అక్కడ సెల్‌ఫోన్, టీవీ నిషేధం.. కారణమిదే!

ABN , First Publish Date - 2022-06-05T14:57:13+05:30 IST

ప్రస్తుతం డిజిటల్‌ యుగం నడుస్తోంది. డిజిటల్...

అక్కడ సెల్‌ఫోన్, టీవీ నిషేధం.. కారణమిదే!

ప్రస్తుతం డిజిటల్‌ యుగం నడుస్తోంది. డిజిటల్ మీడియాపై అందరూ ఆధారపడుతున్న రోజులివి. స్మార్ట్‌ఫోన్ మనిషికి అత్యంత కీలకమైన వస్తువుగా మారింది. ఇటువంటి కాలంలో మొబైల్ ఫోన్లు, టీవీలు అస్సలు వినియోగించని ఒక ప్రాంతం ఉందని తెలిస్తే మీరు నమ్ముతారా? అవును.. అది అమెరికాలోని గ్రీన్ బ్యాంక్. ఈ నగరం వెస్ట్ వర్జీనియాలోని పోకాహోంటాస్‌లో ఉంది. ఇక్కడ సుమారు 150 మంది నివసిస్తున్నారు. వీరిలో ఎవరికీ టీవీలు, మొబైల్ ఫోన్లు లేవు. 


గ్రీన్ బ్యాంక్ సిటీలో ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు. ఈ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఉంది. దీనిని గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ అని కూడా అంటారు. ఈ టెలిస్కోప్ 485 అడుగుల పొడవు కలిగివుంది. ఈ భారీ టెలిస్కోప్ ఉన్నచోట యూఎస్ నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ ఉంది. దీనిని 1958లో స్థాపించారు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చే అలలపై ఇక్కడ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ నుండి బ్లాక్ హోల్స్ వరకు అధ్యయనం చేసే పలు టెలిస్కోప్‌లు ఉన్నాయి. వీటి వినియోగంలో ఇబ్బందులు ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు. టీవీలు, రేడియోలు, మొబైల్‌ఫోన్లు, ఐప్యాడ్‌లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు మొదలైనవాటిని నిషేధించారు. ఇటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే తరంగాలు అంతరిక్షం నుండి వచ్చే తరంగాలను ప్రభావితం చేస్తాయి.

Updated Date - 2022-06-05T14:57:13+05:30 IST