ఇక..ఆప్కో షోరూమ్‌లు

ABN , First Publish Date - 2021-03-01T05:18:32+05:30 IST

జిల్లాలో ఆప్కోను విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇక..ఆప్కో షోరూమ్‌లు


ఏలూరు సహా పలు పట్టణాలపై దృష్టి

ఈ నెల 15 నుంచి ప్రారంభానికి కసరత్తు

అన్న క్యాంటీన్ల కోసం వెతుకులాట


ఏలూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆప్కోను విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఔట్‌లెట్లకు తోడుగా ఆప్కో షోరూమ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 109 ఔట్‌లెట్లకు తోడుగా మరో 50 షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా జిల్లాలో 3 షోరూమ్‌లు ఏర్పాటు కానున్నాయి. స్పందన బాగుంటే వీటిని మిగిలిన పట్టణాల్లో కూడా ఏర్పాటు చేయాలన్నది అధికారుల యోచన. జిల్లాలో ప్రస్తుతం ఏడు ఆప్కో అవుట్‌లెట్లు ఉన్నాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణుకు, నరసాపురం, ద్వారకా తిరుమల స్వామివారి దేవస్థానాలలో వీటిని ఏర్పాటు చేశారు. వీటికి తోడుగా జిల్లాలో మరో ఆరు షోరూమ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తొలిదశలో మూడుచోట్ల వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు అనుకూలమైన షాపులను అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఏలూరులో ఒక షోరూమ్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఏలూరు కొత్త బస్టాండు ఆవరణలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు ఆప్కోకు పీటీడీ హామీ ఇచ్చింది. మిగిలిన వాటి కోసం అన్వేషణ కొనసాగుతోంది. అందుకోసం ఔట్‌లెట్లు లేని పట్టణాలైన నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, ఆకివీడులపై అధికారులు దృష్టి సారించారు. వీటితోపాటు చింతలపూడి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా షోరూమ్‌ల ఏర్పాటు చేసే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఔట్‌లెట్లను కూడా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆయా పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న అన్న క్యాంటీన్లపై దృష్టి సారించారు. జిల్లాలో ఉన్న కొన్ని అన్న క్యాంటీన్లను వార్డు సచివాలయాలుగా వాడుకుంటున్నారు. మిగిలిన వాటిని ఆప్కో షోరూమ్‌లుగా వినియోగించేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నారు.

Updated Date - 2021-03-01T05:18:32+05:30 IST