మత్స్యశాఖ స్టాల్స్‌

ABN , First Publish Date - 2021-09-15T05:30:00+05:30 IST

ఆక్వా రంగంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు రొయ్యలు, చేపలు, ఇతర ఉత్పత్తులను డొమెస్టిక్‌ మార్కెట్‌కు (స్థానికంగానే) విస్తరించి విక్రయించడానికి మత్స్యశాఖ యోచిస్తోంది.

మత్స్యశాఖ స్టాల్స్‌

చేపలు, రొయ్యల వ్యాపారంపై యోచన

సముద్ర ఉత్పత్తులూ విక్రయించే ప్రతిపాదన

విశాఖలో ట్రయల్‌ రన్‌ 

భీమవరం, సెప్టెంబరు 15 : ఆక్వా రంగంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు రొయ్యలు, చేపలు, ఇతర ఉత్పత్తులను డొమెస్టిక్‌ మార్కెట్‌కు (స్థానికంగానే) విస్తరించి  విక్రయించడానికి మత్స్యశాఖ యోచిస్తోంది. దీనిపై చేపలు, రొయ్యల రైతులతో మత్స్యశాఖ గత వారం విజయవాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. జిల్లా రొయ్యల రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి రూప్‌కుమార్‌ వర్మతో పాటు కొంత మంది రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

రాష్ట్రంలోనే మనజిల్లా 70 శాతం రొయ్యల సాగు చేస్తోంది. 2 లక్షల ఎకరాల్లో చేపలు సాగవు తున్నాయి. వేల కోట్ల విలువ చేసే చేపలు, రొయ్యల ఉత్పత్తులను ఎగుమతులు చేస్తున్నారు. కరోనా సమయంలో ధర లేక, ఎగుమతులు లేక ఈ రెండు రంగాలు నష్టాలు మూట గట్టుకున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు కొంతమంది నిపుణుల సూచనలతో తాజాగా మత్స్యశాఖ ఈ ప్రతిపాదన చేసింది. అయితే ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు. రెండు దశాబ్దాల క్రితం నుంచే చేప, రొయ్యల రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. గత ప్రభుత్వాల దృష్టికి కూడా వెళ్లాయి. అయితే మౌలిక వసతుల కల్పన అసాధ్యమని అధికారులు ఈ ప్రతిపాదనపై ముందడుగు వేయలేకపోయారు.తాజాగా అధికారులు దీనిని మళ్లీ తెరపైకి తెచ్చారు. పైలట్‌ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో విక్రయాలు ప్రారంభించేందుకు యోచిస్తున్నారు. అలాగే విజయవాడ వంటి నగరాలు తొలిదశలో, తరువాత రాయలసీమ ప్రాంతం, కోస్తా ఆంధ్రలో ప్రధాన పట్టణాల్లో కూడా వీటిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. జిల్లాలో నరసాపురం,పాలకొల్లు, భీమవరం, ఏలూరులో ఇప్పటికే డొమెస్టిక్‌ విక్రయాలు సాగుతున్నాయి. కానీ రైతులు ఆశించిన స్థాయిలో వారికి మార్కెట్‌ ధర లభించడం లేదు. దీనిపై రైతులు అభిప్రాయాలను సమావేశంలో సేకరించారు. వసతులు, రవాణా, స్టోరేజీ వంటి వాటిపై చర్చించారు. జిల్లాల వారీగా కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యరూపానికి ఉన్న అవకాశాలను చర్చించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

మౌలిక వసతుల కల్పనే కీలకం

గతంలో స్థానిక కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండేవి.  రొయ్యలకు విదేశాల్లో వచ్చే ధర మన ప్రాం తంలో లభించే అవకాశం లేదు. అయితే చేపల విక్రయానికి అవకాశాలున్నాయి. దీనికి కూడా అనేక మౌలిక వసతుల కల్పన అవసరం. పట్టుబడి దగ్గర నుంచి విక్రయాలకు ఉద్దేశించిన ప్రాంతం వరకూ రవాణా సదుపాయం, దిగుమతి అయిన తర్వాత కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యం వంటివి ఏర్పాటు చేయవలసి ఉంటుంది.  

ఆలోచన మంచిదే..

సౌకర్యాలు కల్పించాలి

రొయ్యలు, చేపలు, పీతలు, పండుగొప్ప, కొరమీను, ఇతర రకాలతో పాటు సముద్రపు ఉత్పత్తులను కూడా స్థానికంగా 13 జిల్లాలలోనూ విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆలోచన మంచిదే. కానీ స్థానికంగా సౌకర్యాలు కల్పించాలి. 

– రూప్‌కుమార్‌ వర్మ, రొయ్య రైతుల   

    సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి 

Updated Date - 2021-09-15T05:30:00+05:30 IST