అమ్మఒడి.. టెన్షన్‌

ABN , First Publish Date - 2022-06-28T05:25:01+05:30 IST

అమ్మ ఒడి టెన్షన్‌ ఇంకా వీడలేదు.

అమ్మఒడి.. టెన్షన్‌
ఆకివీడులో గదికి తాళాలు వేస్తున్న దృశ్యం

అర్హులెవరు ?  అనర్హులెవరు ? సొమ్ము పడితేనే తేలేది   

భీమవరం ఎడ్యుకేషన్‌, జూన్‌ 27 : అమ్మ ఒడి టెన్షన్‌ ఇంకా వీడలేదు. ఎవరు అర్హులో.. అన్నది ఖాతాలో సొమ్ము పడితేనే తెలుస్తుందన్న ఆందోళన లబ్ధిదారులలో నెలకొంది. వాస్తవానికి సోమవారం ప్రభుత్వం అమ్మ ఒడి సొమ్ము విడుదల చేసింది. దీంతో లబ్ధిదారులు బ్యాంకులు, ఏటీఎంల వద్దకు వెళ్లి ఖాతాలను పరిశీలన చేసుకోగా ఇంకా జమ కాలేదనే సమాచారం వచ్చింది. జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1896 పాఠశాలల్లో చదువుతున్న రెండు లక్షల 24 వేల 137 మందిలో 1,24,137 మంది, ఇంటర్‌ విద్యార్థులు 21,327 మంది అర్హులుగా నిర్ధారించారు. అయితే వీరిలో ఎంత మంది అనర్హులుగా మారరో బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడితేనే గాని తెలియని పరిస్థితి. లబ్ధిదారులు మంగళవారం బ్యాంకులకు వెళ్తేనేగాని అసలు విషయం తెలి యదు. సోమవారం మాత్రం సెల్‌ఫోన్‌ మేసేజ్‌లు కోసం ఎదురుచూశారు. తాడేపల్లిగూడెంలో అమ్మ ఒడి పథకం జిల్లా కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఒకటి రెండు చోట్ల మినహా మిగిలిన చోట్ల ఎక్కడా కార్యక్రమాలు కనిపించకపోవడం గమనార్హం.

విద్యకు అధిక ప్రాధాన్యం : డిప్యూటీ సీఎం కొట్టు

తాడేపల్లిగూడెం రూరల్‌ జూన్‌ 27: విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ట్టు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొ న్నారు. తాడేపల్లిగూడెం మాగంటి కల్యాణ మండపంలో సోమవారం జిల్లాస్థాయి అమ్మ ఒడి కార్యక్రమాన్ని ఆయన ప్రారం భించారు. ముందుగా సీఎం జగన్‌ ప్రసంగాన్ని హాజరైన వారికి వినిపిం చారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు అధిక నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 21,450 మంది తల్లులకు సంబంధించిన అమ్మ ఒడి చెక్కును అందించారు. జడ్పీటీసీలు ముత్యాల ఆంజనేయులు, ఉప్పులూరి వరలక్ష్మి, ఎంపీపీలు పి.శేషుకుమారి, దాసరి హైమవతి, ఎంపీడీవో జీవీకే మల్లికార్జునరావు, ఎంఈవో వి.హనుమ తదితరులు పాల్గొన్నారు.
 
బయటకు రావొద్దంటూ గదికి తాళాలు

ఆకివీడులో అమ్మ ఒడి సమావేశంలో ఘటన
ఆకివీడు, జూన్‌ 27: అమ్మ ఒడి సమావేశం జరుగుతుండగా మహిళలు లేచి వెళ్లిపోతుండడంతో ఉపాధ్యాయులు వారు వెళ్లకుండా తలుపులు వేసిన ఘటన ఆకివీ డు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల భోజనశాలలో సోమవారం అమ్మ ఒడి సమావేశం నిర్వహిం చారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పీవీఎల్‌ నర్శింహరాజు,  క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు హాజరై మాట్లాడారు. అప్పటికే ఆలస్యం కావడంతో మహిళలు సభ నుంచి లేచి వెళ్లిపో సాగారు. దీంతో అక్కడే ఉన్న ఉపాధ్యాయులు వారిని నిలువరించగా.. ‘ఉదయం తొమ్మిది గంటలకు సమావేశానికి హాజరు కాకుంటే అమ్మ ఒడి సొమ్ములు పడవని వలంటీర్లు చెప్పడంతో వచ్చాం. మాకు పడ్డాయో లేదో తెలియదు కాని మరల జగన్‌కు ఓట్లేసి గెలిపించాలని మాత్రం సమావేశంలో చెబుతున్నారు. ఇంట్లో భర్త, పిల్లలకు అన్నం కూడా వండకుండా వచ్చాం.. ఎన్నడూ ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలేదు..’ అంటూ కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఉపాఽధ్యాయులు మిగిలిన మహిళలు బయటకు రాకుండా సమావేశం జరుగుతున్న గదికి బయట తాళాలు వేశారు. ఇది చూసిన గ్రామస్థులు ముక్కున వేలేసుకున్నారు.    

Updated Date - 2022-06-28T05:25:01+05:30 IST