దారులన్నీ మహానాడుకే..

ABN , First Publish Date - 2022-05-29T06:36:46+05:30 IST

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తెలుగుదేశం మహానాడుకు వేలాదిగా తరలి వెళ్లారు.

దారులన్నీ మహానాడుకే..
నరసాపురం నుంచి బస్సులో ర్యాలీగా ఒంగోలు బయలుదేరుతున్న టీడీపీ నాయకులు...

ఉమ్మడి పశ్చిమ నుంచి తరలిన వేలాది మంది
మండుటెండను ఖాతరు చేయకుండా పయనం
ఆంక్షలు, అడ్డంకులను అధిగమించి మహిళలు, యువత ఒంగోలు వైపు..
ఫలించిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల వ్యూహం
టీడీపీ శ్రేణుల్లోనూ ఉరికిన ఉత్సాహం


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తెలుగుదేశం మహానాడుకు వేలాదిగా తరలి వెళ్లారు. ప్రభుత్వ ఆంక్షలతో ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోయినా పార్టీ ఆశించిన, ఊహించిన దానికంటే భిన్నంగా వేలాది మంది సొంత వాహనాలను సమకూర్చుకున్నారు. ప్రతీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఛాలెంజ్‌గా తీసుకుని కేడర్‌ను అప్రమత్తం చేస్తూ సమన్వయపరిచారు. పార్టీ ఇన్‌చార్జ్‌లు వారికి అల్పాహారం సమకూర్చారు. సైతం ఎండ వేడిమి లెక్క చేయకుండా మహిళలు సైతం ముందుకు సాగారు. అందరిలోనూ 2014 నాటి ఉత్సాహం, ఊపు  కనిపించింది. జగన్‌ సర్కారుపై వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచింది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు నియోజకవర్గాల నుంచే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు వెళ్లారు.

ఉత్సాహం ఇనుమడించగా..
తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం ఇనుమడించింది. వర్గ విభేదాలను పక్కనపెట్టారు. ఉమ్మడిగా మహానాడు వైపు కదిలారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు లేనప్పటికీ ఎవరికి వారు ప్రయాణ సౌకర్యాలు సమకూర్చుకుని శనివారం తెల్లవారుజాము నుంచే ఒంగోలు దారిపట్టారు. నూజివీడు, కైకలూరు, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలన్నింటి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉదయం తొమ్మిది గంటలకే కలపర్రు చెక్‌పోస్టు దాటారు. మధ్యలో అధికార పార్టీ ఆటంకాలు సృష్టించే అవకాశం ఉందని, ఆ మేరకు ముందు జాగ్రత్తగా వాహనాలపై జెండాలు లేకుండా సాధారణ ప్రయాణీకుల్లా ముందుకు సాగారు. తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గడిచిన రెండు రోజులుగా ఒంగోలు తరలివెళ్తూనే ఉన్నారు. కొందరైతే దూరభారాన్ని పరిగణనలోకి తీసుకుని గురువారం నాటికే గుంటూరు, ఒంగోలు నగరాలకు చేరుకుని అక్కడి హోటళ్లల్లో బస చేశారు. గ్రామస్థాయి నేతల నుంచి నియోజకవర్గ నాయకులు సైతం తమ వారందరినీ దగ్గరుండి మరీ తీసుకువెళ్ళారు. ప్రతినిధుల సభలోనూ, ఎన్టీఆర్‌ శత జయంతి కార్యక్రమాల్లోను, మహానాడులోను ఉత్సాహం ప్రదర్శించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ సహా ఆచంట నియోజకవర్గ నేతలంతా శనివారం ఉదయం సముద్ర తీరాన కాసేపు సరదాగా గడిపారు. ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, నిమ్మల రామానాయుడు కేడర్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చారు. పరిస్థితిని ఓ వైపు సమీక్షిస్తూనే ప్రయాణ తీరును అడిగి తెలుసుకుంటూ వచ్చారు. చింతమనేని ప్రభాకర్‌, బడేటి చంటి, పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, జయమంగళ వెంకటరమణ, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, బొరగం శ్రీనివాస్‌, ఘంటా మురళీ వంటి నేతలతోపాటు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, మంతెన సత్యనారాయణరాజు మహానాడులో పాలు పంచుకున్నారు. నరసాపురం నుంచి పార్టీ కన్వీనర్లు రామరాజుతో సహా డాక్టర్‌ రాజ్యలక్ష్మి, మాధవనాయుడు, తణుకు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం నుంచి వలవల బాబ్జీ వంటి నేతలంతా మహానాడులో ఉత్సాహంగా గడిపారు. మండుటెండను సైతం ఖాతరు చేయకుండా తెలుగుదేశం శ్రేణులు మహా నాడు లో పాలు పంచుకు న్నాయి. మహానాడుకు ఒక్క ఉమ్మడి పశ్చిమ నుంచే అత్యధికంగా హాజరైనట్టు అంచనా.

Updated Date - 2022-05-29T06:36:46+05:30 IST