పునరావాస కాలనీల్లో ఇళ్లు రిజర్వ్‌

ABN , First Publish Date - 2021-06-20T04:31:39+05:30 IST

గోదావరి ముంపు భయంతో పునరావాస కాలనీల్లో ముందుగానే నిర్వాసితులు ఇళ్లు రిజర్వ్‌ చేసుకుంటున్నారు.

పునరావాస కాలనీల్లో ఇళ్లు రిజర్వ్‌
నిర్వాసితులు ముందే రిజర్వ్‌ చేసుకుంటున్న ఇళ్లు ఇవే..

కుక్కునూరు, జూన్‌ 19 : గోదావరి ముంపు భయంతో పునరావాస కాలనీల్లో ముందుగానే నిర్వాసితులు ఇళ్లు రిజర్వ్‌ చేసుకుంటున్నారు. కుక్కునూరులోని ఎ–బ్లాక్‌లో దాదాపు 750 కుటుంబాలు ఉన్నాయి. గత ఏడాది వచ్చిన వరదలకు వీరంతా ఇళ్లు ఖాళీ చేసి అప్పటికప్పుడు మెరక ప్రాంతంలోకి పిల్లా, పాపలతో తరలివెళ్లారు. ఈ ఏడాది కాఫర్‌ డ్యామ్‌ ప్రభావంతో వరద ముంచుకొస్తుందనే భయంతో ముందుగానే అప్రమత్తమై జాగ్రత్త పడుతున్నారు. కుక్కునూరుకు సమీపంలో కివ్వాక వద్ద గిరిజన నిర్వాసితుల కోసం పునరావాస కాలనీలను నిర్మించారు. దీంతో కుక్కునూరు ఎ–బ్లాక్‌ నిర్వాసితులు ముందుగానే పునరావాస కాలనీ ఇళ్ల వద్దకు వెళ్లి అక్కడ ఇళ్లను రిజర్వ్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గోడపై తమ పేర్లను రాయడంతో పాటు గుర్తుగా గుమ్మాలకు కర్టెన్‌లను కట్టుకుంటున్నారు. గోదావరి ఏ మాత్రం పెరిగినా ఇళ్లు ఖాళీ చేయడానికి సంసిద్దులమై ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఎ–బ్లాక్‌ నిర్వాసితులు చెబుతున్నారు.


Updated Date - 2021-06-20T04:31:39+05:30 IST