సిరీస్‌లో ఎదురైన దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని విండీస్ గట్టి పట్టుదలగా ఉంది. హార్డ్ హిట్టర్లు ఉన్న కరీబియన్ జట్టు వన్డే పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. కెప్టెన్ పూరన్, కింగ్, మేయర్స్, పావెల్ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక హోల్డర్ ఆ జట్టుకు అదనపు బలం. 


ఇక, కరోనాతో కేఎల్ రాహుల్ దూరం కావడంతో రోహిత్ శర్మతో కలిసి రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు మిడిల్‌లో సత్తా చాటనుండగా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజాలు చివర్లో బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిబిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్షదీప్ సింగ్‌లో బౌలింగుతో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తే భారత్ విజయం నల్లేరు మీద నడకే అవుతుంది.

Updated Date - 2022-07-30T01:21:15+05:30 IST