క్షణం..క్షణం

ABN , First Publish Date - 2021-05-09T05:17:48+05:30 IST

కొవిడ్‌ బాధిత కుటుంబాలు అను క్షణం భయంతో గడుపుతున్నాయి..

క్షణం..క్షణం

కొవిడ్‌ బాధిత కుటుంబాల్లో ఆందోళన

కోలుకున్నామన్న సంతోషం క్షణాల్లో మాయం

ఆక్సిజన్‌..ఇతర సమస్యలతో మృత్యువాత 


కొవిడ్‌ బాధిత కుటుంబాలు అను క్షణం భయంతో గడుపుతున్నాయి.. తమ వారు కోలుకున్నారనే వార్త విని రోజు కూడా గడవక ముందే పరిస్థితి ప్రమాదకరంగా ఉందనే సమాచారం ఆసుపత్రుల నుంచి రావడంతో హతాశులవుతున్నారు..                                            

 నరసాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఒక పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయంలో ఆయన ఇంజనీర్‌. పది రోజుల కిందట ఆయనకు,భార్యకు ఇద్దరికి వైరస్‌ సోకింది. ఇద్దరూ రాజమండ్రి ప్రాంతంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. వారం రోజులు చికిత్స పొందారు. కోలు కోవడంతో ఇద్దరినీ డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు. అయితే.. సాయంత్రానికి భార్యకు ఆయాసం రావడంతో ఆమెను ఆస్పత్రిలోనే ఉంచి.. భర్తను డిశ్చార్జి చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి నుంచి భర్తకు ఫోన్‌ వచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని.. ఇది విన్న ఇంజనీర్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆస్పత్రికి వెళ్లి హుటాహుటిన ఆమెను మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స తీసుకున్న కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది. 


మండలంలోని చిట్టవరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ వైరస్‌ బారిన పడి రాజమండ్రిలో చికిత్స పొందాడు. వారం రోజుల కిందట అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో వైద్యులు డిశ్చార్జి చేస్తామని చెప్పారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి నేను ఆరోగ్యంగా ఉన్నా.. రేపు ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఆ మరుసటి రోజున ఆస్పత్రి నుంచి ఆక్సిజన్‌ లెవల్స్‌ ఆకస్మికంగా తగ్గిపోవడం వల్ల మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌ వచ్చింది. 


పట్టణంలోని ఓ వ్యాపారి తల్లి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఐదు రోజుల తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో వైద్యులు మరో 24 గంటల్లో డిశ్చార్జి చేస్తామని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. అయితే సాయంత్రానికి ఆమె ఆరోగ్య పరిస్థితి మారిపోయింది. హఠాత్తుగా మృత్యువాతపడింది. 


ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో.. విషాద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చికిత్స పొంది ఆరోగ్యంగా ఉన్నారన్న సమాచారం క్షణాల్లో ఆవిరైపోతోంది. ఇలాంటి తరుణంలో ఎవరైనా.. కొవిడ్‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే... కుటుంబ సభ్యులు... క్షణం.. క్షణం..భయంతో గడుపుతున్నారు. తమ వారు క్షేమంగా ఇంటికి రావాలని పూజలు చేస్తున్నారు. అయితే కొవిడ్‌ మొదటి దశలో ఇలాంటి పరిస్థితులు లేవు. రెండో దశలో మాత్రం వైరస్‌ సోకి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం పొందుతున్నా... హఠాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు.


8 నుంచి 14వ రోజుల వరకు ఇబ్బందికరం..

 డాక్టర్‌ బళ్ళ మురళీ, ఎండీ, నరసాపురం

మొదటి విడత కంటే.. రెండో దశలో కేసుల సంఖ్య చాలా ఎక్కువ. ఇంట్లో ఎవరికైనా వైరస్‌ వస్తే.. అందరికి చుట్టేస్తోంది. దీని వల్ల మరణాల సంఖ్య కూడా ఎక్కువుగా కనిపిస్తుంది. చికిత్స పొందుతూ మృతి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. గుండెకు రక్తం సరఫరా చేసే నాళం బ్లాక్‌ అయితే ఎలాంటి ప్రమాదం ఉంటుందో.. ఊపిరితిత్తులకు వెళ్లే నాళం బ్లాక్‌ అయితే.. దాన్ని పల్మనరీ ఎంబాలిజిం అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర అవయవాల మీద ఒత్తిడి పెరిగి మృత్యువాత పడుతున్నారు. ఇది వైరస్‌ వల్లే.. సంభవిస్తుంది. ఆకస్మికంగా ఆక్సిజన్‌ తగ్గడాన్ని సైటోకైన్‌స్టాం అంటారు. వైరస్‌ నియంత్రించే సమయంలో శరీరంలోని అవయవాలు ఎక్కువగా ఒత్తిడి గురైనప్పుడు ఇలాంటి ప్రమాదాలు తలెత్తున్నాయి. సాధారణంగా వైరస్‌ సోకిన 8 నుంచి 14వ రోజు వరకు రోగుల్లో ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయి. 

– నరసాపురం


Updated Date - 2021-05-09T05:17:48+05:30 IST