మెరుగైన సేవలందిస్తా

ABN , First Publish Date - 2022-01-27T06:13:36+05:30 IST

జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్‌ బుధవా రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరిం చారు.

మెరుగైన సేవలందిస్తా

జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్‌ బాధ్యతల స్వీకరణ
వసతి గృహం తనిఖీ.. విద్యార్థులతో మాటా మంతి
లక్ష్యాల సాధనకు ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచన


ఏలూరు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్‌ బుధవా రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ మెరుగైన సేవలందిస్తామన్నారు. నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, రైతు సంక్షేమం, ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ, కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌, పారిశుధ్యం తదితర ప్రాధాన్యతాంశాలుగా తీసుకుంటానని వెల్లడించారు. జేసీలు హిమాన్షుశుక్లా, బీఆర్‌ అంబేడ్కర్‌, పద్మావతి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌రెడ్డి, డీఆర్‌వో డేవిడ్‌రాజు తదితరులు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏలూరు అమీనాపేట ఏటిగట్టున వున్న సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలలతో కొద్దిసేపు గడిపిన ఆయన సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నలు వేసి విద్యార్థుల విద్యాప్రగతిని పరిశీలించారు. ఇంగ్లిషు భాషా జ్ఞానం పెంచేలా ట్యూటర్‌ను ఏర్పాటు చేయాలని వార్డెన్‌కు సూచించారు. విద్యార్థులకు పెడుతున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యత పరిశీలించారు. గోడలపై ఉన్న సూక్తులను పిల్లలతో చదివించారు. విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వాటి సాధనకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రహరీ లేని హాస్టళ్లకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ జేడీని ఆదేశించారు. జేసీ పద్మావతి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T06:13:36+05:30 IST