తెరపైకి పాత కేసులు

ABN , First Publish Date - 2021-03-06T06:27:07+05:30 IST

మున్సిపల్‌ రాజకీయ రణంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.

తెరపైకి పాత కేసులు

మరోవైపు బెదిరింపులు.. ప్రత్యర్థులకు చుక్కలు

వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార, ప్రతిపక్షాల దూకుడు

మంత్రులకు సవాళ్లు.. ఏలూరు, కొవ్వూరు పోటీల్లో అనూహ్య పరిస్థితి

నిలదొక్కుకున్న ప్రత్యర్థి అభ్యర్థులు.. నర్సాపురంలోనూ దాదాపు ఇదే పరిస్థితి


(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

మున్సిపల్‌ రాజకీయ రణంలో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అధికార పార్టీ పాత కేసులు బయటకు తీస్తోంది. రికార్డులు చూపించి మరీ బెదిరిస్తోంది. ‘ఎన్నికల తరువాత చూద్దురు గాని మా తడాఖా’ అంటూ రంకెలు వేస్తోంది. ఈ ఒత్తిళ్లకు కొందరు మానసికంగా సిద్ధపడుతుండగా.. ఇంకొందరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఓట్ల పోరులో అడుగు ముందుకు వేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో పోలింగ్‌కి సిద్ధమవుతున్న తరుణంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. 

  తాజాగా ఓ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి వార్డు కార్యకర్తలతో భేటీ అయి.. ప్రచార సరళిని ఎలా పెంచాలో సమాలోచన చేస్తుండగా.. పోలీసులు ప్రత్యక్షమయ్యారు. పేకాటలో మీపై పాత పెండింగ్‌ కేసు ఉంది. స్టేషన్‌కి నడవండి అంటూ హూంకరించారు. అప్పటికప్పుడు ఆ శిబిరం కాస్త ఉద్రిక్తంగా మారింది. కావాలనే పనిగట్టుకునే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని రచ్చ చేశారు. వాగ్వావాదానికి దిగారు. ఇదేం మంచి పద్ధతి కాదంటూ వాదించారు. 

 మరో వార్డులో దూసుకుపోతున్న ప్రతిపక్ష అభ్యర్థికి.. పోటీ చేసి గెలిస్తే మీరు చేసేదేముంది. స్టేట్‌లో మేమే, ఇక్కడా మేమే. కాస్తంత తగ్గించుకుంటే.. ఇప్పటి వరకు అయిన ఖర్చుతోపాటు మిగతా ఖర్చు పూర్తిగా మీ అకౌంట్లో చేరుతుంది. ఇష్టమైతే సరే అనండి లేదంటే భవిష్యత్తు నష్టపోతారంటూ వార్నింగ్‌ ఇచ్చారు.



