గ్రామానికో రొయ్య, చేపల దుకాణం

Nov 27 2021 @ 00:00AM

 భీమవరం, నవంబరు 27 : ఆక్వా ఉత్పత్తులకు లోకల్‌ మార్కెట్‌ మరింత ప్రోత్సహించే విధంగా మినీ ఫిష్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. మూడు దశాబ్దాలుగా రైతులు డొమిస్టిక్‌ మార్కెట్‌ విస్తరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు సచివాలయ పరిధిలో ఓ షాపు ఏర్పాటు ప్రతిపాదించారు. పైగా ఈ అవుట్‌లెట్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కొన్ని నెలల కిందట స్వయంగా మత్స్యశాఖ పర్యవేక్షణలో ప్రధాన నగరాలు, పట్టణాలలో దుకాణాలు ప్రారంభించాలని ప్రతిపాదించారు. ప్రయోగాత్మకంగా విశాఖలో ప్రారంభమైంది. తదుపరి గ్రామాల వారీగా మినీ అవుట్‌లెట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు.  120 నుంచి 150 చదరపు అడుగుల విస్తీర్ణంలో చాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టే వీలుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సహకారంతో సులభంగా రుణం పొందే అవకాశం కల్పించారు. ఎటువంటి సెక్యూరీటీలు గాని, ష్యూరిటీలు గాని అవసరం లేకుండా బ్యాంక్‌ నుంచి రుణం పొందేలా ఈ ఉపాధి పథకం రూపొందించారు.  మొదటి 6 నెలలు వాయిదాలు చెల్లించనవసరం లేని విధంగా అవకాశం ఇచ్చారు. నెలకు చెల్లించవలిసిన వాయిదా సుమారు రూ.2000 నుంచి 4000 వంతున ఏడేళ్లలో రుణం చెల్లించే అవకాశం ఇచ్చారు. ఈ ప్యాకేజీలో సొంత షాప్‌ ఉన్నట్లయితే యూనిట్‌ విలువ రూ.2లక్షలు, లబ్ధిదారుడు కట్టవలిసింది రూ.32 వేలు (సరుకు కొనుగోలు, వ్యాపారం నిర్వహించడానికి అందు బాటులో ఉండే నగదు), బ్యాంకు రుణం సుమారు రూ.1.70 లక్షలు, ఈ రుణం యంత్ర పరికరాలకు వినియోగిస్తారు. స్థలం ఉన్నట్లయితే యూనిట్‌ విలువ రూ.3.54 లక్షలు లబ్ధిదారుడు కట్టవలసింది రూ.52 వేలు (సరుకు కొనుగోలు వ్యాపారం చేసుకోవడానికి) అవకాశం ఇచ్చారు. అలాగే నాణ్యమైన లైవ్‌ ఫిష్‌ ట్యాంకులు, ఫిష్‌ డిస్‌ప్లే స్టాండ్‌, స్టీల్‌ టేబుల్స్‌, తూనిక మెషిన్‌,  మొదలైన మౌలిక సదుపాయాలను బ్యాంకు ఇచ్చిన రుణంతో  ఏర్పాటు చెయ్యడానికి వీలు కల్పించారు.  రిటైల్‌ అవుట్‌ లెట్‌లో ప్రతీ రోజు అన్ని రకాల ఉత్పత్తులు అన్ని సమయాలలో వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా చూస్తారు. 


నాణ్యమైన ఉత్పత్తుల సరఫరా..!

లైవ్‌ ఫిష్‌ తాజాగా ఉండేందుకు మూడు రోజులకు ఒకసారి ఉత్పత్తులు హబ్‌ నుంచి షాపుకు పంపిణీ చేస్తారు. మార్కెట్‌లోని ఇతరులతో పోలిస్తే రిటైల్‌ అవుట్‌లెట్లలో సరసమైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.ధృవీకరించబడిన ఉత్పత్తులను వినియోగదారునికి విక్రయిస్తామంటున్నారు. మంచినీటి చేపలు (లైవ్‌, ఫ్రేష్‌), సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు, వ్యాక్యుమ్‌ ప్యాక్‌ చేసిన కట్‌ ఫిష్‌, ఒలిచిన రొయ్యలు, వండుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యాక్యుమ్‌ ప్యాక్‌ చేసిన రొయ్యలు,చేపలు, ఎండు చేపలు,ఎండు రొయ్యలు, నాన్‌వేజ్‌ పచ్చళ్ళు విక్రయించనున్నట్టు తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.