జరిమానాల ఝలక్‌

ABN , First Publish Date - 2021-01-23T05:30:00+05:30 IST

జిల్లాలో జరి మానాల మోత మోగిపోతోంది.

జరిమానాల ఝలక్‌

వాహనదారులకు వడ్డన

ఇరవై రోజుల్లో 878 కేసులు నమోదు

జేబు ఖాళీ చేయిస్తున్న కొత్త మోటారు చట్టం

వాహనదారుల లబోదిబో

ఏలూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరి మానాల మోత మోగిపోతోంది. కొత్త ఏడాది ప్రారంభ మైన కొద్ది రోజుల్లోనే జిల్లాలో 878 మందికి జరిమానాల వాత తగిలింది. నిన్న మొన్నటి వరకూ వందల్లో ఉన్న జరిమానాలు వేలల్లో ఉండడంతో బాధితులు లబోదిబో మంటున్నారు. సొంత వాహనాలపై బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. అధికారుల కంట పడకుండా ఉం డేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓవర్‌ లోడ్‌తో ఒక్కసారి దొరికారా.. కనీసంగా రూ.25 వేల పైచిలుకు చెల్లించుకోవాల్సిందే! ఇలాంటి కేసులు కూడా జిల్లాలో భారీగానే నమోదయ్యాయి.

ఇరువై రోజుల్లో 878 మందికి షాక్‌

గత 20 రోజుల్లో జిల్లాలోని 878 మందికి రవాణా శాఖ విధించిన కొత్త జరిమానాల షాక్‌ తగిలింది. వాస్తవానికి పండుగ,ఇతర సెలవు దినాలు మినహాయిస్తే ఇది కేవలం 15 రోజుల్లో అధికారులు పట్టుకున్న కేసుల సంఖ్య. కిందటేడాది సగటుతో పోలిస్తే చాలా ఎక్కువ. కిందటేడాది మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులు 5,532. అంటే నెల వారీ సగటు 450 నుంచి 460 మధ్య ఉంటోంది. కానీ కొత్త ఏడాదిలో తొలి 20 రోజుల్లోనే కేసుల సంఖ్య దానికి రెట్టింపుగా నమోదైంది. మిగిలిన 10 రోజులను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులు గజగజలాడుతున్నారు. 

 కేసుల వివరాలు ఇలా.. 

రవాణా వాహనాల్లో ప్రయాణికుల తరలింపు– 21 కేసులు– 10 వేలు, ప్లస్‌ తలకి ఒక్కింటికి రూ.200 జరిమానా

లైసెన్సు లేకుండా ప్రయాణం– 373 కేసులు– తొలిసారి ఒక్కొక్కరికి రూ. 1,035, రెండోసారి రెట్టింపు

రిఫ్లక్టర్లు లేని వాహనాలు– 192 కేసులు – ఒక్కొక్కరికి రూ. 1,035 జరిమానా

హెల్మెట్‌ లేని ప్రయాణం– 155 కేసులు – తొలిసారి ఒక్కొక్కరికి రూ. 1,035, రెండోసారి రెట్టింపు 

సీటు బెల్టు లేని ప్రయాణం– 34 కేసులు– తొలిసారి ఒక్కొక్కరికి రూ. 1,035, రెండోసారి రెట్టింపు 

సరుకు రవాణా వాహనాల ఓవర్‌ లోడింగ్‌– 70 కేసులు– కాంపౌండ్‌ ఫీజు 20 వేలతో పాటు టన్నుకు రూ. 2 వేల చొప్పున జరిమానా

ప్యాసింజరు వాహనాల్లో ఓవర్‌ లోడింగ్‌– 19 కేసులు కాంపౌండు ఫీజు రూ. 10 వేలతోపాటు అదనంగా ఉన్న ఒక్కొక్కరికి రూ.200 చొప్పున జరిమానా

రాంగ్‌ రూటు ప్రయాణం– 14 కేసులు– తొలిసారి రూ. 1,035, రెండోసారి రెట్టింపు జరిమానా


Updated Date - 2021-01-23T05:30:00+05:30 IST