సాగు.. జాప్యం!

ABN , First Publish Date - 2022-08-18T06:32:22+05:30 IST

గోదావరికి వరదలు.. జోరు వానలు.. దెబ్బతిన్న నారుమడులు.. ఫలితంగా మళ్లీ ఈ సారాలోనూ వరినాట్లు ఆలస్యం అయ్యాయి.

సాగు.. జాప్యం!
ఆచంట వేమవరంలో రెండోసారి నీట మునిగిన పంట పొలాలు

 ఖరీఫ్‌ వరి నాట్లు ఆలస్యం...
వరదలు, వానలతో సుమారు నెల రోజులు జాప్యం..
ఇప్పటివరకు 79 వేల హెక్టార్లలో నాట్లు  
కాల్వలకు జూన్‌లో నీళ్లు వదిలినా తప్పని ఆలస్యం


భీమవరం, ఆగస్టు 17 : గోదావరికి వరదలు.. జోరు వానలు.. దెబ్బతిన్న నారుమడులు.. ఫలితంగా మళ్లీ ఈ సారాలోనూ వరినాట్లు  ఆలస్యం అయ్యాయి. వ్యవసాయశాఖ ముందస్తు సాగు ప్రయత్నం ఫలించలేదు. ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. జిల్లాలోని నరసాపురం, భీమవరం, రెవెన్యూ డివిజన్‌ల ప్రాంతంలో నరసాపురం, మొగల్తూరు, భీమవరం, వీరవాసరం, కాళ్ళ, పాలకోడేరు వంటి మండలాల్లో నాట్లు వేస్తున్నారు. ఇంకా దెబ్బతిన్న ప్రాంతాల్లో నారుమడులు ఎదుగుతూ ఉన్నాయి. ఈ నెలాఖరుకి కూడా పూర్త య్యే పరిస్థితులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్టతో పోలిస్తే డెల్టా ఈసారి ఇలా సాగులో వెనుకబడింది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సుమారుగా లక్ష హెక్టార్లకు సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. సాగు ముందుగా ప్రారంభించాలని జూన్‌లోనే కాల్వలకు నీరు వదిలినా చి వరి వారంలో కొంతమంది నారుమడులు వేయగా యథావిధిగానే జూలైలోనే అత్యధికులు నారుమడులు వేశారు. ఈలోగా జూలైలో భారీ వర్షాలు కురవడం.. గోదావరికి వరదలు రావడం తో డెల్టా ఎగువ ప్రాంతంలో వర్షాలు వల్ల దిగువ ప్రాంతంలో గోదావరి వరదల వల్ల నాట్లకు అవరోధం ఏర్పడింది. నారుమడులు మునిగిపోవడంతో రెండోసారి వేయాల్సి వచ్చింది. కొన్నిచోట్ల నాట్లు వేసిన వరి పంట కూడా మునిగి దెబ్బతిన్నది. మొత్తంగా ఇప్పటివరకు 79 వేల హెక్టార్లలో నాట్లు పూర్తయినట్టు వ్యవసాయశాఖ లెక్కలు వేసింది. ఇంకా 20 వేల హెక్టార్లకు పైగా వరినాట్లు వేయాల్సి ఉంది.  గత నెలలో గోదావరికి వచ్చిన వరదలు తగ్గుముఖం పట్టిన మళ్లీ నాలుగు రోజుల నుంచి గోదావరి వరదనీరు రావడంతో వరి నాట్లు వేసే పొలాల్లో నీరు నిలిచిపోయింది. ఈ ప్రాంతాల్లో వరి నాట్లు ఆలస్యం అవుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా సాగు ఆలస్యం అయింది.

రాయితీపై 956 క్వింటాళ్ల విత్తనాలు
గతనెలలో వరదలు, వర్షాల కారణంగా 600 ఎకరాల్లో వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. మరల నారుమళ్లు వేయాల్సి ఉంది. అందుకోసం 956 క్వింటాళ్ల వరి విత్తనాలను 80 శాతం సబ్సిడీపై రైతులకు అందజేశాం. అయితే మళ్ళీ ఆచంట, యల మంచిలి, నరసాపురం మండలాల్లో వరద రావడంతో వరి నారుమళ్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి జిల్లాలో 75 శాతం పైగా వరినాట్లు పూర్తయ్యాయి.
– వెంకటేశ్వరరావు, వ్యవసాయశాఖ జేడీ

మళ్లీ పెరిగిన గోదావరి
 నరసాపురం టౌన్‌/ యలమంచిలి/ ఆచంట, ఆగస్టు 17: వశిష్ఠా గోదావరి  ఉధృత్తంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడిచి పెట్టడంతో బుధవారం మళ్లీ వరద పెరిగింది. నరసాపురం లోని అమరేశ్వర, వలంధర్‌, లలితాంబ రేవుల వద్ద నీటి మట్టాలు ఒక్కసారిగా పెరిగాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. నవరసపురం ఎస్టీకాలనీలో కొద్దిగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉభయ గోదావరి రేవుల మధ్య ఏడో రోజూ పంటు రాకపోకలు నిలిచిపోయాయి. యలమంచిలి  మండలంలో  కనకాయలంక, బాడవ, పెదలంక గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. కనకాయలంకలో పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. బాడవ, పెదలంక గ్రామాల్లో రోడ్లపైనా, ఇళ్ల చుట్టూ వరదనీరు చేరుతోంది. దొడ్డిపట్ల పల్లిపాలెం, లక్ష్మీపాలెం పల్లిపాలెం ప్రాంతా లతో పాటు యలమంచిలి లంకలోని పల్లపు ప్రాంతాల్లో వరదనీరు క్రమంగా పెరుగుతోంది.  ఆచంట మండలంలో పుష్కరఘాట్‌లు నీట మునిగాయి. పెదమల్లం మాచేనమ్మ ఆలయం ఆవరణ చుట్టూ వరద నీరు మరలా చేరింది.

Updated Date - 2022-08-18T06:32:22+05:30 IST