ఏలూరు కార్పొరేషన్‌ సహా మిగతా మున్సిపాల్టీల్లోనూ రాజ కీయం దాదాపు వేడెక్కగా వ్యూహాలు పదును తేలుతున్నాయి. ఆ క్షణంలోనే ఇలా పరోక్షంగా బెదిరింపులు బయట పడు తున్నాయి. ఎవరూ తగ్గట్లేదు. పంచాయతీ ఎన్నికల మాదిరి గానే పుర పోరులోనూ తమ పెత్తనమే సాగుతుందని అధికార వైసీపీ ఎత్తుగడ వేసింది.  సంక్షేమ పథకాల బూచి చూపించి పట్టణ ఓటర్లను కావాలా, వద్దా అంటూ క్షేత్రస్థాయిలో పరోక్ష సంకేతాలిచ్చింది. పేద, మధ్య తరగతి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని మాయోపాయాలను రంగరించి మరీ పట్నం పోరులో ప్రచారానికి దిగింది. పోలింగ్‌కు నాలుగు రోజులే మిగిలి ఉండగా ప్రత్యర్థి పార్టీలను గుక్క పట్టించాల నుకున్న వైసీపీకి చాలాచోట్ల గట్టి పోటీనే ఎదురవుతోంది. ఎంత ఒత్తిడి చేసినా, బెదిరించినా పరోక్షంగా పాత కేసులు తవ్వినా బంధువులు, మిత్రులకు అల్టిమేటం జారీచేసినా కొంద రు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. పోటీకే సై అన్నారు. తమకు ఆర్థిక బలం లేకపోయినా ప్రజాబలం తమవైపే ఉందని పుర బరిలో పోటీకి నిలిచారు. ఏలూరు కార్పొరేషన్‌లో అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా తెలుగుదేశం ఉంది. ఈ పార్టీలో ఎవరైనా అభ్యర్థి కాస్తంత పురోగతి సాధించాడంటే.. పోటీకి పూర్తిగా అడ్డు తగులుతున్నాడని భావిస్తే వెంటనే రాత్రికి రాత్రే వ్యూహం ఖరారు చేస్తున్నారు. ఆ వ్యక్తికి సంబంధించి బంధువులు ఎవరైనా ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా బహిరంగ ప్రదేశాల్లో కాస్తో కూస్తో అమ్మకాలు చేస్తున్నా అలాంటి వారందరికీ ఒత్తిళ్లు ఆరంభమైనట్లే. మీవాడు మరీ రెచ్చిపోతే ఇవన్నీ ఉండవంటూ హెచ్చరిస్తున్నారు. సాధారణం గా ఎన్నికలంటేనే ప్రత్యర్థి పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసు కోవడానికి నానా విధాలుగా ఆకర్ష్‌ మంత్రాన్ని పాటిస్తాయి. దీనికి తగ్గట్టుగానే తమ ప్రచార సరళిని ఎప్పటికప్పుడు ప్రత్య ర్థికి దీటుగా మార్చుకుంటాయి. కానీ ఏలూరు నగరంతోపాటు మిగతా మున్సిపాల్టీల్లోనూ ఈసారి జరుగుతున్న ఎన్నికలు చాలా స్పెషల్‌గా కన్పిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ పర్వంలోనే అంతా ఒక కొలిక్కి వస్తుందని భావించినా అలా రాకపోవడంతో వైసీపీ తన వ్యూహాన్ని మార్చి వేగాన్ని పెంచి మరికొన్నింటికి పదునుపెట్టి ప్రత్యర్థిపార్టీ అభ్యర్థులపై విసురు తోంది. తెలుగుదేశం అభ్యర్థులు నేరుగా వైసీపీతో తలపడు తుండగా.. జనసేన అభ్యర్థులు అనేకచోట్ల ఢీకొంటున్నారు. ఏలూరు కార్పొరేషన్‌లో నెగ్గడం ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నానికి అగ్ని పరీక్షగా ఉండగా ఇదే పరీక్షను టీడీపీ కన్వీనర్‌ బడేటి చంటి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సుధాకరకృష్ణ, జనసేన కన్వీనర్‌ అప్పలనాయుడు వంటి వారు ఎదుర్కొంటున్నారు. తమ అధిష్టానానికి తమ సత్తా ఏమిటో చూపిస్తామని హామీ ఇచ్చి పురపోరులో వీరంతా చక్రం తిప్పుతున్నారు. కానీ పోటీ లో ఉన్న అభ్యర్థులు ప్రతిరోజు ప్రచారానికయ్యే ఖర్చు కోసం చేయి చాస్తుండడంతో ఇదంతా తలకుమించిన భారం కావడం తో నేతలంతా తడబడే పరిస్థితి. ఈ పరీక్ష నుంచి గట్టెక్క డానికి శతవిధాలా ప్రయత్నాలు. 


