తగ్గని వరద ఉధృతి

ABN , First Publish Date - 2022-08-15T05:42:45+05:30 IST

వరద ఉధృతి నాల్గొవ రోజు ఆదివారం కూడా తగ్గలేదు.

తగ్గని వరద ఉధృతి
నరసాపురం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వశిష్ఠ

ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు
పంటు లేక  ప్రయాణికులు ఇబ్బందులు
ఏటిగట్టు పైనే మాచేనమ్మకు పూజలు
ముంపులోనే పెదలంక, కనకాయలంక గ్రామాలు


నరసాపురం టౌన్‌/ఆచంట/ యలమంచిలి,  ఆగస్టు 14: వరద ఉధృతి నాల్గొవ రోజు ఆదివారం కూడా తగ్గలేదు. ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు వశిష్ఠకు పోటెత్తడంతో ప్రమాద స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. రేవుల్లో నీటి మట్టాలు తగ్గలేదు. నరసాపురం– సఖినేటి పల్లి రేవుల మధ్య రాకపోకలు లేకపోవడంతో స్టీమర్‌ రోడ్‌ నిర్మానుషంగా దర్శనమిచ్చింది. పంటు లేక పెళ్లిళ్లు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
 ఆచంట మండలంలో వరద గోదావరి ఆదివారం కాస్తా తగ్గుముఖం పట్టింది. పెదమల్లం మాచేనమ్మ ఆలయం చుట్టూ వరద నీరు చేర డంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఏటిగట్టు పైనే అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు గట్టు పైనే వంటలు చేసుకున్నారు.   
 యలమంచిలి మండలంలో గోదావరి వరద నిలకడగానే ఉంది. గత నాలుగు రోజులుగా పెదలంక, కనకాయలంక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వాకలగరువు, యలమంచిలి, లక్ష్మీపాలెం, యల మం చిలిలంక, చించినాడ, ఏనుగువానిలంక, దొడ్డిపట్ల పల్లిపాలెం, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామాల లంకభూముల్లో నాలుగు రోజుల కిందట చేరిన వరద నీరు నిలకడగానే ఉంది. నెల రోజుల వ్యవధిలో రెండోసారి వరద రావడంతో తాము అవస్థలు పడుతున్నా మని లంక గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

Updated Date - 2022-08-15T05:42:45+05:30 IST