మాలో మాకే పడదు..

ABN , First Publish Date - 2022-07-02T06:16:10+05:30 IST

‘మా పార్టీలో మాలో మాకే పడదు.. ఈర్ష్య ఎక్కువ. ఆక్వా రైతులకు సబ్సిడీ ఎత్తివేసే విషయంలో నేను ముఖ్యమంత్రికి ఏదో చెప్పానని నరసాపురం, ఉండి నియోజకవర్గాల్లో నాపై దృష్ప్రచారం చేశారు’.. అంటూ సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాలో మాకే పడదు..
కార్యకర్తలు వెళ్లిపోవడంతో ఖాళీ అయిన కుర్చీలు

చిల్లర రాజకీయాలు మానుకోండి..
సొంత పార్టీ నేతలపై చెరుకువాడ ఆగ్రహం

కాళ్ళ, జూలై 1 : ‘మా పార్టీలో మాలో మాకే పడదు.. ఈర్ష్య ఎక్కువ. ఆక్వా రైతులకు సబ్సిడీ ఎత్తివేసే విషయంలో నేను ముఖ్యమంత్రికి ఏదో చెప్పానని నరసాపురం, ఉండి నియోజకవర్గాల్లో నాపై దృష్ప్రచారం చేశారు’.. అంటూ సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాళ్ళ మండలం పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్‌ హాలులో శుక్రవారం వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన చెరుకువాడ మాట్లాడుతూ ‘ నేను ఏ నియోజకవర్గం రాజకీయాల్లో తలదూర్చను.. అయినా నాపై కక్ష సాధింపు చర్యగా ఆక్వా రైతుల వద్ద తక్కువ చేసి మాట్లాడిన విషయాలు నాకు తెలుసు. ఇదే ఆక్వా సబ్సిడీ విషయంపై ఐదెకరాల నుంచి పది ఎకరాల వరకు పెంచాలని గణపవరం సభలో ఎమ్మెల్యే వాసుబాబు ద్వారా ముఖ్యమంత్రికి చెప్పిన విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. సొంతపార్టీలోని కొందరు ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి’ అంటూ హితవు పలికారు.
ఖాళీ కుర్చీలు దర్శనం
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరరావు, జడ్పీ చైర్మన్‌ కౌరు శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కొట్టు, కారుమూరి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్న సమయంలో వేదిక ముందున్న కార్యకర్తలు లేచి బయటికి వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అసలే సభకు పూర్తిస్థాయిలో జనం రాకపోవడంతో ఫంక్షన్‌ హాలు వెలవెలపోయింది.

Updated Date - 2022-07-02T06:16:10+05:30 IST