మున్సిపాల్టీలు మోతెక్కుతున్నాయి

పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఎక్కడ ఏ సామాజిక వర్గం అసంతృప్తికి గురైనా.. తమ పార్టీ అభ్యర్థి విజయంపై ప్రభావం చూపుతుం దని కంగారు పడిపోతున్నారు. జంగారెడ్డిగూడెం మునిసిపాల్టీ లో వైసీపీ చైర్‌పర్సన్‌ పదవి మీకేనంటూ మహిళా అభ్యర్థి ఒకరికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగానే సదరు అభ్యర్థి, బంధువర్గం యావత్తూ రంగంలోకి దిగి తన సామాజి కవర్గానికి చెందిన వారే కాకుండా మిగతా వర్గీయులను కలు పుకుపోతూ ఏడాదిపైగా క్షణం తీరిక లేకుండా గడిపారు. ఈ పరిస్థితుల్లో వారికి చేతి చమురు వదిలింది. ఈలోపే పార్టీ వర్గ విభేదాలు రావడం, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రతిష్టకు పోవడంతో సీన్‌ కాస్తా రివర్స్‌ అయింది. ఇప్పటికిప్పుడు మీరు కాదు కాని తరువాత చూద్దాంలే అన్నట్లు ఓ మహిళా అభ్యరి ్థకి కొద్ది రోజుల క్రితమే తెగేసి చెప్పేశారు. దీంతో సామాజిక వర్గానికి చెందిన వారిలో అనేక మంది వైసీపీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనినే అదునుగా భావించి తెలుగుదేశం కొత్త వ్యూహాలు పన్నింది. ‘అందరం కలిసి పనిచేద్దాం ఏదున్నా పరిష్కరించుకుందాం, మీ వెంటే మేము.. మావెంటే మీరు అనే వాతావరణంలో కలిసి మెలిసి పనిచే ద్దాం’ అంటూ ఆఫర్లు ఇస్తున్నారు.నర్సాపురంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ మున్సిపాల్టీలో అధికార అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యే ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే సుబ్బారాయుడు మీద పడింది. ఇప్పటికే వచ్చే మంత్రివర్గ విస్తరణలో బెర్త్‌ ఖాయమంటూ ప్రసాదరాజువైపు ప్రచారం సాగుతోంది. ఇదే తరుణంలో సీనియర్‌ నేత కొత్తపల్లికి రాష్ట్రస్థాయి హోదాలో ఒక పదవి ఇవ్వవచ్చునని ఊహాగానాలు సాగుతున్న తరుణంలోనే మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ గెలుపు వీరిద్దరికీ భవిష్యత్‌ ప్రశ్నగా, పరీక్షగా మారింది. టీడీపీ సైతం జనసేనతో జత కట్టి అంతోఇంతో తన పురోగతిని ఇక్కడ పునాది వేయగలిగింది. నిడదవోలు మున్సిపా ల్టీలో ఎలాగూ టీడీపీ, వైసీపీలు నేరుగా ఢీకొంటున్నాయి. ఇక్కడ ఒకరికొకరు వివాదా లు కొని తెచ్చుకోకుండా పోటీ పడుతున్నారు. కొవ్వూరు మున్సిపాల్టీలో ఏకగ్రీవ ఫలితాలకు బీజేపీ, జనసేన గండికొట్టాయి. ఒక దశలో కొవ్వూరు మున్సిపాల్టీ రాష్ట్రంలోనే ఎన్నికలు లేని ఏకగ్రీవంగా చేజిక్కించుకున్న మున్సిపా ల్టీ అవుతుందని వైసీపీ లెక్కలు వేసింది. ఆ క్రెడిట్‌ అంతా మంత్రి వనితకే దక్కుతుందని పెద్దఎత్తున విశ్వాసం వ్యక్తం చేశాయి. ఇప్పు డు జరుగుతున్న పోరులో ఎట్టి పరిస్థితు ల్లోనూ మరో నాలుగు వార్డులను గెలుచు కుంటేనే వైసీపీకి కొవ్వూరు వశమవుతుంది. పది వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇక్కడ పోటీ పడుతున్నాయి. ఇక్కడ కేవలం ధన ప్రవా హంతోనే కొందరికి ఎరవేశారు. దీంతో కొవ్వూ రు ఎన్నిక చివరి క్షణంలో ఉత్కంఠకు గురయ్యే అవకాశం ఉంది. 

Updated Date - 2021-03-06T06:27:07+05:30 IST