ఆర్టీసీపై ఆయిల్‌ భారం

ABN , First Publish Date - 2021-03-01T05:19:13+05:30 IST

ప్రజా రవాణా సంస్థ(పీటీడీ–ఆర్టీసీ)పై డీజిల్‌ ధరల భారం అంతకంతకు పెరుగుతోంది.

ఆర్టీసీపై ఆయిల్‌ భారం

ఏడాదిలో రూ.21.50 పెరిగిన డీజిల్‌ ధర

ప్రతిరోజూ 30 వేల లీటర్ల వినియోగం

ఏడాదిలో 6.42 లక్షలకు

 పెరిగిన రోజువారీ ఖర్చు

ఏలూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా రవాణా సంస్థ(పీటీడీ–ఆర్టీసీ)పై డీజిల్‌ ధరల భారం అంతకంతకు పెరుగుతోంది. కరోనా, లాక్‌డౌన్‌ కష్టాలతో కొట్టు మిట్టాడుతున్న పీటీడీని ఆయిల్‌ ధరలు మరింత కుంగదీస్తున్నాయి. డీజిల్‌ ధర పెరిగే కొద్దీ ప్రజా రవాణాపై ఈ భారం మోయలేనిదిగా పరిణమిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 580 బస్సులు నడుస్తున్నాయి. వీటికి రోజూ 30 వేల లీటర్ల డీజిల్‌ అవసరం. ఈ ఆయిల్‌ ధర లీటరుకు రూపాయి పెరిగితే రోజుకు 30 వేలు అదనంగా ఖర్చవుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన రూ.82.23 వున్న డీజిల్‌ ధర 25 నాటికి రూ.84.34కు చేరింది. అంటే 25 రోజుల్లో లీటరుపై రూ.2.11 ధర పెరిగింది. దీని ప్రకారం ఈ ఒక్క నెలలోనే రోజుకు రూ.16 లక్షలు ఇంధన ఖర్చు పెరిగింది. అదే ఏడాదికైతే.. 1.10 లక్షల లీటర్ల డీజిల్‌ ఖర్చవుతుంది. ఒక్క రూపాయి డీజిల్‌ ధర పెరిగితే ఏడాదికి కోటీ 10 లక్షల రూపాయల భారం అదనంగా పడుతుంది. అలాంటిది గడిచిన ఏడాదిగా డీజిల్‌ ధర  రూ.22.40 పెరిగింది. గత ఫిబ్రవరి 25న  రూ.62.95 వున్న డీజిల్‌ ఇప్పుడు రూ.84.34కు పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా రోజువారీ ఆయిల్‌ ఖర్చు రూ.18.87 లక్షల నుంచి రూ.25.30 లక్షలకు చేరింది. ఏడాది క్రితం పీటీడీ బస్సుల ఆయిల్‌ ఖర్చు రోజుకు రూ.18.88 లక్షలు. ఇప్పుడు రూ.25.30 లక్షలకు పెరిగింది. దీనిని బట్టి డీజిల్‌ కోసం గత ఏడాది కంటే ఈ ఏడాది రోజుకు రూ.6.42 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఏడాదిలో పెరిగిన డీజిల్‌ ధర రూ.22.4 సగటు ధర ప్రకారం జిల్లా ప్రజా రవాణా శాఖపై రూ.12.65 కోట్ల ఖర్చు పెరిగింది. అసలే నష్టాల్లో పీటీడీకి ఇది మూలిగే నక్కపై తాటిపండు చందంగా మారింది. 

జిల్లా ప్రజా రవాణా శాఖ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. లాక్‌డౌన్‌ నష్టాల నుంచి కోలుకునేందుకు నానా అగచాట్లు పడుతున్న పీటీడీని ఆయిల్‌ ధరల పెరుగుదల కోలుకోలేని దెబ్బతీసింది. నష్టాల విష వలయంలో పీటీడీ కూరుకుపోయింది. ఒక్క జనవరిలోనే రూ.7 కోట్ల 34 లక్షల నష్టం వచ్చింది. గత ఏడాది జనతా కర్ఫ్యూ ప్రకటించిన మార్చి 24 నుంచి ఇప్పటి వరకూ రూ.129 కోట్ల నష్టం వచ్చింది. ఇది అంతకుముందు ఏడాది వచ్చిన నష్టాలకంటే మూడు రెట్లు అధికం. అంతకు ముందు ఏడాదిలో రూ.44 కోట్లు నష్టం మాత్రమే వచ్చింది. అలాంటిది ఈ ఏడాది దానికంటే రూ.85 కోట్ల నష్టం అదనంగా మీదపడింది. డీజిల్‌ రేటు పెరుగుదల వల్లే రూ.13 కోట్ల నష్టాలు మూట గట్టుకోవాల్సి వస్తోంది. 

డీజిల్‌ రేట్లు

2020 ఫిబ్రవరి 25న– 62.95

2021 ఫిబ్రవరి 1న–  82.23

2021 ఫిబ్రవరి 25న– 84.34

2020లో రోజువారీ డీజిల్‌ ఖర్చు– రూ. 18.87 లక్షలు

ఇప్పుడు రోజువారీ డీజిల్‌ ఖర్చు– రూ. 25.30 లక్షలు


Updated Date - 2021-03-01T05:19:13+05:30 IST