ఓటు ఉందో..ఊడిందో..!

ABN , First Publish Date - 2021-03-07T05:09:58+05:30 IST

నగర పాలక సంస్థ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఈ మేరకు అయా పార్టీల నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. మీ ఓటు మాకే వేయాలంటూ విన్నవించుకుం టున్నారు. ఇదంతా బాగానే ఉంది. అసలు ఓటు వేయాలంటే ఓటంటూ ఉండాలి గదా.. ఇదే ప్రశ్న నగరంలో చాలామంది ఓటర్లను కంగారు పెట్టిస్తోంది.

ఓటు ఉందో..ఊడిందో..!

తప్పుల తడకగా ఓటరు జాబితా.. గుర్తుల కేటాయింపు

ఒక్కొక్కరికి రెండు ఓట్లు .. కొందరికే ఓటరు స్లిప్‌లు


ఏలూరు టూటౌన్‌, మార్చి 6 :

నగర పాలక సంస్థ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఈ మేరకు అయా పార్టీల నాయకులు  ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. మీ ఓటు మాకే వేయాలంటూ విన్నవించుకుం టున్నారు. ఇదంతా బాగానే ఉంది. అసలు ఓటు వేయాలంటే ఓటంటూ ఉండాలి గదా.. ఇదే ప్రశ్న నగరంలో చాలామంది ఓటర్లను కంగారు పెట్టిస్తోంది. ఈసారి తమ ఓటు ఉందో ఊడిందో లేదా ఏ ప్రాంతంలో ఉందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఓటరు స్లిప్‌లు అందజేయాల్సి ఉండగా ఇంతవరకు అధికశాతం ఓటర్లకు పంపిణీ జరగలేదు.  ఏ ఎన్నికల్లో లేని విధంగా ఈసారి ఓటర్ల జాబితా గందరగోళంగా మారడం విశేషం.

 నగరపాలక ఎన్నికలు ఈనెల 10 తేదీన జరగనున్న నేపథ్యంలో అధికారులు జారీ చేసిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. ఎవరి ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. అసలు ఓటు ఉందో లేదోనన్న సందిగ్ధం నగరవాసుల్లో నెలకుంది. ఒకచోట నివాసం ఉంటే ఓటరు లిస్టులో మరోచోట పేరుంది. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే, రెండు పేర్లు ఒకచోట రెండు పేర్లు మరోచోట ఉన్నాయి.  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి ఇంటికి ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చినా చాలామంది ఓటర్లకు ఇంకా అందలేదు. ఓటరు జాబితాలు అన్ని సచివాలయాల్లో పెట్టాం.. చూసుకోండి అంటూ అధికా రులు సెలవిస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని జనాలకు పనులు మాను కుని తమ ఓటు ఉందా లేదా అని చూసుకునే తీరిక ఉంటుందా..?.   కొంతమంది చదువు రానివారు తమ ఓటు  ఎక్కడ ఉందో తెలుసుకోవా లని సచివాలయాలకు వెళ్లే సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోతు న్నారు. ఒక డివిజన్‌లో నివాసం ఉండి వేరే డివిజన్‌లో ఓటు ఉంటే  భవిష్యత్‌లో సమస్యలపై ఓటర్లు స్థానికంగా నివాసం ఉండే ప్రదేశాలలో ఉన్న ప్రజాప్రతినిధులను ఎలా అడుగుతారనే ప్రశ్న తలెత్తోంది. రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు కోసం ఓటు వేయకుండా ఎలా అడుగుతాం.. అని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో ఒక వ్యక్తికి రెండు చోట్ల  ఓట్లు ఉండడం చూస్తే అధికారులు ఎంత బాధ్యతతో ఓటరు  జాబితాలు తయారు చేశారో అర్థం అవుతుంది. గతంలో ఒక వ్యక్తికే వరుసగా 14 ఓట్లు కేటాయించడం, ఓటరు ఫొటో ముద్రించే స్థానంలో కుక్క బొమ్మ కూడా పెట్టి రాష్ట్ర వ్యాప్త సంచలనానికి నగరపాలక సంస్థ అధికారులు తెర తీశారు. వీటన్నింటి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మరల తప్పుల తడకగా ఓటర్ల జాబితా తయారు చేయడమే కాకుండా ఒకే వ్యక్తికి పలు చోట్ల ఓట్లు ఉండడాన్ని గమనించకపోవడం అధికారుల ఉదా సీనతకు అర్థం పడుతుంది. ఈ విషయమై కొంతమంది ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేసినా ఓటర్ల జాబితాలో మార్పులు జరగలేదు. అభ్యర్థులకు పార్టీల పరంగా గుర్తులు కేటాయించడంలోనూ అలసత్వం ప్రదర్శించారు. జాతీయ పార్టీ అయిన సీపీఎం 19వ డివిజన్‌ అభ్యర్థి పళ్ళెం కిషోర్‌కు కంకి–కొడవలి గుర్తు కేటాయించారు. వాస్తవానికి సీపీఎం గుర్తు సుత్తి– కొడవలి–నక్షత్రం.దీనిబదులు గుర్తు మార్చేశారు. 19వ డివిజన్‌లో ఉన్న సత్యవతి నాయుడు, హైమావతి నాయుడు పేర్లు 13వ డివిజన్‌ ఓటరు జాబితాలోనూ ఉన్నాయి. ఇదేవిధంగా 50 డివిజన్లలో వందల సంఖ్యలో డబులింగ్‌ పేర్లు ఉన్నట్టు ఓటరు జాబితాలు చూస్తే తెలుస్తోంది. 

Updated Date - 2021-03-07T05:09:58+05:30 IST