బాధితులకు ఓదార్పు

ABN , First Publish Date - 2022-07-21T05:38:50+05:30 IST

ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో వారం పాటు వశిష్ఠ ఉగ్రరూపం ప్రదర్శించింది.

బాధితులకు ఓదార్పు

నేడు, రేపు వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
సర్కారు నిర్లక్ష్యంపై ఆరా.. పరిశీలన
సమాయత్తమైన టీడీపీ శ్రేణులు


(ఏలూరు/భీమవరం–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో వారం పాటు వశిష్ఠ ఉగ్రరూపం ప్రదర్శించింది. పల్లపు ప్రాంతాలను ముంచెత్తింది. గట్లు బలహీన పడిన చోట్ల స్థానికులే అప్రమత్తమై స్వచ్ఛందంగా ఇసుక కట్టలు పేర్చి గట్లకు రక్షణ ఇచ్చారు. వేలాది ఎకరాలు నీట మునిగాయి.  కుటుంబాలు వీధినపడ్డా యి. యంత్రాంగం నానా హడావుడి చేసింది. చాలా చోట్ల తగిన రీతిలో ప్రతిస్పందించలేకపోయింది. వరద తాకిడికి స్లూయిజ్‌లన్నీ ఏ క్షణాన  కొట్టుకు పోతాయోనని జనం అల్లాడిపోయారు. ఇప్పుడిప్పుడే కాస్తంత వరద తగ్గు ముఖం పట్టినా ఇంకా భయాందోళనలో జనం ఉన్నారు. వారందరినీ ఓదార్చేందుకు తెలుగు దేశం నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురు, శుక్రవారాల్లో జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఇప్పటికే జరిగిన నష్టం వివరాలను పార్టీ ఆయనకు నివేదించింది.  పరిహారం అందక కుటుంబాలెన్నో ఇంకా విలవిలలాడుతున్నా యనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
నేడు, రేపు బాబు పర్యటన
ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో నేడు, రేపు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. తొలుత ఆయన గురువారం ఉదయం సిద్ధాంతం చేరుకుని అక్కడి నుంచి అయోధ్యలంకకు వెళ్తారు. దారి పొడవునా ప్రజలు, రైతులను పరామర్శిస్తూ వారి కష్టనష్టాలను ఆలకిస్తూ వశిష్ఠ గోదావరిని దాటి అయోధ్యలంకకు చేరుకుంటారు. ముందస్తుగా గోదావరి ముంచెత్తిన కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో చంద్రబాబు పర్యటించా లని భావించారు. ఈ రెండు చోట్ల ఇప్పటికీ వరద నీరు ఇంకా తగ్గకపోవడం, పర్యటనకు అనువుగా తగినన్ని మార్గాలు లేకపోవడంతో వశిష్ఠ ఒడ్డున బాధితు లను పరామర్శించాలని చంద్రబాబు తీసుకున్నారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు నిమ్మల రామా నాయుడు, రామరాజు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి సీనియర్‌ నేతలంతా వశిష్ఠ బీభత్సాన్ని అధినేత చంద్రబాబుకు నివేదించారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒకింత సాహసించి లంక గ్రామాల్లోనూ పర్యటించాలని నిర్ణయించారు. గోదావరి జిల్లాల్లో తొలిసారిగా చంద్రబాబు పడవలో ప్రయా ణించబోతున్నారు. లంకవాసులకు ధైర్యం చెప్పడం, మరోవైపు సాయం అందేలా చేయడంలోనూ చంద్రబాబు పర్యటన ఊతమివ్వబోతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆయన పర్యటనకు వీలుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మూడు నియోజకవర్గాల్లో  ఒక నిర్దేశిత కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ మేరకే చంద్రబాబు గురువారం అయోధ్యలంక, శుక్రవారం నాటికి పోలవరం, నరసాపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. చాలాకాలం తర్వాత ఈ ప్రాంతానికి చంద్రబాబు రానుండడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు కాస్తంత ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. రోడ్ల వెడల్పు తక్కువగా ఉండడం, ఆయా మార్గాల్లో చంద్రబాబు పర్యటన చేస్తుండడంతో దానికనుగుణంగానే                                           పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
 సర్కారు నిర్లక్ష్యానికి వశిష్ఠ గోదావరి వరద నిలువెత్తుసాక్షిగా నిలిచింది. బలహీనపడిన ఏటిగట్లు ఏ క్షణాన్న తెగి వరద నీరు ఊళ్లపై పడుతుందోననే భయంతో వేల మంది అల్లాడిపోయారు.  ఇసుక బస్తాలను భుజాన వేసుకుని ఏ ఊరికావూరులో యువత స్వచ్ఛందంగా గట్టు పటిష్టతకు తక్షణ చర్యలకు దిగారు. మరోవైపు మొరాయించిన స్లూయిజ్‌లు కాల్వ గట్లపై పొంగుతున్న వరదను అంచనా వేస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్‌ టాఫిక్‌గా మారింది. స్లూయిజ్‌లు గేట్లు తెరుచుకోకపోవడం, ఇంకొన్ని చోట్ల అసమర్థ నిర్వహణకు సాక్షిగా వరద నీరు నేరుగా విరుచుకుపడి పొలాలను ముంచెత్తింది. ఈ ఏడాది సార్వా తొలి దశలో ఉండగానే రైతులంతా నష్టాలను మూటకట్టుకోవాల్సి వచ్చింది.
చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఆచంట/ యలమంచిలి,  జూలై 20 : గోదావరి వరద ముంపు బాధిత కుటుంబాలను పరామర్శించడానికి గురువారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారు. ఆచంట నియోజకవర్గంలోని అయోధ్యలంకలో బాధితులను ఆయన పరామర్శించనున్న నేపథ్యంలో  బుధవారం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. చంద్రబాబు లంక గ్రామాల్లో ట్రాక్టర్‌ మీద పర్యటిస్తారన్నారు.
  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి పాలకొల్లులో బస చేయనున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు సారథ్యంలో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ అంగ ర రామ్మోహన్‌, పొందువ్వ శ్రీను బుధవారం పరిశీలించారు. అనంతరం వారు చంద్రబాబు శుక్రవారం వరద బాధితులను పరామర్శించే దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం  పర్యటన రూట్‌ను పరిశీలించారు.  

 చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌..
వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు తెలుగుదేశం అధి నేత చంద్రబాబు గురువారం  జిల్లాకు విచ్చేస్తున్నారు. విజయవాడలో ఉదయం 8 గంటలకు బయలు దేరి సిద్ధాంతం మీదుగా ఆచంట మండలం చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు అయోధ్య లంకలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత కోనసీమ జిల్లా నాగుల్లంకకు మధ్యాహ్నం 1.20 గంటలకు చేరుకుంటారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని 2.00 గంటల నుంచి నాగుల్లంక,  మానే పల్లి గ్రామాలను సందర్శిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు రాజోలు చేరుకుని ఆరు గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో   రాత్రి 7 గంటలకు పాలకొల్లులోని రామచంద్ర గార్డెన్స్‌ చేరుకుంటారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు గార్డెన్స్‌ నుంచి బయలు దేరి 11 గంటలకు యలమంచిలి మండలం దొడ్డిపట్ల చేరుకుని దొడ్డిపట్ల, అబ్బిరాజు పాలెం, గంగాధర పాలెం, లక్ష్మీపురం ప్రాంతాల్లో పర్యటించి వరద బాఽధితులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ఆపై లక్ష్మీపురం నుంచి బయలు దేరి మధ్యాహ్నం 3 గంటలకు నరసాపురం మండలం పొన్నపల్లి గోదావరి గట్టును సంద ర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గంలో రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.  

Updated Date - 2022-07-21T05:38:50+05:30 IST