పాలుపోని పాలవెల్లువ

ABN , First Publish Date - 2022-01-29T06:12:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమూల్‌ జగనన్న పాల వెల్లువ’ అధికారులకు సవాలుగా మారింది.

పాలుపోని పాలవెల్లువ

అమూల్‌ కోసం అధికారుల కుస్తీ
జిల్లా సగటు పాల ఉత్పత్తి రోజుకు 12.04 లక్షల లీటర్లు..
అమూల్‌కు 8,900 లీటర్లతో సరి.. డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి
ఫలితం మాత్రం శూన్యం.. ధర తక్కువ ఒత్తిడి ఎక్కువ


జిల్లాలో 5,01,840 పాడి గేదెలకు గాను 3,01,104 మాత్రమే పాలు ఇస్తాయి.
వీటిద్వారా రోజుకు 12,04,416 లీటర్లు పాలు ఉత్పత్తి అవుతాయి.
గృహ, పాక్షిక అవసరాలకు 5,11,816 లీటర్లు వినియోగిస్తారు.
6,92,610 లీటర్ల పాలు ప్రైవేటు డెయిరీలకు, వ్యాపారులకు విక్రయిస్తారు.  
అమూల్‌కు వెళ్లే పాలు 0.9 శాతం. అంటే 8,900 లీటర్ల పాలు మాత్రమే.!
పాల వెల్లువ కింద 128 పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తే 20 కేంద్రాలు మూతపడ్డాయి.


ఏలూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమూల్‌ జగనన్న పాల వెల్లువ’ అధికారులకు సవాలుగా మారింది. ఉత్పత్తిదారులకు ఎన్ని విధాలా మొరపెట్టుకున్నా పాలు పోసేందుకు ముందుకు రావడం లేదు. వ్యవసాయ, పాడి పరిశ్రమ ఆధారిత జిల్లా కావడంతో ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అమూల్‌ పాల వెల్లువ కింద 128 పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిలో ఇప్పటికే 20 కేంద్రాలు మూతపడగా 108 చోట్లే పాల సేకరణ జరుగుతోంది. వీటి ద్వారా అక్టోబ రులో రోజుకు 5,876 లీటర్లు సేకరించగా ఈ నాలుగు నెలల్లో 8,900 లీటర్ల చొప్పున పాలు సేకరిస్తున్నారు. అమూల్‌ కోసం జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేస్తోంది. కలెక్టర్‌ సహా, ఇద్దరు జాయింట్‌ కలెక్టరు, పది శాఖలకు ఈ బాధ్యతలు అప్పగిం చింది. జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కోర్‌ కమిటీలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు, వెటర్నరీ, సహకార, గ్రామీణాభివృద్ధి, డ్వామా, పంచాయతీరాజ్‌ సహా పలు శాఖల జిల్లా అధికారులును నియమిం చింది. వీరితోపాటు మండల స్థాయి అధి కారులు రోజువారీ పర్యవేక్షణ చేపట్టేలా చర్యలు తీసుకుంది. అయినా ఫలితం రాలేదు. జగనన్న చేయూత పథకం కింద లబ్దిదారులకు పాడి పశువులు అందించింది. అదీ ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో డ్వాక్రా సంఘాలపై అధికారులు గురిపెట్టారు. పాడి రైతులతో గ్రూపులు ఏర్పాటు చేయడం, డ్వాక్రా గ్రూపుల్లో పాడి పశువులు ఉన్న వారితో సమావేశాలు నిర్వహించడం, వారిని అమూల్‌ వైపు మళ్లేలా చేసేందుకు వెలుగు సిబ్బందిని రంగంలోకి దింపారు. అదీ పెద్ద ఫలితం ఇవ్వడం లేదు. ఈ ఒత్తిడి భరించలేని వెలుగు సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.


ధర తక్కువ.. ఒత్తిడి ఎక్కువ!
ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా పాల ఉత్పత్తిదారులు అమూల్‌ వైపుకు మొగ్గడం లేదు. అందుకు కారణం అమూల్‌ పాల సేకరణ ధర మిగిలిన డెయిరీలకంటే తక్కువగా ఉండడమే. జిల్లాలోని ప్రైవేటు వ్యాపారస్తులు, పాల డెయిరీలు ఇచ్చే ధర కంటే అమూలు లీటరుకు ఐదు రూపాయలు తక్కువ ఇస్తోందని పాల ఉత్పత్తిదారులు చెబుతున్నారు. అమూల్‌ ప్రారంభించేనాటికి జిల్లాలో 10 శాతం వెన్న ఉన్న పాల ధర లీటరుకు ప్రైవేటు డెయిరీలు రూ.65 ఇస్తుండగా, అమూల్‌ రూ.63 ప్రకటించింది. ప్రస్తుతం ప్రైవేటు డెయిరీలు రూ.74 ఇస్తుంటే, అమూల్‌ రూ.68 ఇస్తోంది. ఈ వ్యత్యాసం కారణంగా అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాడి రైతులు మాత్రం అమూలు వైపు చూడడం లేదు. 

Updated Date - 2022-01-29T06:12:13+05:30 IST